Deposits Collection
-
అక్రమ డిపాజిట్ల కేసు.. ‘మార్గదర్శి‘కి ‘ఆర్బీఐ’ షాక్
సాక్షి,హైదరాబాద్: రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్కు తెలంగాణ హైకోర్టులో ఎదరుదెబ్బ తగిలింది. డిపాజిట్ల సేకరణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) యాక్ట్ తమకు వర్తించదని మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్ ప్రస్తతం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. అయితే..తమపై అక్రమ డిపాజిట్ల సేకరణ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్‌కు ఆర్బీఐ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిపాజిట్లు సేకరించడంపై విచారణ కొనసాగించాల్సిందేనని అఫిడవిట్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. మార్గదర్శికి ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్-45 వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంకు తన కౌంటర్లో హైకోర్టుకు తెలిపింది. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించడం చట్టవ్యతిరేకమని ఆర్బీఐ కుండబద్దలు కొట్టింది. మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆర్బీఐ కోరింది. అక్రమంగా డిపాజిట్లు సేకరణ విషయంలో నేరం రుజువైతే మార్గదర్శి డైరెక్టర్లకు 2 నుంచి 5 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది. అక్రమ డిపాజిట్ల సేకరణకు సంబంధించి మార్గదర్శిపై 2008లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. ఆర్బీఐ యాక్ట్‌కు విరుద్ధంగా మార్గదర్శి వేల మంది నుంచి సంవత్సరాల తరబడి అక్రమ డిపాజిట్లు సేకరిస్తోందని, దానిపై చర్యలు తీసుకోవాలనేది ఉండవల్లి కేసు సారాంశం. -
బ్యాంకుల్లో గలగల
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : నోట్ల రద్దు తర్వాత జనం భారీగా నగదు ఉపసంహరించుకోవడంతో డీలాపడ్డ బ్యాంకులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. డిపాజిట్లతో కళకళలాడుతున్నాయి. వరసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో తీవ్ర నగదు కొరతను ఎదుర్కొన్న బ్యాంకులు గడచిన రెండు క్వార్టర్లలో (త్రైమాసికం) భారీగా డిపాజిట్లను ఆకర్షించాయి. గత ఏడాది చివరి త్రైమాసికం, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కలిపి రూ.36 వేల కోట్ల మేర డిపాజిట్లు వచ్చాయి. ఈ ఏడాది మొదటి క్వార్టర్ అంటే జూన్ 30 నాటికి కొత్తగా రూ.19 వేల కోట్ల డిపాజిట్లు వచ్చినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ బ్యాంకింగ్ కమిటీ (ఎస్ఎల్బీసీ) ఓ నివేదికలో పేర్కొంది. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి తెలంగాణలో మొత్తం 5,395 బ్యాంకు శాఖల వద్ద రూ.4.12 లక్షల కోట్ల మేర డిపాజిట్లు ఉన్నట్లు తెలిపింది. నోట్ల రద్దుకు రెండేళ్ల ముందు, నోట్ల రద్దు తర్వాత రెండేళ్లలో డిపాజిట్ల వృద్ధి రేటులో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో రియల్ బూమ్ బాగా పుంజుకోవడంతో గడచిన ఆర్థిక సంవత్సరం చివరి ఐదు మాసాల్లో డిపాజిట్లు పెరిగాయి. మొత్తమ్మీద డిపాజిట్లలో 4.36 శాతం పెరుగుదలతో బ్యాంకులకు ఊరట లభించింది. ఆ 15 నెలలు గడ్డు పరిస్థితులు 2016 నవంబర్ 8న కేంద్రం నోట్లు రద్దు చేసింది. దీంతో 2016–17 రెండో అర్ధ సంవత్సరం, 2017–18 మొదటి మూడు క్వార్టర్లలో బ్యాంకులు 15 నెలలపాటు తీవ్ర నగదు కొరత ఎదుర్కొన్నాయి. దీనికితోడు ఖాతాల్లోని నగదు, డిపాజిట్లకు సంబంధించిన సొమ్ముపై పన్ను చెల్లించాలంటూ ఆదాయ పన్ను శాఖ లక్షల మందికి నోటీసులు ఇవ్వడంతో ఖాతాదారులు భయాందోళనకు గురయ్యారు. ఒక దశలో బ్యాంకులో రూ.లక్ష డిపాజిట్ చేయడానికి కూడా ఖాతాదారులు ధైర్యం చేయలేదు. దీంతో ఆ 15 మాసాలు బ్యాంకింగ్ కార్యకలాపాల్లో స్తబ్దత నెలకొంది. ఖాతాదారులకు నగదు ఇవ్వలేక బ్యాం కులు చేతులెత్తేశాయి. చివరకు ఏటీఎంలను కూడా మూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రిజర్వు బ్యాంకు పెద్ద ఎత్తున నగదును బ్యాంకులకు తరలించడం, ఖాతాదారులు కోరినంత నగదు ఇవ్వడంతో గడచిన ఆర్థిక సంవత్సరం నవంబర్ నుంచి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఊపు తెచ్చిన రియల్ బూమ్ నగరంలో ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు, జిల్లాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు పుంజుకోవడంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. నోట్ల రద్దు తర్వాత ఐటీ నోటీసుల కారణంగా ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచడం శ్రేయస్కరం కాదని భావించి ఇళ్ల స్థలాలు, భూములపై భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం లభించింది. రియల్ బూమ్ కారణంగా పెద్దఎత్తున వచ్చి పడుతున్న డబ్బు మళ్లీ ఖాతాదారుల ద్వారా బ్యాంకులకు చేరడం మొదలైంది. గడచిన ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి 31 దాకా డిపాజిట్ల రూపంలో రూ.13,500 కోట్లు, సేవింగ్, కరెంట్ ఖాతాల్లో రూ.43 వేల కోట్లు జమయ్యాయి. రద్దుకు ముందు.. తర్వాత.. నోట్ల రద్దుకు ముందు అంటే 2016 అక్టోబర్ 31 నాటికి తెలంగాణలో బ్యాంకుల వద్ద రూ.4.11 లక్షల కోట్ల మేర డిపాజిట్లు ఉండగా.. నోట్ల రద్దు తర్వాత (2017 మార్చి 31 నాటికి) అవి రూ.3.95 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. ఆ డిపాజిట్ల మొత్తం ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 4.12 లక్షల కోట్లకు పెరిగాయి. 2014లో 16.05 శాతం పెరుగుదలతో 2.85 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, ఆ తర్వాత ఏడాది అంటే 2015లో 14.80 శాతం వృద్ధితో రూ.3.28 లక్షల కోట్లకు పెరిగాయి. నోట్ల రద్దుతోపాటు ఐటీ నోటీసుల కారణంగా 2016లో కేవలం 8.88 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఆ తర్వాత ఏడాది అతి స్వల్పంగా డిపాజిట్లలో 4.36 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. అది కూడా గడచిన ఏడాది డిసెంబర్, ఈ ఏడాది మార్చి 31 మధ్య పెరిగిన డిపాజిట్లే కావడం గమనార్హం. రుణాలపై ప్రభావం.. నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన నగదు సంక్షోభంతో రాష్ట్రంలోని బ్యాంకులు గడచిన ఆర్థిక సంవత్సరంలో రుణాలను లక్ష్యం మేర ఇవ్వలేక పోయాయి. 2016–17తో పోలిస్తే 2017–18లో వివిధ రంగాలకు ఇచ్చిన రుణాలు తక్కువే. 2016–17లో రూ.3.77 లక్షల కోట్ల మేర రుణాలు ఇవ్వగా 2017–2018లో రూ.3.92 లక్షల కోట్ల మేరకే రుణాలిచ్చారు. రుణాల వితరణలో వృద్ధి 4.03 శాతం మాత్రమే నమోదైంది. ప్రస్తుతం బ్యాంకులకు ప్రజల నుంచి నగదు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాన్ని 22.32 శాతం మేర పెంచి రూ.4.80 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.87,678 కోట్లు అధికం కావడం విశేషం. -
బ్యాంకర్లపై అట్రాసిటీ కేసులు
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పేదలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రుణాల గ్రౌండింగ్‌లో బ్యాంకర్లు అవలంబిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రుణాలివ్వని బ్యాంకర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆయా కార్పొరేషన్ల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవె న్యూ సమావేశ మందిరంలో డీఎల్ఆర్సీ, డీసీసీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా 2014 నుండి 2018 వరకు ప్రభుత్వం నుండి వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన రుణాలు, గ్రౌండింగ్, సబ్సిడీలు విడుదలపై బ్యాంకర్లు, అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలు, వాటి గ్రౌండింగ్, అమలులో సమస్యలపై ఆరా తీశారు. బ్యాంకర్లు రుణాల మంజూరుపై అవలంభిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని, ప్రజావాణిలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. చిన్నదర్పల్లిలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే సమావేశం లో ప్రస్తావించగా స్పందించిన కలెక్టర్ బ్యాంకర్‌పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లపై కేసులను చిన్నదర్పల్లి నుండే ప్రారంభించాలని సూచించారు. బ్యాంకర్లు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవ ని హెచ్చరించారు. యూనిట్లు లేకున్నా ఉన్నట్లు బ్యాంకర్లు సర్టిఫికేట్లు ఇవ్వడంతో ప్రభుత్వం సబ్సిడీలు విడుదల చేస్తుందని, జిల్లాలో 70 శాతం యూనిట్లు ఇలాంటివే ఉంటున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలని, బ్యాంకర్లు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యూనిట్లను ధ్రువీకరించాలని కలెక్టర్ సూచించారు. కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్సు బిజినెస్ వద్దు ‘ప్రభుత్వం మంజూరు చేసి యూనిట్లకు కాన్సెంట్ అవసరమే లేదు.. కాన్సెంట్ ఎందుకు అడుగుతున్నారు.. మండల స్థాయిలోని ఎంపిక కమిటీ నిర్ణయం ప్రకారం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాల్సిందే’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆయా కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ మద్దతు పథకాలకు సంబందించిన అధికారులు ఈ విషయాన్ని గుర్తించుకుని మాట్లాడాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులుగా ఉండి ఈ విషయం తెలియకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో వివిధ బ్యాంకులు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాల గ్రౌండింగ్‌కు డిపాజిట్లు సేకరిస్తున్నట్లు సమాచారముందని, అంతేకాకుండా రుణాలు విడుదల చేస్తూ ఇన్సూరెన్సు కోత విధిస్తున్నట్లు తెలిసిందని. ఇకనైనా కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్స్‌ల పేరుతో బిజినెస్‌లు చేయొద్దని హెచ్చరించారు. లక్ష్యం మేరకు పంట రుణాలు జిల్లాలో రబీ కంటే ఖరీఫ్ సాగు ఎక్కువగా వేస్తారని, వర్షాలు కురుస్తున్నందున పంట రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. టార్గెట్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ లోపు భూ ప్రక్షాళన కార్యక్రమం తప్పొప్పుల సవరణ పూర్తి కానుందని, త్వరలో ధరణి లింక్‌ను ప్రభుత్వం బ్యాంకర్లకు ఇవ్వనుందని తెలిపారు. ఆన్లైన్లో భూ రికార్డులు పక్కాగా అందుబాటులోకి రానున్నాయని, అప్పటివరకు తాము ఇచ్చే బ్యాంకు వారీగా రైతులు, ఖాతాలు, భూ వివరాల నివేదిక ఆధారంగా రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్, పరిగి ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్‌రెడ్డి, ఎల్డీఎం ప్రభాకర్ శెట్టి, నాబార్డు ఏజీఎం అమితాబ్ భార్గవ్, ఆర్బీఐ అధికారులు, కార్పొరేషన్లు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆశల ఎర వేసి.. అసలుకు ఎసరు
- బోర్డు తిప్పేసిన సువర్ణ ఇండియా - అధిక వడ్డీల ప్రలోభంతో డిపాజిట్ల సేకరణ - పలు జిల్లాల్లో రూ.8 కోట్లకు ఎగనామం - ‘తూర్పు’లోనే రూ.రెండు కోట్లకు పైగా స్వాహా - పోలీసుల అదుపులో సంస్థ ఎండీ వేణు మెరుగు పేరుతో బంగారాన్ని కాజేసే మోసగాళ్లు, పోలీసులు తనిఖీ చేస్తున్నారని ఒంటి మీది నగలు తీయించి, పొట్లం కట్టించి మాయం చేసే నయవంచకుల ఉదంతాలు ఎన్ని వెలుగులోకి వచ్చినా.. కొత్త అమాయకులు అలాంటి వారి ఉచ్చులో పడుతూనే ఉంటారు. ‘మా సంస్థలో సొమ్ము మదుపు చేయండి. ఎవరూ ఇవ్వనంత వడ్డీ ఇస్తాం’ అని ఎర వేసి, తర్వాత అసలుకే ఎసరు పెట్టిన స్వాహాపర్వాలూ ఎన్నో జరిగాయి. అయినా.. అలాంటి ఆశే పెట్టుబడిగా టక్కరులు దగా చేస్తూనే ఉంటారు. ఆ కోవలోనే మరో సంస్థ బోర్డు తిప్పేసింది. కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టింది. అమలాపురం టౌన్ /రాజోలు/మలికిపురం : ‘మీ సొమ్ము ఇంతింతై వటుడింతై’ అన్నట్టు వృద్ధి చెందుతుంది’ అని ఊరించి, కష్టార్జితాన్ని కొల్లగొట్టే నయవంచకుల ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నా.. దగాలు ఆగడం లేదు. ఆ కోవలో తాజాగా సువర్ణ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్టు పబ్లిక్ లిమిటెడ్ అనే సంస్థ జిల్లా ప్రజలను సొమ్ములను కాజేసి బోర్డు తిప్పేసింది. ఆ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల పరిధిలో దాదాపు రూ.8 కోట్ల వరకూ డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉండగా ఒక్క మనజిల్లాలోనే ఈ మొత్తం రూ.రెండు కోట్లకు పైగా ఉంటుంది. అయితే బాధితులందరూ బయటకు వస్తే ఈ మొత్తం రూ.15 కోట్ల వరకూ చేరవచ్చని సంస్థ బ్రాంచి మేనేజర్లు, సేల్స్ మేనేజర్లు అంటున్నారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే దాదాపు రూ.5 కోట్ల మేర డిపాజిటర్లు మోసపోయినట్టు తెలుస్తోంది. సంస్థ కూడా ఈ రెండు జిల్లాలపైనే దృష్టి పెట్టి అధికంగా డిపాజిట్లు సేకరించింది.సువర్ణ ఇండియా అధిక వడ్డీల ఆశతో అటు డిపాజిటర్లను, కమీషన్ల ఎరతో ఇటు సంస్థలో పనిచేసే సిబ్బందిని మోసగించింది. ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాలన్నీ కోనసీమ నుంచే నడుపుతోంది. ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ బి.వెంకట నాగవేణు అమలాపురం వాసి. అతడిని రాజోలు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్న సమాచారంతో డిపాజిటర్లలో అలజడి మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో సంస్థను నమ్మి మోసపోయిన కొందరు అక్కడి జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీది తూర్పుగోదావరి కావటంతో శ్రీకాకుళం ఎస్పీ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఇదే సమయంలో సంస్థకు చెందిన కొందరు సేల్స్ మేనేజర్లు మనమంతా మోసపోయమాని డిపాజిటర్లకు చెప్పటంతో సంస్థ బోర్డు తిప్పేసిందన్న విషయం ఆదివారం ఒక్కసారిగా గుప్పుమంది. రాజోలు ప్రాంత సేల్స్ మేనేజర్ సీహెచ్ వెంకటేశ్వరరావు కూడా ఫిర్యాదు చేయటంతో ఎండీ వేణుపై రాజోలు ఎస్.ఐ. దుర్గాప్రసాద్ ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేశారు. రాజోలు మండలం శివకోడులో కొందరు బాధితులు ఆదివారం సమావేశమై ఆ ప్రాంత సంస్థ సేల్స్ మేనేజర్‌ను నిర్బంధించారని, సంస్థ మోసం చేసినా తాను మోసం చేయనని, తనకున్న ఆస్తులమ్మి అయినా డిపాజిట్లు చెల్లిస్తానని అతడు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో విడిచి పెట్టారని సమాచారం. అమలాపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని సువర్ణ ఇండియా బ్రాంచిలకు రోజూ వందల సంఖ్యలో బాధితులు వచ్చి, తాళాలు వేసి ఉండడంతో నిరాశగా తిరిగి వెళుతున్నారు. ఇప్పుడు ఎండీని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో మోసపోయినట్లు నిర్ధారణకు వచ్చి దిగాలు పడుతున్నారు. కూలీలనూ వదలని వంచన సువర్ణ ఇండియా ప్రజల నుంచి డిపాజిట్లు రాబట్టేందుకు ఆకర్షణీయమైన ఎన్నో ఆఫర్లు ఇచ్చింది. రంగురంగుల బ్రోచర్లతో ఊరించింది. రోజు కూలీల్నీ వదలకుండా వారి ఆర్థిక స్థాయికి తగ్గట్టు నెలకు రూ.100, రూ.200 డిపాజిట్లు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీ ఇస్తామని వల వేసింది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.20 వేలు డిపాజిటర్‌కు, రూ.నాలుగు వేలు సేల్స్ మేనేజర్‌కు, ఇతర కేటగిరీల సిబ్బందికి కమీషన్ ఇస్తామని, ఇదే డిపాజిట్ ఐదేళ్లు ఉంచితే రెట్టింపు సొమ్ములు ఇస్తానని ప్రలోభపెట్టింది. డిపాజిట్ చేసిన సొమ్ములను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి ముందు ముందు ఇంకా ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తామని ఎర చూపింది. తొలి ఏడాది డిపాజిట్లు చేసిన వారికి వడ్డీలు చెల్లించింది. రికరింగ్ డిపాజిట్లపై 12 శాతం వడ్డీని ఆశ చూపింది. గత జనవరి నుంచి మెచ్యూర్ అవుతున్న డిపాజిట్లకు వడ్డీల జమలేదు. అసలుకు సమాధానమూ లేదు. అమలాపురం మెయిన్ రోడ్‌లోని సంస్థ హెడ్ ఆఫీసు గత పదిరోజులుగా మూతపడి ఉంది. రోజూ మహిళా బాధితులు అధికంగా వచ్చి వెళుతున్నారు. కాగా ఎండీని అదుపులోకి తీసుకోవడంతో సోమవారం నుంచి పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా కొందరు సేల్స్ మేనేజర్లు పరారీలో ఉన్నారు. ప్రచార హోరుతో ప్రలోభం సువర్ణ ఇండియా ఎండీ వేణు తమకు డిపాజిట్ల సేకరణే కాక రియల్ ఎస్టేట్, టూరిజం, ఐరన్ ఓర్, సిమెంట్, పెట్రోలు, పవర్ ప్రాజెక్టులు, పత్రికలు, టీవీ చానల్ ఇలా పలు వ్యాపారాలు ఉన్నాయని వెబ్సైట్లో ప్రచారం చేశారు. వాటికి సంబంధించిన బ్రోచర్లను, ఆఫర్లను ఎరగా వేశారు. అమలాపురం మండలం కామనగరువు గ్రామంలో వాము వాటర్ పేరిట మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉందని ప్రకటించారు. అయితే వాస్తవంలో అక్కడ అది లేనేలేదు. ఇలా అసత్య ప్రచారాలతో ఆకర్షించి, డిపాజిట్లను రాబట్టి, ఇప్పుడు పుట్టి ముంచింది. ఎండీతో పాటు సంస్థకు డెరైక్టర్లుగా ఉన్న వారంతా ఇప్పుడు పత్తా లేరు. కాగా తమ సంస్థ డిపాజిట్ల సొమ్ములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భూములు కొనుగోలు చేసిందని కొందరు ఉద్యోగులు అంటున్నారు. హైదరాబాద్‌లో 140 ఎకరాలు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.20 కోట్ల విలువైన భూములు ఉన్నాయని, వాటిని అమ్మి అయినా డిపాజిట్లు చెల్లిస్తుందని నమ్మించజూస్తున్నారు.