నోట్ల రద్దు సాహసోపేతం
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన నిర్ణయమని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కరెన్సీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా ముఖ్యమైన ప్రారంభమని పేర్కొన్నారు. దీన్ని అమలుచేయడానికి ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలన్నారు. ఫిక్కీ 89వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మార్కెట్లోకి తిరిగి సరిపడ నగదును తీసుకురావడానికి ఎంతో సమయం పట్టదని భరోసా ఇచ్చారు. సమీప కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా, దీర్ఘకాలంగా నోట్ల రద్దు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. గత 5 వారాల్లో నగదు లావాదేవీలకు అనుబంధంగా డిజిటల్ కరెన్సీ జరిగిందని, ప్రస్తుతం దేశంలో 75 కోట్ల కార్డులు మార్కెట్లో ఉన్నాయని చెప్పారు.
ప్రపంచ ఆర్థికవ్యవస్థ పడిపోతుంది. ఈ సమయంలో దేశాలు తమకు తాముగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. పెరుగుతున్న వస్తు రక్షణ విధానంతో ప్రపంచ ఎకానమీలో అనిశ్చితత ఏర్పడింది. బ్రెగ్జిట్ ఓటింగ్ కూడా ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో వర్థమాన దేశాలన్నింటిలో చూస్తే భారత్ చాలా మెరుగ్గా ఉందన్నారు. 2017 సెప్టెంబర్ 16 నుంచి ప్రస్తుతమున్న పన్నులకు సంబంధించి చాలా తెరలు కనుమరుగవుతాయన్నారు. రాజ్యాంగ సవరణను చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ చాలా నిర్ణయాలను తీసుకుందని చెప్పారు. తుది ఆమోదం చెందడానికి ఎలాంటి మేజర్ సమస్యలు ఉంటాయని తాను భావించడం లేదన్నారు.