కాసులకు కటకట
⇒ రూ.3,000 కోట్లు జిల్లాలో నెలకు కావాల్సింది
⇒ రూ.112 కోట్లు ఈ నెలలో రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చింది
ఏటీఎం కేంద్రాల్లో నగదు లేక ఇక్కట్లు
జిల్లాలో నోట్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, పింఛన్‌దారులు నగదుకోసం బ్యాంకుల వద్దకు వెళ్తే వారికి నిరాశే మిగులుతుంది. అధికశాతం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. గతేడాది నవంబరు 8వ తేదీ రాత్రి నుంచి పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో నగదు కోసం నానా తిప్పలు పడ్డారు. రెండు నెలల తర్వాత కొంత కుదుట పడింది. ప్రస్తుతం మళ్లీ అవే కష్టాలు పునరావృతమయ్యాయి.
నెల్లూరు(సెంట్రల్): రిజర్వ్ బ్యాంక్ నుంచి సకాలంలో నగదు రాకపోవడంతో జిల్లాలో ప్రజలకు నగదు కష్టాలు పూర్తిగా తీరడంలేదు. దీంతో బ్యాంకుల్లో నగదు కట్టించుకోవడం తప్ప ఇచ్చే పరిస్థితి దాదాపుగా లేదు. రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుకున్నంత మొత్తం నగదు బ్యాంకులకు సరఫరా కాక పోవడంతోనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, కావలి, కోవూరు, నాయుడుపేట, నెల్లూరు, సూళ్లూరుపేటలలోని బ్యాంకులకు గతంలో రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా నగదు వచ్చేది. నోట్ల రద్దుతో ఈ బ్యాంకులకు నగదు రావడంలేదు. ఇవేగాక జిల్లా మొత్తంగా ఉన్న బ్యాంకులకు ఆర్‌బీఐ నుంచి పూర్తి స్థాయిలో నగదు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన పట్టణాల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. ఇక గ్రామాలలోని వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇదే విధంగా నగదు రాకుండా ఉంటే తీవ్రమైన నగదు కొరత ఏర్పడే ప్రమాదముందని పలువురు బ్యాంకు అ«ధికారులే పేర్కొంటున్నారు.
రూ.3 వేల కోట్లకు రూ.112 కోట్లు..
జిల్లాలో 424 బ్యాంకులు, 482 ఏటీఎం కేంద్రాలున్నాయి. రోజుకు అన్ని బ్యాంకుల్లో లావాదేవీలకు కనీసం రూ.100 కోట్లు అవసరం. అంటే నెలకు రూ.3 వేల కోట్లు కావాల్సి వస్తే ఇప్పటి వరకు జిల్లాకు వచ్చింది రూ.112 కోట్లు మాత్రమే. ఈ నెల 10వ తేదీ వరకు పరిశీలిస్తే మొత్తం రూ.వెయ్యి కోట్లు కావాల్సి ఉంది. అయితే రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చింది రూ.112 కోట్లు. ఈ విధంగా ఉంటే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పింఛన్, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ ఎలా పంపిణీ చేస్తారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల మొదటి వారం దాటినా ఇప్పటి వరకు చాలా మంది వారి జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉందంటే నగదు కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతోంది. దీంతోపాటు వ్యాపారులు, రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
95 శాతం ఏటీఎంలు మూత
జిల్లాలో 482 ఏటీఎం కేంద్రాలున్నాయి. నగదు లేక పోవడంతో 95 శాతం ఏటీఎం కేంద్రాలు మూసి ఉన్నారు. నెల్లూరు నగరంలో అయ్యప్పగుడి నుంచి గాంధీబొమ్మ వరకు పరిశీలిస్తే రెండు మూడు మినహా ఎక్కడా ఏటీఎం కేంద్రాలు తీసిన దాఖలాలు లేవు. ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్ ఏటీఎంలు దాదాపుగా మూతపడి ఉన్నాయి. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కోవూరు, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
జీతాలు తీసుకోలేని పరిస్థితి
మొదటి వారం వచ్చినా జీతాలు తీసుకోలేని పరిస్థితి. నగరంలో ఎక్కడికెళ్లినా ఏటీఎం కేంద్రాలు మూసేసి ఉన్నాయి. కొన్ని ఉన్నా నో.. క్యాష్ బోర్డు పెట్టారు. బ్యాంకులకు వెళదామన్నా డబ్బులు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ ఇబ్బందులు నాకొక్కడికే కాదు. చాలా మంది ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
–వి.శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగి
ఏటీఎంలు పనిచేయడం లేదు
ఏటీఎంలలో నగదు ఉండటంలేదు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నా అవసరాలకు నగదు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడకు వెళ్లినా నోక్యాష్ బోర్డులు పెట్టి ఉన్నారు. మరో రెండు రోజులు సెలవులు ఉండటంతో నగదు కోసం ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
–భాస్కర్, కావలి, ప్రైవేట్ ఉద్యోగి
ఆర్‌బీఐ నుంచి వస్తేనే
ఆర్‌బీఐ నుంచి మాకు నగదు వస్తేనే బ్యాంకులకు సరఫరా చేయగలం. ప్రస్తుతం ఈ నెలలో కొద్దిగా మాత్రమే నగదు వచ్చింది. జిల్లాలోని బ్యాంకులకు నిత్యం లావాదేవీలు జరపాలంటే రోజుకు రూ.100 కోట్లు అవసరం ఉంటుంది. మార్చి నెల కావడంతో కూడా ఇబ్బందికరంగా ఉంది. ఉన్న కాస్త నగదును సర్దుబాటు చేస్తున్నాం. నగదు వచ్చేదాకా ఏమీ చేయలేని పరిస్థితి.
–వెంకట్రావ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్