ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : నోట్ల రద్దు తర్వాత జనం భారీగా నగదు ఉపసంహరించుకోవడంతో డీలాపడ్డ బ్యాంకులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. డిపాజిట్లతో కళకళలాడుతున్నాయి. వరసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో తీవ్ర నగదు కొరతను ఎదుర్కొన్న బ్యాంకులు గడచిన రెండు క్వార్టర్లలో (త్రైమాసికం) భారీగా డిపాజిట్లను ఆకర్షించాయి. గత ఏడాది చివరి త్రైమాసికం, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కలిపి రూ.36 వేల కోట్ల మేర డిపాజిట్లు వచ్చాయి. ఈ ఏడాది మొదటి క్వార్టర్ అంటే జూన్ 30 నాటికి కొత్తగా రూ.19 వేల కోట్ల డిపాజిట్లు వచ్చినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ బ్యాంకింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ఓ నివేదికలో పేర్కొంది.
గడచిన ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి తెలంగాణలో మొత్తం 5,395 బ్యాంకు శాఖల వద్ద రూ.4.12 లక్షల కోట్ల మేర డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. నోట్ల రద్దుకు రెండేళ్ల ముందు, నోట్ల రద్దు తర్వాత రెండేళ్లలో డిపాజిట్ల వృద్ధి రేటులో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో రియల్ బూమ్ బాగా పుంజుకోవడంతో గడచిన ఆర్థిక సంవత్సరం చివరి ఐదు మాసాల్లో డిపాజిట్లు పెరిగాయి. మొత్తమ్మీద డిపాజిట్లలో 4.36 శాతం పెరుగుదలతో బ్యాంకులకు ఊరట లభించింది.
ఆ 15 నెలలు గడ్డు పరిస్థితులు
2016 నవంబర్ 8న కేంద్రం నోట్లు రద్దు చేసింది. దీంతో 2016–17 రెండో అర్ధ సంవత్సరం, 2017–18 మొదటి మూడు క్వార్టర్లలో బ్యాంకులు 15 నెలలపాటు తీవ్ర నగదు కొరత ఎదుర్కొన్నాయి. దీనికితోడు ఖాతాల్లోని నగదు, డిపాజిట్లకు సంబంధించిన సొమ్ముపై పన్ను చెల్లించాలంటూ ఆదాయ పన్ను శాఖ లక్షల మందికి నోటీసులు ఇవ్వడంతో ఖాతాదారులు భయాందోళనకు గురయ్యారు. ఒక దశలో బ్యాంకులో రూ.లక్ష డిపాజిట్ చేయడానికి కూడా ఖాతాదారులు ధైర్యం చేయలేదు. దీంతో ఆ 15 మాసాలు బ్యాంకింగ్ కార్యకలాపాల్లో స్తబ్దత నెలకొంది. ఖాతాదారులకు నగదు ఇవ్వలేక బ్యాం కులు చేతులెత్తేశాయి. చివరకు ఏటీఎంలను కూడా మూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రిజర్వు బ్యాంకు పెద్ద ఎత్తున నగదును బ్యాంకులకు తరలించడం, ఖాతాదారులు కోరినంత నగదు ఇవ్వడంతో గడచిన ఆర్థిక సంవత్సరం నవంబర్ నుంచి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఊపు తెచ్చిన రియల్ బూమ్
నగరంలో ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్లు, జిల్లాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు పుంజుకోవడంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. నోట్ల రద్దు తర్వాత ఐటీ నోటీసుల కారణంగా ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచడం శ్రేయస్కరం కాదని భావించి ఇళ్ల స్థలాలు, భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం లభించింది. రియల్ బూమ్ కారణంగా పెద్దఎత్తున వచ్చి పడుతున్న డబ్బు మళ్లీ ఖాతాదారుల ద్వారా బ్యాంకులకు చేరడం మొదలైంది. గడచిన ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి 31 దాకా డిపాజిట్ల రూపంలో రూ.13,500 కోట్లు, సేవింగ్, కరెంట్ ఖాతాల్లో రూ.43 వేల కోట్లు జమయ్యాయి.
రద్దుకు ముందు.. తర్వాత..
నోట్ల రద్దుకు ముందు అంటే 2016 అక్టోబర్ 31 నాటికి తెలంగాణలో బ్యాంకుల వద్ద రూ.4.11 లక్షల కోట్ల మేర డిపాజిట్లు ఉండగా.. నోట్ల రద్దు తర్వాత (2017 మార్చి 31 నాటికి) అవి రూ.3.95 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. ఆ డిపాజిట్ల మొత్తం ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 4.12 లక్షల కోట్లకు పెరిగాయి. 2014లో 16.05 శాతం పెరుగుదలతో 2.85 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, ఆ తర్వాత ఏడాది అంటే 2015లో 14.80 శాతం వృద్ధితో రూ.3.28 లక్షల కోట్లకు పెరిగాయి. నోట్ల రద్దుతోపాటు ఐటీ నోటీసుల కారణంగా 2016లో కేవలం 8.88 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఆ తర్వాత ఏడాది అతి స్వల్పంగా డిపాజిట్లలో 4.36 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. అది కూడా గడచిన ఏడాది డిసెంబర్, ఈ ఏడాది మార్చి 31 మధ్య పెరిగిన డిపాజిట్లే కావడం గమనార్హం.
రుణాలపై ప్రభావం..
నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన నగదు సంక్షోభంతో రాష్ట్రంలోని బ్యాంకులు గడచిన ఆర్థిక సంవత్సరంలో రుణాలను లక్ష్యం మేర ఇవ్వలేక పోయాయి. 2016–17తో పోలిస్తే 2017–18లో వివిధ రంగాలకు ఇచ్చిన రుణాలు తక్కువే. 2016–17లో రూ.3.77 లక్షల కోట్ల మేర రుణాలు ఇవ్వగా 2017–2018లో రూ.3.92 లక్షల కోట్ల మేరకే రుణాలిచ్చారు. రుణాల వితరణలో వృద్ధి 4.03 శాతం మాత్రమే నమోదైంది. ప్రస్తుతం బ్యాంకులకు ప్రజల నుంచి నగదు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాన్ని 22.32 శాతం మేర పెంచి రూ.4.80 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.87,678 కోట్లు అధికం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment