
సాక్షి, చెన్నై : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయాలను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నటుడు కమల్ హాసన్ తప్పుపట్టారు. నోట్ల రద్దును అమలు చేసి ఉండాల్సింది కాదన్న రాహుల్ నిర్ణయాన్ని తాను కొంతవరకూ సమర్ధిస్తానని చెప్పుకొచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం మక్కల్ నీది మయ్యం పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కమల్ నోట్ల రద్దుపై రాహుల్ ప్రకటనను స్వాగతించారు.
మరోవైపు తనకు క్రిస్టియన్ మిషనరీల నుంచి నిధులు అందుతున్నాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. తనకు మిషనరీల నుంచి నిధులు వస్తున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఈ వాదన హాస్యాస్పదమని కమల్ అన్నారు. దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, ఇది అవమానకరమని అభివర్ణించారు. కాగా, ‘తాను ప్రధాని అయితే ఎవరైనా నోట్ల రద్దు ఫైలును తనముందు ఉంచితే దాన్ని చెత్తబుట్టలో వేసేవాడి’నని మలేషియాలో భారత సంతతిని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం వాటిల్లిందని అన్నారు.