ఆశల ఎర వేసి.. అసలుకు ఎసరు
- బోర్డు తిప్పేసిన సువర్ణ ఇండియా
- అధిక వడ్డీల ప్రలోభంతో డిపాజిట్ల సేకరణ
- పలు జిల్లాల్లో రూ.8 కోట్లకు ఎగనామం
- ‘తూర్పు’లోనే రూ.రెండు కోట్లకు పైగా స్వాహా
- పోలీసుల అదుపులో సంస్థ ఎండీ వేణు
మెరుగు పేరుతో బంగారాన్ని కాజేసే మోసగాళ్లు, పోలీసులు తనిఖీ చేస్తున్నారని ఒంటి మీది నగలు తీయించి, పొట్లం కట్టించి మాయం చేసే నయవంచకుల ఉదంతాలు ఎన్ని వెలుగులోకి వచ్చినా.. కొత్త అమాయకులు అలాంటి వారి ఉచ్చులో పడుతూనే ఉంటారు. ‘మా సంస్థలో సొమ్ము మదుపు చేయండి. ఎవరూ ఇవ్వనంత వడ్డీ ఇస్తాం’ అని ఎర వేసి, తర్వాత అసలుకే ఎసరు పెట్టిన స్వాహాపర్వాలూ ఎన్నో జరిగాయి. అయినా.. అలాంటి ఆశే పెట్టుబడిగా టక్కరులు దగా చేస్తూనే ఉంటారు. ఆ కోవలోనే మరో సంస్థ బోర్డు తిప్పేసింది. కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టింది.
అమలాపురం టౌన్ /రాజోలు/మలికిపురం : ‘మీ సొమ్ము ఇంతింతై వటుడింతై’ అన్నట్టు వృద్ధి చెందుతుంది’ అని ఊరించి, కష్టార్జితాన్ని కొల్లగొట్టే నయవంచకుల ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నా.. దగాలు ఆగడం లేదు. ఆ కోవలో తాజాగా సువర్ణ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెక్టు పబ్లిక్ లిమిటెడ్ అనే సంస్థ జిల్లా ప్రజలను సొమ్ములను కాజేసి బోర్డు తిప్పేసింది. ఆ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల పరిధిలో దాదాపు రూ.8 కోట్ల వరకూ డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉండగా ఒక్క మనజిల్లాలోనే ఈ మొత్తం రూ.రెండు కోట్లకు పైగా ఉంటుంది.
అయితే బాధితులందరూ బయటకు వస్తే ఈ మొత్తం రూ.15 కోట్ల వరకూ చేరవచ్చని సంస్థ బ్రాంచి మేనేజర్లు, సేల్స్ మేనేజర్లు అంటున్నారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే దాదాపు రూ.5 కోట్ల మేర డిపాజిటర్లు మోసపోయినట్టు తెలుస్తోంది. సంస్థ కూడా ఈ రెండు జిల్లాలపైనే దృష్టి పెట్టి అధికంగా డిపాజిట్లు సేకరించింది.సువర్ణ ఇండియా అధిక వడ్డీల ఆశతో అటు డిపాజిటర్లను, కమీషన్ల ఎరతో ఇటు సంస్థలో పనిచేసే సిబ్బందిని మోసగించింది. ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాలన్నీ కోనసీమ నుంచే నడుపుతోంది.
ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ బి.వెంకట నాగవేణు అమలాపురం వాసి. అతడిని రాజోలు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్న సమాచారంతో డిపాజిటర్లలో అలజడి మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో సంస్థను నమ్మి మోసపోయిన కొందరు అక్కడి జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీది తూర్పుగోదావరి కావటంతో శ్రీకాకుళం ఎస్పీ జిల్లా ఎస్పీతో మాట్లాడారు.
ఇదే సమయంలో సంస్థకు చెందిన కొందరు సేల్స్ మేనేజర్లు మనమంతా మోసపోయమాని డిపాజిటర్లకు చెప్పటంతో సంస్థ బోర్డు తిప్పేసిందన్న విషయం ఆదివారం ఒక్కసారిగా గుప్పుమంది. రాజోలు ప్రాంత సేల్స్ మేనేజర్ సీహెచ్ వెంకటేశ్వరరావు కూడా ఫిర్యాదు చేయటంతో ఎండీ వేణుపై రాజోలు ఎస్.ఐ. దుర్గాప్రసాద్ ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేశారు.
రాజోలు మండలం శివకోడులో కొందరు బాధితులు ఆదివారం సమావేశమై ఆ ప్రాంత సంస్థ సేల్స్ మేనేజర్‌ను నిర్బంధించారని, సంస్థ మోసం చేసినా తాను మోసం చేయనని, తనకున్న ఆస్తులమ్మి అయినా డిపాజిట్లు చెల్లిస్తానని అతడు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో విడిచి పెట్టారని సమాచారం. అమలాపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని సువర్ణ ఇండియా బ్రాంచిలకు రోజూ వందల సంఖ్యలో బాధితులు వచ్చి, తాళాలు వేసి ఉండడంతో నిరాశగా తిరిగి వెళుతున్నారు. ఇప్పుడు ఎండీని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో మోసపోయినట్లు నిర్ధారణకు వచ్చి దిగాలు పడుతున్నారు.
కూలీలనూ వదలని వంచన
సువర్ణ ఇండియా ప్రజల నుంచి డిపాజిట్లు రాబట్టేందుకు ఆకర్షణీయమైన ఎన్నో ఆఫర్లు ఇచ్చింది. రంగురంగుల బ్రోచర్లతో ఊరించింది. రోజు కూలీల్నీ వదలకుండా వారి ఆర్థిక స్థాయికి తగ్గట్టు నెలకు రూ.100, రూ.200 డిపాజిట్లు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీ ఇస్తామని వల వేసింది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.20 వేలు డిపాజిటర్‌కు, రూ.నాలుగు వేలు సేల్స్ మేనేజర్‌కు, ఇతర కేటగిరీల సిబ్బందికి కమీషన్ ఇస్తామని, ఇదే డిపాజిట్ ఐదేళ్లు ఉంచితే రెట్టింపు సొమ్ములు ఇస్తానని ప్రలోభపెట్టింది.
డిపాజిట్ చేసిన సొమ్ములను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి ముందు ముందు ఇంకా ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తామని ఎర చూపింది. తొలి ఏడాది డిపాజిట్లు చేసిన వారికి వడ్డీలు చెల్లించింది. రికరింగ్ డిపాజిట్లపై 12 శాతం వడ్డీని ఆశ చూపింది. గత జనవరి నుంచి మెచ్యూర్ అవుతున్న డిపాజిట్లకు వడ్డీల జమలేదు. అసలుకు సమాధానమూ లేదు. అమలాపురం మెయిన్ రోడ్లోని సంస్థ హెడ్ ఆఫీసు గత పదిరోజులుగా మూతపడి ఉంది. రోజూ మహిళా బాధితులు అధికంగా వచ్చి వెళుతున్నారు. కాగా ఎండీని అదుపులోకి తీసుకోవడంతో సోమవారం నుంచి పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా కొందరు సేల్స్ మేనేజర్లు పరారీలో ఉన్నారు.
ప్రచార హోరుతో ప్రలోభం
సువర్ణ ఇండియా ఎండీ వేణు తమకు డిపాజిట్ల సేకరణే కాక రియల్ ఎస్టేట్, టూరిజం, ఐరన్ ఓర్, సిమెంట్, పెట్రోలు, పవర్ ప్రాజెక్టులు, పత్రికలు, టీవీ చానల్ ఇలా పలు వ్యాపారాలు ఉన్నాయని వెబ్‌సైట్లో ప్రచారం చేశారు. వాటికి సంబంధించిన బ్రోచర్లను, ఆఫర్లను ఎరగా వేశారు. అమలాపురం మండలం కామనగరువు గ్రామంలో వాము వాటర్ పేరిట మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉందని ప్రకటించారు. అయితే వాస్తవంలో అక్కడ అది లేనేలేదు.
ఇలా అసత్య ప్రచారాలతో ఆకర్షించి, డిపాజిట్లను రాబట్టి, ఇప్పుడు పుట్టి ముంచింది. ఎండీతో పాటు సంస్థకు డెరైక్టర్లుగా ఉన్న వారంతా ఇప్పుడు పత్తా లేరు. కాగా తమ సంస్థ డిపాజిట్ల సొమ్ములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భూములు కొనుగోలు చేసిందని కొందరు ఉద్యోగులు అంటున్నారు. హైదరాబాద్‌లో 140 ఎకరాలు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.20 కోట్ల విలువైన భూములు ఉన్నాయని, వాటిని అమ్మి అయినా డిపాజిట్లు చెల్లిస్తుందని నమ్మించజూస్తున్నారు.