రూ.4.5 కోట్లు తీసుకుని పరారీ
రాయవరం: రియల్ ఎస్టేట్ వ్యాపారినంటూ ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద డబ్బులు తీసుకున్నాడు.3 నెలలుగా డబ్బులు అడుగుతుంటే సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో బాధితులు పదే పదే అడగడం ప్రారంభించారు. చివరకు ఇల్లు విడిచి పరారవ్వడంతో బాధితులంతా రోడ్డున పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామం పల్లపువీధిలో ఈ ఘటన జరిగింది.
బాధితులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి(దొరబాబు) గ్రామంలోని పల్లపు వీధిలో నివాసం ఉంటున్నాడు. స్థిరాస్థిని కలిగి ఉండడం.. మోతుబరి కుటుంబాలతో ఇరువురు కుమార్తెలకు వియ్యం అందడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పడంతో పలువురు అతని వద్ద డబ్బులు మదుపు చేశారు. పలువురు రూ.లక్షలను దొరబాబు వద్ద ఉంచారు.
మాచవరం, సోమేశ్వరం గ్రామాలతో పాటుగా, అనపర్తి మండలం పులుగుర్త, రామకోట తదితర గ్రామాలకు చెందిన 45 మంది దొరబాబు వద్ద పొదుపు చేసిన సొమ్మును మదుపు చేశారు. ఈ విధంగా సుమారు రూ.4.5 కోట్ల వరకు మదుపు చేసినట్లు బాధితులు తెలిపారు. 3 నెలలుగా దాచుకున్న డబ్బులను తమ అవసరార్థం తిరిగి ఇవ్వాలని దొరబాబును కోరినప్పటికీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశాడు.
దీంతో అనుమానం వచ్చిన బాధితులు విషయాన్ని స్థానిక గ్రామ పెద్దల వద్దకు తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడం.. దొరబాబు ఇంటి వద్ద లేక పోవడంతో బాధితులంతా దొరబాబు ఇంటి ముందు ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. తాము దాచుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలంటూ బాధితులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment