సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంపై మోదీ సర్కార్ తీరును మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తీవ్రంగా తప్పుపట్టారు. నోట్ల రద్దుతో వ్యాపారాలు మూతపడి, లక్షలాది ఉద్యోగాలు కోల్పోతే అది మంచి నిర్ణయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏడాది కిందట ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దును వరుస ట్వీట్లలో చిదంబరం విమర్శించారు. నోట్ల రద్దు నైతిక చర్యని ఆర్థిక మంత్రి సమర్ధించుకుంటున్నారని కోట్లాది మంది ప్రజలను కష్టాల్లోకి నెట్టారని, 15 కోట్ల మంది రోజువారీ కార్మికులకు చుక్కలు చూపించారని నోట్ల రద్దు పర్యవసానాలపై ఆయన విరుచుకుపడ్డారు.
జనవరి-ఏప్రిల్ 2017 మధ్య 15 లక్షల ఉద్యోగాలను ఊడగొట్టడం నైతికమా అంటూ చిదంబరం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వేలాది చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడటం, సూరత్, భివాండి, మొరదాబాద్, ఆగ్రా, లూథియానా, తిరుపూర్ వంటి పారిశ్రామిక హబ్‌లను విచ్ఛిన్నం చేయడం నైతికమా అని ట్వీట్ చేశారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని సులభంగా తెల్లధనంగా మార్చుకునే మార్గాన్ని ప్రభుత్వం కనిపెట్టలేదా అని నిలదీశారు. నోట్ల రద్దును నైతిక చర్యగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించడం పట్ల చిదంబరం వరుస ట్వీట్లతో కౌంటర్ ఇచ్చారు.
ప్రజల చేతిలో ఉన్న నగదు త్వరలోనే నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 2016 స్థాయిలకు చేరుతుందని చిదంబరం వ్యాఖ్యానించారు. చెలామణిలో ఉన్న నగదు రూ 15 లక్షల కోట్లు దాటి పెరుగుతున్న క్రమంలో త్వరలోనే అది సాధారణ స్థాయైన రూ 17 లక్షల కోట్లకు చేరుతుందని అన్నారు. ఎంత నగదు వ్యవస్థలో ఉండాలన్నది ఆర్‌బీఐ నిర్ణయమని, నగదు చెలామణిని కృత్రిమంగా తగ్గిస్తే అది డిమాండ్ తగ్గుదలకు, వృద్ధి తరుగుదలకు దారితీస్తుందని చిదంబరం హెచ్చరించారు. నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి ఆర్‌బీఐ బోర్డు అజెండా, బ్యాక్‌గ్రౌండ్ నోట్, అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నోట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment