ఖాయిలా కంపెనీల పునరుద్ధరణ!! | Recovery of the Khiala companies | Sakshi
Sakshi News home page

ఖాయిలా కంపెనీల పునరుద్ధరణ!!

Published Fri, Jan 5 2018 12:04 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

Recovery of the Khiala  companies  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటూ ఉత్పాదక రంగంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు  (ఎస్‌ఎంఈ) రుణాలందించటమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌కు (టీఐహెచ్‌సీ) లైన్‌ క్లియరైంది. దేశంలోనే తొలిసారిగా దీనికి కో-ఫైనాన్సింగ్‌ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. ఫిబ్రవరి రెండో వారంలో సంబంధిత మంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశముంది. దీనికి సంబంధించిన వివరాలను టీఐహెచ్‌సీ అడ్వైజర్‌ డాక్టర్‌ బి.ఎర్రం రాజు ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధికి వెల్లడించారు. అవి...
ఖాయిలా పడ్డ పరిశ్రమలకు, ఉత్పాదక రంగంలోని ఎస్‌ఎంఈలకు బ్యాంకులు రుణాలివ్వటం లేదు. కారణం.. పూచీకత్తు, సిబ్బంది కొరత, ఎన్‌పీఏలు వంటివెన్నో. టీఐహెచ్‌సీలో రెండు విభాగాలుంటాయి. 1. ఖాయిలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించడం. 2. ఉత్పాదక రంగంలోని ఎస్‌ఎంఈలకు నిధులు సమకూర్చడం. ఖాయిలా పరిశ్రమల విషయానికొస్తే.. బిల్‌ రీ డిస్కౌంట్‌ స్కీమ్, టెక్నో ఎకనామిక్‌ వాల్యూవేషన్‌ (టీఈవీ) స్టడీ, సాఫ్ట్‌ లోన్‌ అనే 3 రకాల సేవలుంటాయి. 

బిల్‌ రీ డిస్కౌంట్‌లో.. గడువు ముగిసి బ్యాంకులు ఎన్‌పీఏలుగా ప్రకటించిన పరిశ్రమలను గుర్తించి.. వాటి బ్యాంక్‌ పేమెంట్‌ను టీఐహెచ్‌సీ చెల్లిస్తుంది. పరిశ్రమలకు మరో 90 రోజుల సమయమిస్తాం. దీనికి పరిశ్రమలు టీఐహెచ్‌సీకి సంబంధిత బ్యాంక్‌ వడ్డీ కంటే 5 శాతం తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. టీఈవీ స్టడీలో.. టీఐహెచ్‌సీకి దరఖాస్తు చేసుకున్న ఖాయిలా పడ్డ పరిశ్రమలను ఆయా రంగాల్లోని అనుభవజ్ఞుల చేత అధ్యయనం చేయిస్తాం. సదరు పరిశ్రమ ఉత్పత్తి, యాజమాన్యం, మార్కెటింగ్, టెక్నాలజీ ఏ విభాగంలో లోపం ఉందో కనుగొని నివేదిక ఇస్తాం. దీనికయ్యే ఖర్చులో రూ.50 వేలు గ్రాంట్‌గా అందిస్తాం. సాఫ్ట్‌ లోన్‌లో సంబంధిత పరిశ్రమకు 25% పెట్టుబడులను రుణంగా అందిస్తాం.

ఏడాదిలో 50 పరిశ్రమల లక్ష్యం..: తెలంగాణలో 2,655 ఖాయిలా పరిశ్రమలున్నాయి. టీఐహెచ్‌సీకి రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీగా రూ.10 కోట్లిచ్చిం ది. మిగిలింది బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి సమీకరిస్తాం. ఇప్పటికే 25 ఎస్‌ఎంఈలకు అడ్వైజరీ సేవలందించాం. వచ్చే ఏడాది కాలంలో కనీసం 50 పరిశ్రమలకు పెట్టుబడులందించాలని లకి‡్ష్యంచాం.

ఎస్‌ఎంఈలకు రూ.5 లక్షల వరకూ నిధులు..
ఉత్పాదక రంగంలోని ఎస్‌ఎంఈల ప్రారంభ పెట్టుబడుల్లో 20 శాతం నిధులను కూడా అందిస్తాం. ఎంఎస్‌ఎంఈ చట్టం ప్రకారం రూ.25 లక్షల లోపు పెట్టుబడులున్న పరిశ్రమలను సూక్ష, చిన్న తరహా పరిశ్రమలంటారు. ఇందులో 20 శాతం అంటే రూ.5 లక్షల వరకు రుణమిస్తాం. మిగతా మొత్తాన్ని బ్యాంకుల నుంచి సమకూరుస్తాం. బ్యాంకు, ఎస్‌ఎంఈలకు మధ్య అనుసంధానకర్తగా టీఐహెచ్‌సీ వ్యవహరిస్తుంది. టీఐహెచ్‌సీ ఇచ్చే రుణానికి వడ్డీ బ్యాంక్‌కన్నా 5 శాతం తక్కువగా ఉంటుంది. తొలిదశలో పారిశ్రామిక కారిడార్లలోని ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే రుణాలందిస్తాం. ఏడాదిలో 100 ఎస్‌ఎంఈలకు రుణాలందించాలనేది మా లక్ష్యం.

15 రోజుల్లో అన్ని బ్యాంకులతో ఒప్పందాలు..
మరో 15 రోజుల్లో సిడ్బీ, ఎస్‌బీఐతో పాటు పలు ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులతో ఒప్పందం చేసుకోనున్నాం. పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఏడాదికి 7% రిటర్న్స్‌ అంచనా వేస్తున్నాం. త్వరలోనే బీఎస్‌ఈ, ఎన్‌సీఈలతో ఒప్పందం చేసుకుంటాం.  టీఐహెచ్‌సీలో నమోదైన ఎస్‌ఎంఈలను వాటిలో లిస్ట్‌ చేసే వీలవుతుంది. బై బ్యాక్‌ స్కీమ్‌ కింద తొలి దశలో ఓపీఓకి ఎంపిక చేసిన 10 కంపెనీల్లో రూ.50 లక్షల వరకూ టీఐహెచ్‌సీ పెట్టుబడులు పెడుతుంది. ఏటా 20% రికవరీ చేస్తాం. లేకపోతే ఆయా కంపెనీల షేర్‌ ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్జిట్‌ అవుతాం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement