ఆ నోట్లు వద్దంటే బ్యాంకుకు జరిమానా!
Published Sat, Mar 4 2017 4:09 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
న్యూఢిల్లీ: మీ దగ్గర చిరిగిన, రాతలు రాసిన నోట్లు ఉన్నాయా? అయినా పర్వాలేదు. వాటిని మార్చుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ నోట్లను తీసుకుని నేరుగా బ్యాంకు శాఖకే వెళ్లి వీటిని ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. చిరిగిన.. గీతలు, రాతలు ఉన్న నోట్లు చెల్లవంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆర్‌బీఐ ఖండించింది. ఏ బ్యాంకు శాఖలోనైనా ఈ నోట్లు చెల్లుతాయని స్పష్టం చేసింది.
ఈ మధ్యకాలంలో ఏటీఎం వినియోగం ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో చిరిగిన, రాతలు ఉన్న నోట్లు రావడాన్ని గుర్తించిన ఆర్బీఐ ఇందుకు ఖాతాదారులను ఇబ్బందిపెట్టడం సరికాదని బ్యాంకులకు సూచించింది. 1999లో ప్రవేశపెట్టిన క్లీన్ నోట్ పాలసీకి అనుగుణంగా పాడైపోయిన నోట్లను తీసుకోవల్సిన బాధ్యత బ్యాంకులదేనంటు సర్క్యులర్ జారీ చేసింది. దీనిని అతిక్రమించి ఏ బ్యాంకు శాఖ అయిన నోట్లను వద్దని తిరస్కరిస్తే ఆ బ్యాంకుపై రూ.10వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే రోజుకు 20 నోట్లు లేదంటే రూ.5,000 మించిన చిరిగిన, గీతలు రాసి ఉన్న నోట్లను మార్చుకుంటే మాత్రం బ్యాంకులకు సర్వీస్ చార్జీ వసూలు చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది.
Advertisement
Advertisement