మహరాజ్‌గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న మోదీ
ఆర్థిక వేత్తలను ఎద్దేవా చేసిన ప్రధాని
మహరాజ్‌గంజ్ (యూపీ)
హార్వర్డ్ కంటే హార్డ్‌వర్కే శక్తిమంతమైనదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థికవేత్తలను ఎద్దేవాచేశారు. ‘నోట్ల రద్దు ప్రభావం ఎంతమాత్రం పడలేదనే విషయాన్ని జీడీపీ గణాం కాలు సూచిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే అంకెలు మెరుగుపడ్డాయి’ అని అన్నారు. నోట్ల రద్దు తొందరపాటుతో కూడిన చర్య అని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందంటూ నోబెల్ బహుమతి విజేత, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇటీవల కాలంలో రెండుమూడు పర్యాయాలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో బుధవారం ఇక్కడ నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.
స్వేదం చిందించడంద్వారా పేదవాడు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాడన్నారు. ఇక కాంగ్రెస్. సమాజ్‌వాదీ పార్టీల పొత్తు విషయమై మాట్లాడుతూ ఇందులో ఒక పార్టీ దేశాన్ని, మరొక పార్టీకి రాష్ట్రాన్ని నాశనం చేయగలిగిన కళ ఉందంటూ ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి కాంగ్రెస్ పార్టీకి దేశానికి ఏమిచేసిందంటూ నిలదీశారు.
కొబ్బరిచెట్లు కేరళలో పెరుగుతాయి
కొబ్బరినీళ్లపై వ్యాఖ్యల విషయమై స్పందిస్తూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మోదీ చురకలంటించారు. ‘ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు. ఆయన కలకాలం జీవించాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఓ ఎన్నికల సభలో ప్రసంగించేందుకు ఆయన ఇటీవల మణిపూర్ వెళ్లారు. కొబ్బరికాయల నుంచి నీళ్లుతీసి లండన్‌కు ఎగుమతి చేస్తామని ఆయన అక్కడి రైతులకు చెప్పారు. వాస్తవానికి కొబ్బరికాయలో నీళ్లు ఉంటాయి. అవి కేరళలో పెరుగుతాయి. ఇది ఎలా ఉందంటే పొటాటో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నట్టుంది.’అని అన్నారు. తమకు అధికారమిస్తే యూపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.