neglect in the work
-
'హట్సన్ కంపెనీ' లో విషాదం..! యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆందోళన..!!
సంగారెడ్డి: జహీరాబాద్ మండలం గోవింద్పూర్ వద్ద గల హట్సన్ కంపెనీలోని వాటర్ ట్యాంక్‌లో పడి గిరిజన యువ కుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. మొగుడంపల్లి మండలం మిర్జపల్లి తండాకు చెందిన హేమ్సింగ్కు ముగ్గురు కొడుకులు. చిన్నవాడైన దశరథ్(23) హట్సన్ కంపెనీలో వాటర్‌మెన్‌గా రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 5.30 గంటలకు డ్యూటీకి వెళ్లాడు. సుమారు 7 గంటల ప్రాంతంలో కంపెనీలో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయడానికి వెళ్లి కాలు జారి నీళ్లలో పడ్డాడు. ఈత రాకపోవడంతో అందులో మునిగి మృతి చెందాడు. దశరథ్ ఎంతకీ రాకపోవడంతో తోటి కార్మికులు వెళ్లి చూడగా ట్యాంక్‌లో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా కంపెనీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేటు వద్ద ఆందోళనకు దిగారు. చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్, జహీరాబాద్ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ నుంచి శవాన్ని బయటకు తీయించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మృతి చెందాడని, న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో వచ్చిన తరువాత మాట్లాడి తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ రఘు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. జహీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం..
నూతనకల్(తుంగతుర్తి) : విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో ఓ విద్యార్థిని జీవితం తారుమారైంది. వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల కేంద్రానికి చెందిన వీరబోయిన సంధ్య గత సంవత్సరం ఆంగ్లమాధ్యమంలో పదో తరగతి చదివింది. వార్షిక పరీక్షల్లో హాల్‌టికెట్ నంబర్ 1830113676 హాజరైంది. మే నెలలో విడుదలైన ఫలితాల్లో సంధ్య సైన్స్ తప్పా అన్ని సబ్జెక్టుల్లో పాసైంది. అనుమానం వచ్చిన సంధ్య వెయ్యి రూపాయల చలానా తీసి బోర్డు ఆఫ్ సెకండరికీ దరఖాస్తు చేసుకుంది. సెకండరీ బోర్డు అధికారులు విద్యార్థిని రాసిన పరీక్ష జవాబు పత్రాల జీరాక్స్‌లను పోస్టు ద్వారా ఆమె ఇంటికి పంపించారు. ఆమె రాసిన సైన్స్ పేపర్–1 ఫిజిక్స్‌లో 06 మార్కులు రాగా పేపర్–2 జీవశాస్త్రం 14 మార్కులు వచ్చాయి. ఆమె రాసిన సైన్స్ జవాబు పత్రం నంబర్ 073 కాగా ఫిజిక్స్ పేపర్‌కు సంబంధించి 073కి బదులు 078 జవాబు పత్రాన్ని పంపడంతో దానిని రాసిన సంధ్య ఆమె రాసిన రాతకు పంపిన జీరాక్స్ జవాబు పత్రంలోని రాతకు తేడా కనిపించడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం దామెర శ్రీనివాస్‌ను కలువగా పేపరు దిద్దిన దగ్గరనే తప్పు జరిగిందని 073 సీరియల్ నంబరు గల జవాబు పత్రాన్ని సంధ్యకు ఇవ్వాల్సి ఉండగా దానికి బదులు 078 జవాబు పత్రాన్ని జత చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియజేసి న్యాయం చేయాలని విద్యార్థిని కోరుతుంది. ఉపాధ్యాయుల చిన్న ఆ శ్రద్ధతో విద్యార్థిని ఒక సంవత్సరం విద్యాభ్యాసాన్ని కోల్పోయినట్లయ్యింది. -
పని చేసే వారే సిద్దిపేటకు రండి..!
పద్ధతి మార్చుకోవాలని అధికారులకు హితవు పనుల్లో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఉపేక్షించం పనులు చేపట్టని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలి సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు అకస్మిక తనిఖీ సిద్దిపేట జోన్: నియోజకవర్గం అభివృద్ధికి కోట్లాది రూపాయలను మంజూరు చేయించి తీసుకొస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధికి అడ్డంకిగా మారితే ఉపేక్షించేది లేదని పని చేసే వారే సిద్దిపేటకు రావాలని మంత్రి హరీశ్‌రావు అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఆయన అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల నిర్వహణలో కాంట్రాక్టర్ల వైఫల్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో ఆయన ఘాటుగా స్పందిస్తూ కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు మంజూరీ చేయిస్తే కొందరు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకొని పనులు చేపట్టకుండా ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. అభివృద్ధి పనులను టెండర్లలో తక్కువకు దక్కించుకున్న వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అవసరమైతే సంబంధిత కాంట్రాక్టర్ పేరు, ఏజెన్సీ వివరాలను ప్రభుత్వ శాఖలన్నింటికీ సమాచారం అందించాలని వారికి ఎక్కడ పనులు దొరకకుండా చూడాలని ఆర్డీఓ, ఆయా శాఖల ముఖ్య అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఆయన అంబేద్కర్ చౌరస్తా నుంచి పత్తి మార్కెట్ యార్డు వరకు ఉన్న రోడ్డును పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం కరీంనగర్, హైదరాబాద్ రోడ్డును ఆరులేన్ల రోడ్డుగా మార్పు చేసేందుకు నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణ పనులు జాప్యంగా జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి అకస్మికంగా పర్యటించారు. సమస్య గూర్చి అధికారులను ఆరా తీశారు. రోడ్డుపైన విద్యుత్ స్తంభాలు తొలగించకపోవడం పట్ల విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రోడ్డుకిరువైపులా వర్షపు నీరు నిల్వ ఉండడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పత్తి మార్కెట్ యార్డును, రైతు బజార్‌ను అకస్మిక తనిఖీ చేశారు. రైతు బజార్లో పూర్తి స్థాయి అధికారిని ఏర్పాటు చేయాలని ఆర్డీఓను మంత్రి ఆదేశించారు. రైతు బజార్లో వర్షపు నీటితో మడుగు ఏర్పడిన విషయాన్ని గుర్తించిన మంత్రి వెంటనే సమస్యను పరిష్కరించాలని, నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.