హిండెన్‌బర్గ్‌ నివేదిక.. సుప్రీంకోర్టు తీర్పు.. అదానీ ఏమన్నారంటే.. | Adani Group Stocks Rally On Wednesday As Supreme Court Announces Verdict On Adani-Hindenburg Case - Sakshi
Sakshi News home page

Adani-Hindenburg Case: సుప్రీంకోర్టు తీర్పు.. అదానీ ఏమన్నారంటే..

Published Wed, Jan 3 2024 11:23 AM | Last Updated on Wed, Jan 3 2024 2:30 PM

Supreme Verdict Adani Stock Rally - Sakshi

అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంలో అదానీ గ్రూపునకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలపై సెబీ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అనుమానించలేమని అత్యన్నత న్యాయ స్థానం తేల్చి చెప్పింది. ప్రముఖ బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ ఆధ్వర్యంలోని ఆర్గనైజ్డ్‌ క్రైమ్ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసీసీఆర్‌పీ) నివేదిక ఆధారంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెబీ చేస్తోన్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని నియంత్రణ సంస్థను ఆదేశించింది.

అదానీ గ్రూప్‌.. షేర్ల అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై నియంత్రణ సంస్థల వైఫల్యం లేదంటూ నిపుణుల కమిటీ గతంలో నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారంటూ పిటిషనర్‌ పేర్కొనడం గమనార్హం. 

హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల విచారణను సెబీ పూర్తి చేసింది. మిగతా కేసుల్లో మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది. ‘షార్ట్‌ సెల్లింగ్‌’ విషయంలో హిండెన్‌బర్గ్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా..? లేదా..? అని తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని, సెబీని కోరింది. వార్తా పత్రికలు, థర్డ్ పార్టీ నివేదిక ఆధారంగా సెబీని ప్రశ్నించలేమని కోర్టు తెలిపింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి వాటిని ఆధారాలుగా చేసుకోబోమని కోర్టు చెప్పింది.

అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సుప్రీంకోర్టు కొన్ని పిటిషన్లపై తీర్పును వెలువరించింది.

తాజాగా విడుదలైన తీర్పును ఉద్దేశించి ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ స్పందించారు. అ‍త్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తానని ఆయన తన ఎక్స్‌ ఖాతా ద్వారా తెలిపారు. ఎప్పటికైనా నిజం బయటకొస్తుందన్నారు. ‘సత్యమేవ జయతే, మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. భారతదేశవృద్ధికి అదానీ గ్రూప్‌ సహకారం కొనసాగుతుంది’ అని అన్నారు.

ఇదీ చదవండి: కొత్త ఏడాది మొదలవనున్న పబ్లిక్‌ ఇష్యూలు..

అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీలు..

  • అదానీ ఎంటర్‌ప్రైజెస్‌
  • అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌
  • అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌
  • అదానీ పవర్‌ లిమిటెడ్‌
  • అదానీ టోటల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌
  • అదానీ విల్‌మర్‌ లిమిటెడ్‌
  • ఎన్‌డీటీవీ
  • అంబుజా సిమెంట్స్‌
  • ఏసీసీ లిమిటెడ్‌
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement