సాక్షి, ముంబై: పెద్ద నోట్లు రద్దు తరువాత దేశీయ బ్యాంకులను మరో కొత్త తలనొప్పి వేధిస్తోంది. డీమానిటైజేషన్ తరువాత చలామణిలోకి తీసుకొచ్చిన కరెన్సీ వ్యవహారంలోనే ఈ కొత్త చిక్కు. పాడైపోయిన, లేదా చిరిగిపోయిన 200, 2000 రూపాయల నోట్ల మార్పిడి బ్యాంకర్లకు తాజాగా పెద్ద సమస‍్యగా పరిణమించింది. దీనికి సంబంధించిన ఆర్‌బీఐ చట్ట నిబంధనలను త్వరితగతిన సవరించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు బ్యాంకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా కరెన్సీ నోట్లకు అనుగుణంగా ఆర్‌బీఐ ‘నోట్ రీఫండ్’ చట్ట నిబంధనల్లో కొత్తగా మార్పులు చేపట్టకపోవడంతో ఈ నోట్ల మార్పిడికి అవకాశం లేదు. దీంతో ఎక్స్చేంజ్ కౌంటర‍్లలో ఇలాంటి (పాడైపోయిన, మాసిన) నోట్లు పేరుకుపోతున్నాయి. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం రూ .5, రూ 10, రూ .50, రూ 100, రూ .500, 1,000, రూ .5,000, రూ. 10,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన 200 రూపాయలు, 2,000 నోట్లు ఈ జాబితాలో ఇంకా చేర్చలేదని, దీంతో సదరు నోట్ల మార్పిడి కష్టంగా మారిందని వివిధ బ్యాంకులు వాపోతున్నాయి. అయితే, ఈ చట్ట సవరణ అవసరంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే నివేదించామని ఆర్‌బీఐ చెబుతోంది.
మరోవైపు చలామణిలో రూ.500, రూ.200, రూ.100 నోట్లు చాలినన్ని ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఇటీవల( ఏప్రిల్,17న) ప్రకటించారు. సుమారు రూ.7 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపి వేసిందని కూడా స్పష్టం చేశారు. కాగా 2016, నవంబర్ 8వ తేది రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం, వీటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2,000, 200 నోట్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment