సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరోసారి నగదు కష్టాలు తీవ్రతరమయ్యాయి. ఏటీఎంల్లో, బ్యాంకుల్లో నగదు లభించకపోవడంతో మరోసారి పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. మళ్లీ నోట్ల కష్టాలు ఎందుకు పునరావృతం అయ్యాయి? రూ. 2వేల నోట్లు బయటకు రాకుండా నిజంగానే నిలిపేశారా? ఇదే విషయమై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దినేశ్ త్రివేది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో నగదు కొరతకు అసలు కారణాలు ఏమిటో వెల్లడించాలని కోరారు. రూ. 2వేల నోట్ల చెలామణిని నిలిపేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు.
ఆర్థిక రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్న దినేశ్ త్రివేది బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘రూ. 2వేల నోట్లను నిలిపివేయడంతోనే దేశంలో మళ్లీ నగదు కొరత ఏర్పడినట్టు కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. నగదు కొరత విషయంలో నిజానిజాలపై కేంద్రం వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టజారని, ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం సరికాదని అన్నారు. గత కొన్ని నెలలుగా తనకు కూడా బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేయడంతో వ్యవస్థలోని వాటి విలువను భర్తీ చేయడానికి కేంద్రం రూ. 2వేలనోట్లు అమల్లోకి తీసుకొచ్చిందని, ఈ నేపథ్యంలో రూ. 2వేల నోట్ల కొనసాగింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment