కోల్‌కతా : 2019 కంటే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం జోస్యం చెప్పారు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. తమిళనాడులో ఇండియా కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుందని నమ్ముతున్నాను. కేరళలో రెండు ఫ్రంట్‌లు (యూడీఎఫ్- ఎల్‌డీఎఫ్) 20 సీట్లలో విజయం సాధిస్తాయి. బీజేపీ గెలవడం కష్టం. 2019 కంటే కాంగ్రెస్‌కు చాలా ఎక్కువ సీట్లు వస్తాయని చిదంబరం అన్నారు. కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లను గెలుచుకుంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని పేర్కొంటూ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఢిల్లీలలో ఇండియా కూటమికి ఎక్కువ విజయవకాశాలు ఉన్నాయంటూ నివేదికలు సైతం వస్తున్నాయని తెలిపారు.
ఇదే సమయంలో కచ్చతీవు సమస్య ముగిసిందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తడం ఏమిటని ప్రశ్నించారు. కచ్చతీవు సమస్య ముగిసింది. 50ఏళ్ల క్రితం ఒప్పందం కుదిరింది. 2014 నుంచి ప్రధాని మోదీ అధికారంలో ఉన్నారు. గత 10 ఏళ్లుగా ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? అని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం నొక్కాణించారు.
Comments
Please login to add a commentAdd a comment