soiled notes
-
చిరిగిన నోట్లలో తేడాలు.. ప్రభుత్వ బ్యాంక్‌కు భారీ ఫైన్!
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) భారీ షాక్ ఇచ్చింది. చిరిగిన, పాడైన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం గుర్తించడంతో ఈ బ్యాంక్‌కు రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం నాటి ఎక్చేంజ్ ఫైలింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. చిరిగిన నోట్లలో నకిలీవి దీంతోపాటు చిరిగిన, పాడైన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన ఆర్బీఐ .. బ్యాంక్ ఆఫ్ బరోడాకు అదనంగా మరో రూ.2,750 ఫైన్ వేసింది. బీవోబీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానాలు ఆర్బీఐ విధించింది. క్లీన్ నోట్ పాలసీకి అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ పెనాల్టీలను విధించినట్లు తెలుస్తోంది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ గత నెలలో కూడా పెద్ద మొత్తంలో పెనాల్టీ వేసిన విషయం తెలిసిందే. నిబంధనలు పాటించకుండా భారీ మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు గతంలో బీవోబీకి ఆర్బీఐ రూ.4.35 కోట్ల జరిమానా విధించింది. -
రూ.200, 2వేల నోట్లు.. కొత్త సమస్య
సాక్షి, ముంబై: పెద్ద నోట్లు రద్దు తరువాత దేశీయ బ్యాంకులను మరో కొత్త తలనొప్పి వేధిస్తోంది. డీమానిటైజేషన్ తరువాత చలామణిలోకి తీసుకొచ్చిన కరెన్సీ వ్యవహారంలోనే ఈ కొత్త చిక్కు. పాడైపోయిన, లేదా చిరిగిపోయిన 200, 2000 రూపాయల నోట్ల మార్పిడి బ్యాంకర్లకు తాజాగా పెద్ద సమస్యగా పరిణమించింది. దీనికి సంబంధించిన ఆర్బీఐ చట్ట నిబంధనలను త్వరితగతిన సవరించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బ్యాంకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజా కరెన్సీ నోట్లకు అనుగుణంగా ఆర్బీఐ ‘నోట్ రీఫండ్’ చట్ట నిబంధనల్లో కొత్తగా మార్పులు చేపట్టకపోవడంతో ఈ నోట్ల మార్పిడికి అవకాశం లేదు. దీంతో ఎక్స్చేంజ్ కౌంటర్లలో ఇలాంటి (పాడైపోయిన, మాసిన) నోట్లు పేరుకుపోతున్నాయి. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం రూ .5, రూ 10, రూ .50, రూ 100, రూ .500, 1,000, రూ .5,000, రూ. 10,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లు ఎక్స్చేంజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన 200 రూపాయలు, 2,000 నోట్లు ఈ జాబితాలో ఇంకా చేర్చలేదని, దీంతో సదరు నోట్ల మార్పిడి కష్టంగా మారిందని వివిధ బ్యాంకులు వాపోతున్నాయి. అయితే, ఈ చట్ట సవరణ అవసరంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే నివేదించామని ఆర్బీఐ చెబుతోంది. మరోవైపు చలామణిలో రూ.500, రూ.200, రూ.100 నోట్లు చాలినన్ని ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఇటీవల( ఏప్రిల్,17న) ప్రకటించారు. సుమారు రూ.7 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపి వేసిందని కూడా స్పష్టం చేశారు. కాగా 2016, నవంబర్ 8వ తేది రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం, వీటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2,000, 200 నోట్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. -
కొత్త నోటు చిరిగితే.. జేబుకు చిల్లే!
-
కొత్త నోటు చిరిగితే.. జేబుకు చిల్లే!
సాక్షి, హైదరాబాద్ : కొత్త నోటు.. కొత్త కొత్తగా బాగున్న నోటు.. కానీ కొంచెం చిరిగిందా.. అంతే సంగతులు. ఆ నోటును బ్యాంకులు తీసుకోవు.. రిజర్వు బ్యాంకుకు వెళ్లినా లాభం లేదు. పాత పెద్ద నోట్లను రద్దు చేసి, కొత్త నోట్లను చలామణిలోకి తెచ్చి 16 నెలలవుతున్నా.. చిరిగిన/దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడికి మార్గదర్శకాలు రాకపోవడమే దీనికి కారణం. చిరిగిన మేరకు కొత్త నోట్లకు జరిగిన నష్టాన్ని లెక్కించాల్సి ఉంటుందని.. ఆ మేరకు మార్గదర్శకాలు లేకపోవడంతో వాటిని తీసుకోవడం లేదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. అయితే బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేసుకున్నప్పుడు, ఏటీఎంలలో మాత్రం చిరిగిన కొత్త నోట్లు వస్తుండటం గమనార్హం. ‘కొత్త’సమస్యలు.. దాదాపు 16 నెలల కింద కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసి.. రూ.2 వేలు, రూ.500, రూ.200 విలువ చేసే కొత్త నోట్లను చలామణీలోకి తెచ్చిన విషయం తెలిసిందే. పాత నోట్ల రద్దుతోనే నానా అవస్థలు పడిన జనం.. ఇప్పుడు కొత్త నోట్లతో కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. పొరపాటున చిరిగిపోయిన, దెబ్బతిన్న కొత్త నోట్లను మార్పిడి చేయడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. అలా కొత్త నోట్ల మార్పిడి కోసం వస్తున్నవారిని రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాయి. ఎక్కడికెళ్లినా అదే సమాధానం.. చిరిగిన కొత్త నోట్ల మార్పిడి కోసం హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినా నిరాశే ఎదురవుతోంది. రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి కొత్త నోట్ల మార్పిడికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని.. ఆ మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే చిరిగిన నోట్లను మార్పిడి చేస్తామని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకు చిరిగిన నోట్లను దాచిపెట్టుకోవాలని సూచిస్తూ తిప్పిపంపుతున్నారు. అయితే తాము ఆదేశాలు ఇచ్చేవరకు చిరిగిన/ దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడి చేయవద్దని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నట్లు బ్యాంకులు పేర్కొంటున్నాయి. నోటు నష్టాన్ని మినహాయించుకుని.. సాధారణంగా నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం.. కరెన్సీ నోటుకు జరిగిన నష్టాన్ని లెక్కించేందుకు నోటుపై చిరిగిన/దెబ్బతిన్న/పాడైపోయిన భాగాలను కొలతలు తీస్తారు. ఆ నోటు పరిమాణానికి సరిపడా ఉండే గ్రిడ్ (గ్రాఫ్ పేపర్ మాదిరిగా ఉండే కొలమానం)పై చిరిగిన నోటును పెట్టి.. దెబ్బతిన్న భాగం నష్టాన్ని లెక్కిస్తారు. నోటు విలువ నుంచి ఈ నష్టాన్ని మినహాయించుకుని మిగతా విలువను చెల్లిస్తారు. వేర్వేరు విలువ గల కరెన్సీ నోట్ల పరిమాణం వేర్వేరుగా ఉండడంతో ఆయా నోట్ల నష్టాన్ని లెక్కించేందుకు బ్యాంకులు వేర్వేరు గ్రిడ్లను వినియోగిస్తాయి. చివరిగా పెద్ద నోట్ల రద్దుకు నాలుగు నెలల ముందు చిరిగిన/దెబ్బతిన్న నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘కొత్త’మార్గదర్శకాలు లేకపోవడంతో.. పాత పెద్ద నోట్లు రద్దయి కొత్తగా రూ.2 వేలు, రూ.500, రూ.200 విలువైన నోట్లు చలామణీలోకి వచ్చాక నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలేవీ జారీ కాలేదు. పాత రూ. 500 నోట్లతో పోలిస్తే కొత్త నోట్ల పరిమాణంలో తేడా ఉంది. ఇక రూ.2 వేలు, రూ.200 నోట్లు పూర్తిగా కొత్త విలువతో కూడినవి. దీంతో పాత నోట్లకు సంబంధించిన గ్రిడ్లను కొత్త నోట్లకు వినియోగించుకోలేని పరిస్థితి ఉందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు కొత్త నోట్లకు సంబంధించిన గ్రిడ్‌లతోపాటు కొత్త మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉందని చెబుతున్నాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా స్పందించేందుకు బ్యాంకులు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారులు నిరాకరిస్తుండడం గమనార్హం. చిరిగిన నోట్లతో కమీషన్ల దందా చిరిగిన కొత్త నోట్ల మార్పిడికి బ్యాంకులు నిరాకరిస్తుండటం.. చిరిగిన నోట్ల మార్పిడి చేసే వ్యాపారస్తులకు వరంగా మారింది. భారీగా కమీషన్ల దందాకు తెరలేచింది. రూ.2 వేల చిరిగిన నోటు మార్పిడికి రూ.500 వరకు.. రూ.500 చిరిగిన నోటు మార్పిడికి రూ.200 వరకు కమీషన్‌గా తీసుకుంటుండటం గమనార్హం. దీంతో చాలా మంది అడ్డగోలు కమీషన్ కింద చిరిగిన నోట్లను మార్పించుకోవాల్సి వస్తోంది. కొందరు అంత కమీషన్ ఇవ్వలేక బ్యాంకుల్లో ఎప్పుడు మార్పిడి చేస్తారోనంటూ ఎదురుచూస్తున్నారు. -
ఆ నోట్లు వద్దంటే బ్యాంకుకు జరిమానా!
న్యూఢిల్లీ: మీ దగ్గర చిరిగిన, రాతలు రాసిన నోట్లు ఉన్నాయా? అయినా పర్వాలేదు. వాటిని మార్చుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ నోట్లను తీసుకుని నేరుగా బ్యాంకు శాఖకే వెళ్లి వీటిని ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. చిరిగిన.. గీతలు, రాతలు ఉన్న నోట్లు చెల్లవంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆర్బీఐ ఖండించింది. ఏ బ్యాంకు శాఖలోనైనా ఈ నోట్లు చెల్లుతాయని స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో ఏటీఎం వినియోగం ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో చిరిగిన, రాతలు ఉన్న నోట్లు రావడాన్ని గుర్తించిన ఆర్బీఐ ఇందుకు ఖాతాదారులను ఇబ్బందిపెట్టడం సరికాదని బ్యాంకులకు సూచించింది. 1999లో ప్రవేశపెట్టిన క్లీన్ నోట్ పాలసీకి అనుగుణంగా పాడైపోయిన నోట్లను తీసుకోవల్సిన బాధ్యత బ్యాంకులదేనంటు సర్క్యులర్ జారీ చేసింది. దీనిని అతిక్రమించి ఏ బ్యాంకు శాఖ అయిన నోట్లను వద్దని తిరస్కరిస్తే ఆ బ్యాంకుపై రూ.10వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే రోజుకు 20 నోట్లు లేదంటే రూ.5,000 మించిన చిరిగిన, గీతలు రాసి ఉన్న నోట్లను మార్చుకుంటే మాత్రం బ్యాంకులకు సర్వీస్ చార్జీ వసూలు చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది.