సంగారెడ్డి: జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్ వద్ద గల హట్సన్ కంపెనీలోని వాటర్ ట్యాంక్‌లో పడి గిరిజన యువ కుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. మొగుడంపల్లి మండలం మిర్జపల్లి తండాకు చెందిన హేమ్‌సింగ్‌కు ముగ్గురు కొడుకులు. చిన్నవాడైన దశరథ్(23) హట్సన్ కంపెనీలో వాటర్‌మెన్‌గా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు.
సోమవారం ఉదయం 5.30 గంటలకు డ్యూటీకి వెళ్లాడు. సుమారు 7 గంటల ప్రాంతంలో కంపెనీలో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయడానికి వెళ్లి కాలు జారి నీళ్లలో పడ్డాడు. ఈత రాకపోవడంతో అందులో మునిగి మృతి చెందాడు. దశరథ్ ఎంతకీ రాకపోవడంతో తోటి కార్మికులు వెళ్లి చూడగా ట్యాంక్‌లో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా కంపెనీ సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో గేటు వద్ద ఆందోళనకు దిగారు. చిరాగ్‌పల్లి ఎస్‌ఐ నరేష్, జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ నుంచి శవాన్ని బయటకు తీయించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మృతి చెందాడని, న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో వచ్చిన తరువాత మాట్లాడి తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ రఘు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. జహీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment