అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. దాంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లు ప్రారంభం అయిన సమయం నుంచి కేవలం అదానీ గ్రూప్ లిస్ట్‌డ్ కంపెనీల నుంచే దాదాపు రూ.2.6 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ప్రతిషేరు సుమారు 20 శాతం నష్టాల్లో కదలాడుతున్నాయి. దాంతో అదానీ గ్రూప్ సంస్థల సంపద రూ.12.3 లక్షల కోట్లకు చేరినట్లు తెలిసింది.
ఏయే కంపెనీలు ఎంతే నష్టపోయాయంటే..
అదానీ ఎంటర్ప్రైజెస్: 20 శాతం
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్: 20 శాతం
అదానీ గ్రీన్ ఎనర్జీ: 18 శాతం
అదానీ పవర్: 14 శాతం
అదానీ టోటల్ గ్యాస్: 14 శాతం
అంబుజా సిమెంట్స్: 18 శాతం
ఏసీసీ: 15 శాతం
అదానీ విల్మార్: 10 శాతం
ఎన్డీటీవీ: 14 శాతం
సంఘీ ఇండస్ట్రీస్: 6 శాతం
అసలు కేసేంటి?
20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల(రూ.16,890 కోట్లు) లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఇవ్వచూపినట్లు అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ సోలార్ ప్రాజెక్ట్‌ల్లో అమెరికా ఇన్వెస్టరల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం ఎఫ్‌బీఐ ద్వారా దర్యాప్తు చేస్తోంది. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. దాంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురిని ఇందులో నిందితులుగా చేర్చారు.
డాలర్ డినామినేటెడ్ బాండ్లపై అదానీ ప్రకటన
అమెరికా కేసు అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్‌లో ముందుకువెళ్లకూడదని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువారం ఎక్స్ఛేంజీలకు ప్రకటన విడుదల చేసింది. ‘అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్, యూఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజీ కమిషన్(ఎస్‌ఈసీ)లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా బోర్డు సభ్యులపై నేరాభియోగాలు చేశాయి. కాబట్టి ప్రతిపాదిత డాలర్ డినామినేషన్ బాండ్ల విషయంలో ముందుకువెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది. ఈ ఆఫర్ విలువ సుమారు రూ.3,960 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: అదానీ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
‘అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే సహించబోం’
ఈ వ్యవహారంపై అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ స్పందించారు. అదానీ సోలార్ ప్రాజెక్ట్‌ల కాంట్రాక్ట్‌ల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం ఉందని చెప్పారు. ఈ అంశంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ కేసును ఎఫ్‌బీఐ న్యూయార్క్ కార్పొరేట్, సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్స్ దర్యాప్తు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment