సంగారెడ్డి: ఈతకు వెళ్లిన ముగ్గురిలో ఒకరు నీటమునిగి మృతిచెందారు. మిగతా ఇద్దరు అసలు ఏం జరగనట్టు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గొర్రెల కాపారుల ద్వారా తెలుసుకున్న సర్పంచ్ నిలదీయడంతో సమాచారం బయటికొచ్చింది. ఈ ఘటన వెల్దుర్తిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఎస్సై మధుసూదన్ గౌడ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం బొమ్మారానికి చెందిన మెట్టెల నాగరాజు, మెట్టెల శ్రీకాంత్, మెట్టెల సందీప్ ముగ్గురు స్నేహితులు. హకింపేట శివారులోని హల్దీ ప్రాజెక్ట్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్ళారు. నదిలో దిగిన క్రమంలో నీటి ప్రవాహానికి సందీప్(16) గల్లంతయ్యాడు.
ఇది జరిగిన కొద్దిసేపటికి మిగతా ఇద్దరు తమకేమీ తెలియదు అన్నట్లుగా అక్కడి నుంచి గట్టుపై ఉన్న సందీప్ దుస్తులు తీసుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. రాత్రి పది గంటల సమయంలో కొప్పులపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపారుల ఇచ్చిన సమాచారంతో బొమ్మారం సర్పంచ్ శంకర్ వారిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పారు. గట్టి నిలదీయగా అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో సోమవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు హల్దీ ప్రాజెక్ట్‌లో వెతకగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment