నోట్ల మార్పిడి ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే
భోపాల్: చనిపోయిన తన తండ్రి విడిచి వెళ్లిన పాత నోట్లు రూ.50 వేలను డిపాజిట్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించింది. ప్రస్తుతం ఎన్ఆర్‌ఐలకు సంబంధించిన నోట్లను మాత్రమే జమ చేసుకుంటున్నామని స్పష్టం చేసింది. తండ్రి మరణానికి సంబంధించిన దస్తావేజులు చూపించినప్పటికీ ఆర్బీఐ అధికారులు అంగీకరించలేదు. భోపాల్‌కు చెందిన సింగ్ మారన్ అనే వ్యక్తికి శివ్‌చారన్ సింగ్ మారన్ (93) అనే వ్యక్తి తండ్రిగా ఉన్నాడు. ఆయన గత ఏడాది (2016) డిసెంబర్ 26న తీవ్ర అనారోగ్యానికిలోనై చనిపోయాడు.
అనంతరం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు ఇటీవలె ఇల్లును శుభ్రం చేసే పనులు మొదలుపెట్టారు. పాత సామానంత బయటపడేసే క్రమంలో తండ్రి గదిలోని ఓ సొరుగులో రూ.50వేలు పాత ఐదువందల నోట్లలో లభ్యం అయ్యాయి. 93 ఏళ్ల తండ్రి జ్ఞాపకశక్తిని కోల్పోవడం వల్లే ఆ డబ్బు వివరాలు ఎవరికీ చెప్పలేదని భోపాల్‌లోని ఆర్‌బీఐకి వివరణ ఇవ్వడంతోపాటు ఆయన చనిపోయినప్పడు నమోదు చేసిన ధ్రువీకరణ పత్రాలు, అతడి ఆరోగ్యం వివరాలకు సంబంధించిన పత్రాలు చూపించారు.
అయినప్పటికీ ప్రస్తుతం ఎన్ఆర్‌ఐలకు మాత్రమే నగదు మార్పిడి చేస్తున్నారని, అది కూడా ఢిల్లీకి చెందిన ఆర్‌బీఐ వద్దేనని చెప్పడంతో అతడు ప్రస్తుతం ఎలాగైనా తన పాత డబ్బును కొత్తనోట్లలోకి మార్చుకునే ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు.