ఎనీటైం... నోమనీ
► ఖాతాల్లో నగదున్నా పనిచేయని ఏటీఎంలు!
► బ్యాంకుల్లోనూ నిండుకున్న నగదు నిల్వ
► ఖాతాదారులకు మళ్లీ నోట్లరద్దు నాటి కష్టాలు
శ్రీకాకుళం: నో క్యాష్... నెల ప్రారంభం నుంచి ఏటీఎంల వద్ద బోర్డులు ఖాతాదారులను వెక్కిరిస్తున్నాయి. విత్‌డ్రాలపై ఆంక్షలు సోమవారం నుంచి ఎత్తివేసినా నగదు తీసుకోవడానికి అగచాట్లు తప్పట్లేదు. నవంబరు ఎనిమిదో తేదీన పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన నగదు కష్టాలు మరోసారి పునరావృతమవుతున్నాయి.
మరోవైపు బ్యాంకుల్లోనూ నగదు నిల్వ లు నిండుకున్నాయి. నగదు అడిగితే రూ.10 నాణాలున్న మూటలు చేతుల్లో పెడుతున్నారు. తీరా ఆ పది రూపాయల నాణాలు కూడా తీసుకోవడానికి వ్యాపారులు వెనుకంజ వేస్తుండడంతో సామాన్యులకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. తమ దుస్థితి తామే తిట్టుకుని వెళ్లిపోవడం తప్ప!
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిపి 23 ఉన్నాయి. వీటికి 298 శాఖల పరిధిలో 290 ఏటీఎంలు ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి రోజుకు సుమారు రూ.100 కోట్లు మేర నగదు లావాదేవీలు జరగాల్సి ఉంది. కానీ నెల ప్రారంభం నుంచి రూ.70 కోట్లుకు మించలేదు. నగదు తగినంత లేకపోవడంతో వారం రోజులుగా సగానికి సగం తగ్గిపోయింది. దీంతో లావాదేవీలను అనధికారికంగానే వాయిదా వేయాల్సిన పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు తర్వాత జిల్లాకు రూ.500, రూ.2000 కొత్తనోట్లు తొలి మూడు విడతల్లో రూ.800 కోట్ల మేర వచ్చాయి. తర్వాత నగదు చలామణి పెరిగిన తర్వాత మరికొంత మొత్తంలో బ్యాంకులకు చేరింది. ఇటీవల రూ.30 కోట్లు రాగా, దాన్ని పింఛనుదారుల కోసం కేటాయించారు. గత వారం రూ.65 కోట్ల వరకూ కొత్త నోట్లు వచ్చాయి. కానీ ఇది ఖాతాదారుల అవసరాలకు ఏమాత్రం సరిపోలేదు.
ఏటీఎంల్లో నగదు కూడా ఉండట్లేదు. దీనికి నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు సడలించడం, అలా సడలించడంతో విత్ డ్రా అవుతున్న నగదు తగినట్లుగా డిపాజిట్లు లేకపోవడం ప్రధాన కారణాలనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఖాతాదారులు ఎక్కువ మంది నగదును
ముందుజాగ్రత్తగా తమవద్దే ఉంచేసుకుంటున్నారు. దీంతో నగదు ఎక్కడికక్కడ ‘బ్లాక్’ అయిపోతోంది. బ్యాంకు డిపాజిట్‌లు తగ్గిపోయాయి. దీంతో బ్యాంకులు తమవద్దనున్న కొద్దిపాటి నగదునే విత్‌డ్రాలకు కేటాయిస్తున్నాయి.
అదీ విత్‌డ్రాలపై అనధికార ఆంక్షలు అమలు చేసి ఖాతాదారులకు సర్దిచెబుతున్నాయి. మరోవైపు ఏటీఎంలకు నగదు సరఫరాను ఆపేశాయి. ఒకవైపు నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు బహుమతులు ప్రకటిస్తున్న ప్రభుత్వం... మరోవైపు ఆ వ్యవస్థను బలోపేతం చేయడంపై మాత్రం ప్రచారానికే పరిమితమైంది. జిల్లాలో డిజిటల్, ఆన్‌లైన్ లావాదేవీలు ఏమాత్రం పుంజుకోలేదు. జిల్లాలో వ్యాపారులకు స్వైపింగ్ మెషిన్లు కొత్తగా ఇవ్వట్లేదు. గతంలో ఉన్న మెషిన్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే నగదు రహిత లావాదేవీలపై రుసుం వేస్తుండటంతో వినియోగదారులు కార్డులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. నగదు సహిత కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. కానీ చేతిలో నగదు లేక సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు.