సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పేదలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రుణాల గ్రౌండింగ్‌లో బ్యాంకర్లు అవలంబిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రుణాలివ్వని బ్యాంకర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆయా కార్పొరేషన్ల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవె న్యూ సమావేశ మందిరంలో డీఎల్‌ఆర్‌సీ, డీసీసీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా 2014 నుండి 2018 వరకు ప్రభుత్వం నుండి వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన రుణాలు, గ్రౌండింగ్, సబ్సిడీలు విడుదలపై బ్యాంకర్లు, అధికారులతో కలెక్టర్ చర్చించారు.
ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలు, వాటి గ్రౌండింగ్, అమలులో సమస్యలపై ఆరా తీశారు. బ్యాంకర్లు రుణాల మంజూరుపై అవలంభిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని, ప్రజావాణిలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. చిన్నదర్పల్లిలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే సమావేశం లో ప్రస్తావించగా స్పందించిన కలెక్టర్ బ్యాంకర్‌పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లపై కేసులను చిన్నదర్‌పల్లి నుండే ప్రారంభించాలని సూచించారు. బ్యాంకర్లు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవ ని హెచ్చరించారు. యూనిట్లు లేకున్నా ఉన్నట్లు బ్యాంకర్లు సర్టిఫికేట్లు ఇవ్వడంతో ప్రభుత్వం సబ్సిడీలు విడుదల చేస్తుందని, జిల్లాలో 70 శాతం యూనిట్లు ఇలాంటివే ఉంటున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలని, బ్యాంకర్లు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యూనిట్లను ధ్రువీకరించాలని కలెక్టర్ సూచించారు.
కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్సు బిజినెస్ వద్దు
‘ప్రభుత్వం మంజూరు చేసి యూనిట్లకు కాన్సెంట్ అవసరమే లేదు.. కాన్సెంట్ ఎందుకు అడుగుతున్నారు.. మండల స్థాయిలోని ఎంపిక కమిటీ నిర్ణయం ప్రకారం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాల్సిందే’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆయా కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ మద్దతు పథకాలకు సంబందించిన అధికారులు ఈ విషయాన్ని గుర్తించుకుని మాట్లాడాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులుగా ఉండి ఈ విషయం తెలియకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో వివిధ బ్యాంకులు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాల గ్రౌండింగ్‌కు డిపాజిట్లు సేకరిస్తున్నట్లు సమాచారముందని, అంతేకాకుండా రుణాలు విడుదల చేస్తూ ఇన్సూరెన్సు కోత విధిస్తున్నట్లు తెలిసిందని. ఇకనైనా కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్స్‌ల పేరుతో బిజినెస్‌లు చేయొద్దని హెచ్చరించారు.
లక్ష్యం మేరకు పంట రుణాలు
జిల్లాలో రబీ కంటే ఖరీఫ్ సాగు ఎక్కువగా వేస్తారని, వర్షాలు కురుస్తున్నందున పంట రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. టార్గెట్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ లోపు భూ ప్రక్షాళన కార్యక్రమం తప్పొప్పుల సవరణ పూర్తి కానుందని, త్వరలో ధరణి లింక్‌ను ప్రభుత్వం బ్యాంకర్లకు ఇవ్వనుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో భూ రికార్డులు పక్కాగా అందుబాటులోకి రానున్నాయని, అప్పటివరకు తాము ఇచ్చే బ్యాంకు వారీగా రైతులు, ఖాతాలు, భూ వివరాల నివేదిక ఆధారంగా రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్, పరిగి ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్‌రెడ్డి, ఎల్‌డీఎం ప్రభాకర్ శెట్టి, నాబార్డు ఏజీఎం అమితాబ్ భార్గవ్, ఆర్‌బీఐ అధికారులు, కార్పొరేషన్లు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment