పని చేసే వారే సిద్దిపేటకు రండి..!
పద్ధతి మార్చుకోవాలని అధికారులకు హితవు
పనుల్లో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఉపేక్షించం
పనులు చేపట్టని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలి
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు అకస్మిక తనిఖీ
సిద్దిపేట జోన్: నియోజకవర్గం అభివృద్ధికి కోట్లాది రూపాయలను మంజూరు చేయించి తీసుకొస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధికి అడ్డంకిగా మారితే ఉపేక్షించేది లేదని పని చేసే వారే సిద్దిపేటకు రావాలని మంత్రి హరీశ్‌రావు అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలో ఆయన అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల నిర్వహణలో కాంట్రాక్టర్ల వైఫల్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒక దశలో ఆయన ఘాటుగా స్పందిస్తూ కోట్లాది నిధులతో అభివృద్ధి పనులు మంజూరీ చేయిస్తే కొందరు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకొని పనులు చేపట్టకుండా ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. అభివృద్ధి పనులను టెండర్లలో తక్కువకు దక్కించుకున్న వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అవసరమైతే సంబంధిత కాంట్రాక్టర్ పేరు, ఏజెన్సీ వివరాలను ప్రభుత్వ శాఖలన్నింటికీ సమాచారం అందించాలని వారికి ఎక్కడ పనులు దొరకకుండా చూడాలని ఆర్డీఓ, ఆయా శాఖల ముఖ్య అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు ఆయన అంబేద్కర్ చౌరస్తా నుంచి పత్తి మార్కెట్ యార్డు వరకు ఉన్న రోడ్డును పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం కరీంనగర్, హైదరాబాద్ రోడ్డును ఆరులేన్ల రోడ్డుగా మార్పు చేసేందుకు నిధులను విడుదల చేసింది. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణ పనులు జాప్యంగా జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి అకస్మికంగా పర్యటించారు. సమస్య గూర్చి అధికారులను ఆరా తీశారు. రోడ్డుపైన విద్యుత్ స్తంభాలు తొలగించకపోవడం పట్ల విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే రోడ్డుకిరువైపులా వర్షపు నీరు నిల్వ ఉండడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పత్తి మార్కెట్ యార్డును, రైతు బజార్‌ను అకస్మిక తనిఖీ చేశారు. రైతు బజార్‌లో పూర్తి స్థాయి అధికారిని ఏర్పాటు చేయాలని ఆర్డీఓను మంత్రి ఆదేశించారు. రైతు బజార్‌లో వర్షపు నీటితో మడుగు ఏర్పడిన విషయాన్ని గుర్తించిన మంత్రి వెంటనే సమస్యను పరిష్కరించాలని, నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.