ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మొత్తం అయిదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించగా.. నోట్ల రద్దు నిర్ణయాన్ని నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్ నాగరత్నం మాత్రం తన నిర్ణయాన్ని దీనికి వ్యతిరేకంగా వెలువరించారు. అధికారిక ఉత్తర్వుల ద్వారా కాకుండా పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయం అమలు చేస్తే బాగుండేది అని తన తీర్పు ప్రతిలో వెల్లడించారు జస్టిస్ నాగరత్నం. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్లమెంటును విస్మరించడం సరైనది కాదని పేర్కొన్నారు జస్టిస్ నాగరత్న.
అయితే, మెజార్టీ జడ్జిలు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నోట్ల రద్దు అంశంలో కేంద్రానికి ఉపశమనం లభించింది. పెద్ద నోట్ల రద్దు అంశంలో కేంద్రం ఉద్దేశమే ముఖ్యమన్న సుప్రీంకోర్టు, ఆ ఉద్దేశాలు నెరవేరలేదన్న కారణంతో నిర్ణయాన్ని కొట్టివేయలేమని తెలిపింది. పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. 2016 నవంబర్ 8వ తేదీన కేంద్రం ఇచ్చిన నోట్ల రద్దు నోటిఫికేషన్ సరైందనేనని బెంచ్ స్పష్టం చేసింది.
జస్టిస్ నాగరత్న
నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లపై విచారణ జరిగింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో.. బీఆర్ గవాయ్, ఏఎస్ బొప్పన్నా, వీ రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే తీర్పుపై స్పందిస్తూ.. ఆర్థిక విధాన అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ సంప్రదింపులు జరిగాయి. అటువంటి చర్యను తీసుకురావడానికి సహేతుకమైన కారణం ఉంది. దామాషా సిద్ధాంతం వల్ల పెద్ద నోట్ల రద్దు జరగలేదని మేము భావిస్తున్నాము అని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే జస్టిస్ గవాయి వెల్లడించిన తీర్పుతో బెంచ్‌లోని జస్టిస్ నాగర్నత ఒక్కరే విభేధించడం గమనార్హం. నోట్ల రద్దు విషయంలో కేంద్రం వైఖరిని జస్టిస్ నాగరత్న తప్పుపట్టారు. ‘రహస్యంగా చేసిన ఈ చట్టం ఒక ఆర్డినెన్స్. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సింది’’ అని పేర్కొన్నారు.
ఇక.. 2016లో వెయ్యి, 500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఆపై ఇరువర్గాల వాడి వేడి విచారణ పూర్తి కావడంతో.. ఇవాళ్టి తుది తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ధర్మాసనం మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించింది.
Comments
Please login to add a commentAdd a comment