అదానీ గ్రూప్‌పై అమెరికాలో నమోదైన లంచాల ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్, ఫ్రాన్స్ ఇంధన రంగ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ తాజాగా స్పందించాయి. గతేడాది యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల తదుపరి అదానీ గ్రూప్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రూప్‌తో భాగస్వామ్య కంపెనీని కలిగి ఉంది. కాగా.. అదానీ గ్రూప్‌లోని తమ పెట్టుబడులన్నీ అత్యంత లాభదాయకంగా ఉన్నట్లు జీక్యూజీ తెలియజేసింది. యూఎస్‌లో కేవలం వ్యక్తులపైనే లంచాల ఆరోపణలు నమోదైనట్లు ప్రస్తావించింది.
తాము పెట్టుబడులు చేపట్టిన అదానీ గ్రూప్ పటిష్టంగానే ఉన్నట్లు జీక్యూజీ పేర్కొంది. విడిగా గ్రూప్ కంపెనీల బిజినెస్ మూలాలు పటిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. అదానీ గ్రూప్‌లో జీక్యూజీ 8 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను కలిగి ఉంది. అంతక్రితం వాల్‌మార్ట్, ఒరాకిల్, సీమెన్స్, ఫైజర్, హనీవెల్ తదితర పలు గ్లోబల్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్‌లపై సైతం వివిధ ఆరోపణలను ఎదుర్కొన్నట్లు పేర్కొంది.
పెట్టుబడుల నిలిపివేత
మరోవైపు అదానీ గ్రూప్ అత్యున్నత అధికారులపై లంచాల ఆరోపణల నేపథ్యంలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ ప్రస్తుతానికి తాజా పెట్టుబడులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అదానీ టోటల్ గ్యాస్‌తోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ ఫ్రెంచ్ దిగ్గజానికి పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. అదానీ టోటల్ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కలిగి ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ టోటల్‌కు 19.75 శాతం వాటా ఉంది.
ఇదీ చదవండి: ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలు
ఆర్థికంగా పటిష్టం: అదానీ గ్రూప్
తగినంత నగదు నిల్వలు, లాభార్జన నేపథ్యంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ తాజాగా వెల్లడించింది. దీంతో రుణ చెల్లింపులకు సమస్యలు ఎదురుకాబోవని స్పష్టం చేసింది. అంతేకాకుండా వృద్ధి అవకాశాలకు సైతం నిధులు సరిపోతాయని తెలియజేసింది. తద్వారా ఇన్వెస్టర్లకు భరోసానిచ్చింది. కంపెనీ అత్యున్నత ఎగ్జిక్యూటివ్‌లపై యూఎస్‌లో లంచాల ఆరోపణలు వెలువడిన కారణంగా ఇన్వెస్టర్లకు ఒక నోట్‌లో కంపెనీ ఆర్థిక పరిస్థితులను కంపెనీవద్ద రూ.55,024 కోట్ల నగదు నిల్వలున్నాయని, ఇవి రాగల 28 నెలల్లో చేపట్టవలసిన దీర్ఘకాలిక రుణ చెల్లింపులకంటే అధికమని తెలియజేసింది. గత ఆరు నెలల్లో గ్రూప్ రూ.75,227 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే ఇదేసమయంలో మొత్తం రుణ భారం రూ.16,882 కోట్లు మాత్రమే పెరిగినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment