సంగారెడ్డి: మానవత్వం మంటగలిసింది. మాతృప్రేమ, అప్యాయత అనురాగాలు పంచే కన్నతల్లి పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకే కాలయముడయ్యాడు. మరొకరితో కలిసి గొంతు కోసి, కాళ్లు నరికేసి కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ మైలారంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత (తెల్లారితే గురువారం) జరిగింది. పది గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించి నిందితులిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.
తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను గురువారం గజ్వేల్ రూరల్ సీఐ జానకిరాంరెడ్డి, ములుగు ఎస్సై విజయకుమార్ వెల్లడించారు. బండ మైలారం గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ(45) భర్త చనిపోగా, చిన్న దుకాణం నడుపుతూ కొడుకు ఈశ్వర్(23)తో కలిసి ఉంటుంది. కూతురు శైలజకు వివాహమైంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు వెంకటమ్మను హత్యచేశారని కూతురు శైలజకు చిన్నమ్మ ఫోన్‌చేసి చెప్పింది.
అక్కడికి చేరుకున్న కూతురు మెడ కోసి, రెండు కాళ్లు నరికేసిన స్థితిలో విగతజీవిగా పడిఉన్న తల్లి మృతదేహాన్ని చూసి బోరుమన్నది. తల్లిని హతమార్చి కాళ్లకున్న వెండి కడియాలు దొంగలించుకుపోయారని ఆమె ములుగు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లితో తరచూ గొడవపడే సోదరుడు ఈశ్వర్, సమీప బంధువు పర్వతం రాము(21)తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఎస్సై విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా రూరల్ సీఐ జానకిరాంరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులైన ఈశ్వర్, రాములను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తనకు పెళ్లి చేయడం లేదనే కారణంతోనే కొత్తూరుకు చెందిన రాముతో కలిసి తల్లిని హత్యచేశానని, ఎవరికీ అనుమానం రాకూడదనే కాళ్లు నరికి వెండి కడియాలు దొంగిలించామని ఈశ్వర్ నేరం అంగీకరించాడు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కాళ్ల కడియాలు స్వాధీనం చేసుకుని కోర్టులో రిమాండ్ చేశామని రూరల్ సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment