రద్దు నాటికే తగినన్ని కొత్తనోట్లు
పార్లమెంటరీ సంఘం ఎదుట ఉర్జిత్ పటేల్ వివరణ
రఘురామ్ రాజన్ టైమ్‌లోనే దీనిపై చర్చలు మొదలు
రహస్యం కనుక ఏ రికార్డులూ నిర్వహించలేదని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్ నిర్ణయం ప్రకటించే తేదీ నవంబర్ 8 నాటికే కొత్త రూ.500, రూ.2,000 నోట్ల నిల్వలు తగిన స్థాయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ‘‘సిద్ధం’’ చేసుకున్నట్లు గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇటు ఆర్‌బీఐకానీ, అటు ప్రభుత్వంకానీ ఎటువంటి రికార్డులూ నిర్వహించలేదని చెప్పారాయన. అత్యంత రహస్యమైన అంశంగా దీనిని కొనసాగించాల్సి రావడమే దీనికి కారణమన్నారు.
ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు ఆయన లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. డీమోనిటైజేషన్ ప్రకటన అనంతరం ప్రజల నగదు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలన్నింటినీ ఆర్‌బీఐ తీసుకుందని తెలిపారు. నగదుకు ప్రింటిగ్ సామర్థ్యం, అలాగే బ్యాంక్ నోట్ పేపర్, ఇంక్ సహా ఇతర అవసరాలకు సంబంధించిన అంశాలన్నింటిపై తరచూ ప్రభుత్వంతో ఆర్‌బీఐ అధికారులు సంప్రదింపులు జరుపుతుంటారని స్థాయీ సంఘానికి ఆయన తెలియజేశారు.
పెద్ద నోట్ల రద్దు విషయంపై రఘురామ్ రాజన్ గవర్నర్‌గా ఉన్న సమయం– 2016 ప్రారంభం నుంచే చర్చలు ప్రారంభమయ్యాయని కూడా పటేల్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి చర్చల మినిట్స్ ఏవీ లేవని కూడా వివరణిచ్చారు.