2జీ స్పెక్ట్రమ్‌పై సుప్రీం తలుపుతట్టిన మోదీ సర్కార్
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. వేలం విధానంలో కాకుండా తామే కేటాయింపులు జరుపుతామని కోర్టుకు తెలిపింది. వేలం ద్వారా మాత్రమే కేటాయింపులు జరపాలంటూ ఇచ్చిన గత తీర్పును సవరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలాల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అభ్యర్థించారు. ఈ అంశంపై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు.
ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్(ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత) పద్ధతిలో యూపీఏ హయాంలో ఏ.రాజా టెలికం మంత్రిగా ఉన్నపుడు 2జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించి కంపెనీలకు ఇచ్చిన 122 లైసెన్సులను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. కొన్ని సందర్భాల్లో వేలంలో కాకుండా ప్రభుత్వమే కేటాయింపులు జరపాలని ఆశిస్తోందని, అందుకే పాత తీర్పును సవరించాలని అటార్నీ జనరల్ సోమవారం కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, వివరాలను ఈ–మెయిల్‌లో పంపాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. అయితే తీర్పును సవరించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. నాటి తీర్పు సమంజసంగానే ఉందని, సవరణ అనవసరమని ఆయన వాదించారు.
ఆనాడు యూపీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా 2జీ స్పెక్ట్రమ్‌పై ప్రజా ప్రయోజనా వ్యాజ్యం దాఖలుచేసిన ఎన్‌జీవో సంస్థ తరఫున ఆనాడు ప్రశాంత్‌భూషణే వాదించారు. కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని మన్మోహన్ ప్రభుత్వంలో నాటి కమ్యూనికేషన్స్, ఐటీ సహాయ మంత్రి కపిల్‌సిబల్ 2011లో వాదించారు. అయితే ఈ కేసులో ఎ.రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2017 డిసెంబర్ 21న ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. ఈ తీర్పును సవాల్‌చేస్తూ సీబీఐ 2018 మార్చి 20న హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ కేటాయింపుల వల్ల కేంద్ర ఖజానాకు రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లిందని వాదించింది. వేలం విధానంలో జరగని కేటాయింపుల లైసెన్స్‌లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment