నోట్ బ్యాన్ ముందు వీటి పరిస్థితేమిటి?
ముంబై : పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం ప్రకటించడంతో కార్డు ద్వారా జరిగే లావాదేవీలు ఒక్కసారిగా ఎగబాకాయి. మూలన పడ్డ కార్డులను కూడా కస్టమర్లు బయటికి తీసి వాడుతున్నారు. అయితే నోట్ బ్యాన్కు ముందు ఎన్ని కార్డులు ఉన్నాయి. వాటి లావాదేవీలు ఎలా జరిగేయో ఓ సారి పరిశీలిద్దాం.. పెద్దనోట్ల రద్దుకు ముందు 71 కోట్ల మేర డెబిట్ కార్డులు దేశీయంగా ఉండేవట. వాటిలో కేవలం నెలకు 13 కోట్ల డెబిట్ కార్డుల లావాదేవీలు మాత్రమే జరిగేవని తెలిసింది. చాలామంది కార్డు పేమెంట్ చేయడం అయిపోయాక, వాటిని పక్కన పట్టేసేవారట. దీని ప్రకారం సంవత్సరానికి ఆశించిన స్థాయిలో డెబిల్ కార్డుల వాడకం పెరగక, కేవలం 2.2 సార్లు మాత్రమే యూసేజ్ పెరిగేదట. ఇక 30 కోట్ల రూపే కార్డు హోల్డర్స్లో 29 కోట్ల హోల్డర్స్ అసలు పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద కాని, కార్డు స్వైప్ మిషన్ల వద్ద కాని వాడేవారు కాదని గణాంకాలు చెబుతున్నాయి.. ఆ గణాంకాలన్ని కేవలం ప్రభుత్వం నోట్లను రద్దు చేసేంత వరకే.
ప్రధాని ఎప్పుడైతే నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించారో అప్పటినుంచి ఇప్పటివరకు రూపే డెబిట్ కార్డుల స్వైప్ 2.5 టైమ్స్ పెరిగినట్టు తెలిసింది. కొన్ని బ్యాంకులకైతే ఎప్పుడూ చూడనంతా కార్డుల వాడకం నాలుగింతల స్థాయిలో నమోదైనట్టు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.. డెబిట్ కార్డుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా.. వాటి వాడకంపై సర్వీసు చార్జీని ఈ ఏడాది చివరివరకు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా పీఓఎస్ టెర్మినల్స్ను మరిన్ని ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభానికి వీలుగా కార్డు స్వైప్, డెబిట్ కార్డుల యూసేజ్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో కార్డు స్వైపింగ్ మిషన్ల వద్ద డిమాండ్ 2000 శాతం పెరిగినట్టు ఇండియా మార్ట్ తెలిపింది. వ్యాపారాల వద్ద డెబిట్ కార్డుల లావాదేవీలు, క్రెడిట్ కార్డుల లావాదేవీలు చాలా చౌకగా జరుగుతున్నాయి. దీంతో కార్డుల వాడకం విపరీతంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.