‘రాజన్న పది రోజుల కిందనే తుకం పోసిన. నాటుకు వస్తది. కూలీలకు ఇచ్చేందుకు పైసలు లేవు.. బ్యాంకుకు పోతే పైసల్లేవంటున్నరు. ఏటీఎంలల్ల కూడా ఏం లేవు. ఏంజేయాలే’.. అంటూ మరో రైతు భూమన్న అన్న మాటలివి. ఇలాంటి పరిస్థితి ఈ ఇద్దరిదే కాదు. ఉమ్మడి జిల్లాలలోని అన్ని ప్రాంతాల్లో నెలకొంది. బ్యాంకులు మాత్రం నగదు లేదు, రూ.రెండే వేలు ఇస్తమంటున్నరని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిని అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.
సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): నోట్ల రద్దు ప్రభావం నేటికి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. నగదు కొరతతో ఖాతాదారులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే బ్యాంకుల ముందు రైతులు, ఖాతాదారులు బారులు తీరుతున్నారు. బ్యాంకర్లు మాత్రం ప్రతి ఖాతాదారుడికి రూ.2 వేలకు మించి ఇవ్వడం లేదు. రామారెడ్డి మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలుండగా 35,909 జనాభా ఉంది. మండల కేంద్రం రామారెడ్డిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, సొసైటీ బ్యాంకులతో పాటు రెడ్డిపేటలో ఎస్‌బీఐ బ్యాంకులున్నాయి. రామారెడ్డిలో ఇండిక్యాష్ ఏటీఎం, రెడ్డిపేటలో ఎస్‌బీఐ ఏటిఎంలు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయి. అయితే నగదు కారణంగా 24 గంటలపాటు పని చేయాల్సిన ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఒక్క మండలంలోనే కాదు, ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో నెలకొంది. రైతులు, ఖాతాదారులు, సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు.
రైతుబంధు, ధాన్యంలవీ అదే కథ..
రామారెడ్డి మండలంలో 19 గ్రామ పంచాయతీలున్నాయి. కాగా 14 రెవెన్యూ గ్రామాలున్నాయి. యాసంగి పంట పెట్టుబడి కోసం అర్హులైన 7791 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద డబ్బులను జమ కానున్నాయి. దీనికి తోడు ధాన్యం కొనుగోలు డబ్బులు సైతం బ్యాంకు ఖాతాల్లో వస్తుండడంతో డబ్బుల రైతులు, బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. నగదు కొరత కారణంగా రూ.2 వేల నుంచి రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి రూ.2వేలు ఏం సరి పోతాయని వారు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఖాతాదారులకు సైతం నగదు కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నగదు కొరతను నివారణకు గతంలో నగదు రహితంను సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రజలకు ఇప్పటికీ నగదు తిప్పలు తప్పడం లేదు.
ఏటీఎంను తెరిపించండి
మోర్తాడ్: మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాన్ని తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు. ఎస్‌బీఐ ఏటీఎం ఎన్నో రోజుల నుంచి మూసి ఉంటున్నా బ్యాంకు అధికారులు ఏమి పట్టించుకోక పోవడంతో స్థానిక ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంను తెరచి ఉంచితే వినియోగదారులు తమకు అవసరం ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవడంతో పాటు, మినీ స్టేట్‌మెంట్, బ్యాంకు బ్యాలెన్స్ ఇతర సదుపాయాలను పొందుతారని పలువురు వినియోగదారులు వెల్లడించారు. ఏటీఎంను నిరంతరం మూసి ఉంచడం కారణంగా ఎంతో మంది వినియోగదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎం కేంద్రాన్ని తెరచి ఉంచాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment