ఈ మధ్య ఆర్‌బీఐ వరుసగా రెండు సార్లు రెపో రేటు పెంచింది. దీంతో చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాయి. కాకపోతే సురక్షితంగా... నిర్ణీత మొత్తం వడ్డీగా కావాలనుకునేవారికి ఇలా బ్యాంకులు డిపాజిట్ రేట్లు పెంచటం అనుకోకుండా కలిసొచ్చిందని అనుకోవాలి. కాకపోతే ఇంకాస్త ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అవుతుందనుకునేవారు వివిధ కంపెనీలు ఆఫర్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల (సీఎఫ్‌డీ) వైపు చూస్తుంటారు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులయితే వాటికి పరోక్షంగానైనా ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఉంటుంది. ప్రయివేటు బ్యాంకులయితే వాటికి నిధుల బ్యాకప్ ఉంటుంది కనక అవి కూడా పర్వాలేదు. కానీ వడ్డీ రేటు ఎక్కువగా ఉందని మరే ఇతర అంశాలూ చూడకుండా కంపెనీలు ఆఫర్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం మాత్రం అంత శ్రేయస్కరం కాదన్నది నిపుణుల సూచన. ‘‘ఇలాంటి పెట్టుబడులు పెట్టినవారు తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అరుదైన సందర్భాల్లో పెట్టుబడులను కూడా నష్టపోవాల్సి రావచ్చు.ఎందుకంటే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్నంత భద్రత కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉండదు. వీటిలో రిస్క్ ఎక్కువ. వీటిని అన్‌సెక్యూర్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌గానే చూడాలి’’ అనేది నిపుణుల మాట.!! దానికి కారణాలేమిటో చూద్దాం... –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
తయారీ రంగ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు, నిర్వహణకు నిధులు కావాల్సి వచ్చినపుడు వాటిని వివిధ మార్గాల ద్వారా సమీకరిస్తూ ఉంటాయి. కంపెనీలో వాటాను ఇతరులకు విక్రయించటం... రుణాలు తీసుకురావటం వంటి మార్గాలతో పాటు... నిర్ణీత మొత్తాన్ని వడ్డీగా ఇస్తామంటూ జనం నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆహ్వానించటం కూడా ఈ మార్గాల్లో ఒకటి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వివిధ కాల వ్యవధులతో ఉంటాయి. అంటే.. మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్లు మాదిరి అన్నమాట. బ్యాంకు ఎఫ్‌డీల్లో వడ్డీ 6.7 శాతం నుంచి 7.25 శాతం మధ్య ఉంటే, ఈ కంపెనీలు ఆఫర్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతానికి పైగానే ఉంటుంది. కొన్నయితే 9– 9.5 శాతం కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి. కంపెనీలు, కాల వ్యవధులను బట్టి కనీస డిపాజిట్ మొత్తం, వడ్డీ రేట్లు మారుతుంటాయి. కొన్ని డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు ఆఫర్ చేయవచ్చు. కొన్ని కంపెనీలు ఆన్‌లైన్‌లోనే డిపాజిట్ చేసేందుకు అనుమతిస్తుంటే, మరికొన్ని ఆఫ్‌లైన్‌లో మాత్రమే పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, ఆన్‌లైన్ డిపాజి ట్లపై కాస్తంత అధిక వడ్డీ రేటు ఉండొచ్చు. ఎందుకం టే వాటికి బ్రోకర్ల ద్వారా సమీకరించటానికి అయ్యే చార్జీల బెడద తప్పుతుంది కనక. కొన్ని కంపెనీలు డిపాజిట్ల రెన్యువల్‌పై అధిక వడ్డీ రేటును ఇవ్వజూపు తున్నాయి. క్యుమిలేటివ్ డిపాజిట్ ఎంచుకుంటే వడ్డీని కాల వ్యవధి ముగిసిన తర్వాత అసలుతో కలిపి చెల్లిస్తాయి. నాన్ క్యుమిలేటివ్ డిపాజిట్లు ఎంచుకుంటే వడ్డీని నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, సంవత్సరానికోసారి చెల్లించడం జరుగుతుంది.
కంపెనీలు ఆఫర్ చేసే ఎఫ్‌డీలన్నింటికీ రేటింగ్‌లు ఒకేలా ఉండవు. ఏ, ఏఏ, ఏఏఏ ఇలా ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులను బట్టి వాటి డిపాజిట్లకు రేటింగ్‌లు ఇస్తుంటాయి. ఆయా డిపాజిట్లలో పెట్టుబడులకు భద్రత ఏ మేరకు ఉంటుందన్నది ఈ రేటింగ్ తెలియజేస్తుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక డిపాజిట్‌కు ఇచ్చిన రేటింగ్ కాల వ్యవధి ముగిసే వరకూ స్థిరంగా ఉండదు. డిపాజిట్లు జారీ చేసిన కంపెనీ ఆర్థిక పరిస్థితులు, చెల్లింపు సామర్థ్యాలను రేటింగ్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయి. అవసరమైతే రేటింగ్‌లను తగ్గించేస్తుంటాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ రేటింగ్‌ను తప్పకుండా గమనించాలి. ఉన్నట్లుండి ఆ కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే... మన డిపాజిట్ల భద్రత మరింత తగ్గిందని భావించాలి.
వడ్డీతో పాటే.. రిస్క్ కూడా!
కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రిస్క్ చాలా ఎక్కువ. కొన్ని సందర్భాల్లో పెట్టుబడి కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కొంతలో కొంత మెరుగేమి టంటే అధిక రేటింగ్ ఉన్న కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయ టం.వీటిక్కూడా రిస్క్ ఉంటుంది. అధిక రేటింగ్ అన్నది భద్రతను సూచించేదే కానీ... హామీ కాదు. అధిక రేటింగ్ కలిగిన కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లు డిఫాల్ట్ అవడం, పెట్టుబడి కూడా చెల్లించలేకపోయిన సందర్భాలు గతంలో ఉన్నాయి కూడా. ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించాలంటే తయారీ రంగంలోని కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు కచ్చితంగా రేటింగ్ పొందడం తప్పనిసరి. రూ.100 కోట్లకుపైగా నికర విలువ కలిగిన కంపెనీలు, టర్నోవర్ రూ.500 కోట్లకు పైగా ఉన్నవి ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించేందుకు కంపెనీల చట్టం అనుమతిస్తోంది. నిజానికి రేటింగ్ తక్కువ ఉండి, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న కంపెనీలు మరింత ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయటానికి ముందుకొస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.
డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినవారు...
రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేస్తే ఆయా సాధనాల్లో పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఎన్‌ఏవీలు క్షీణిస్తాయి. సదరు ఫండ్ ఈ సాధనాల్లో ఎంత పెట్టుబడి పెట్టిందనేదానిపై ఈ క్షీణత ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పెట్టుబడి ఉంటే ఎక్కువ నష్టం తప్పదు. ఆగస్ట్ చివరి గణాంకాల ప్రకారం 40 డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు బాండ్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. వీటి పెట్టుబడులు 0.2–10 శాతం మధ్య ఉన్నాయి. ఈ గ్రూపు బాండ్ల రేటింగ్‌ను తగ్గించడంతో డెట్ ఫండ్స్ ఎన్‌ఏవీల విలువలు 0.05 నుంచి 2 శాతం వరకు ప్రభావితం అవుతాయని అంచనా.
సీఎఫ్‌డీల్లో పెట్టుబడులకు పరిశీలించాల్సిన అంశాలివీ...
► సీఎఫ్‌డీల్లో రిస్క్ ఉన్నప్పటికీ ఎక్కువ రాబడుల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. బ్యాంకుల్లో రూ.లక్ష వరకు డిపాజిట్‌పై బీమా ఉంటుంది. సీఎఫ్‌డీల్లో ఇది రూ.20,000కే పరిమితం. కనుక ఒక కంపెనీలో రూ.20,000కు డిపాజిట్ పరిమితం చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు.
►అధిక రాబడులే కాదు! అదే సమయంలో అధిక రిస్క్ కూడా ఉంటుందని తెలుసుకోవాలి. ఏడాది కాల పరిమితి డిపాజిట్ల విషయంలో బ్యాంకులు, కంపెనీల డిపాజిట్ల మధ్య వడ్డీ రేటు వ్యత్యాసం తక్కువే. కనుక తక్కువ కాల వ్యవధి కోసం రిస్క్ చేయడం మంచిది కాదు.
►కార్పొరేట్ గవర్నెన్స్‌లో మంచి ప్రమాణాల కంపెనీల ఎఫ్‌డీలను పరిశీలించొచ్చు.
►దీర్ఘకాలం పాటు సీఎఫ్‌డీల్లో లాకిన్ అయిపోకుండా ఉండేందుకు, వివిధ కాల పరిమితుల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం తెలివైన పని. పైగా వడ్డీ రేట్లలో మార్పులు జరుగుతున్నందున ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాల పరిమితుల డిపాజిట్లను ఎంచుకోవచ్చు.
► సీఎఫ్‌డీలో వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఏడాదిలో ఈ ఆదాయం రూ.5,000 దాటితే కంపెనీయే టీడీఎస్ మినహాయించి మిగిలిన మేర చెల్లిస్తుంది. ఈ వడ్డీ ఆదాయం సంబంధిత డిపాజిట్ దారుని వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది.
క్రెడిట్ రేటింగ్ అంటే..?
ఓ కంపెనీ వ్యాపారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి, వ్యాపార పరమైన రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో యాజమాన్యం క్వాలిటీ, సామర్థ్యాన్ని రేటింగ్ ఏజెన్సీలు మదింపు వేసి దాన్ని తెలియజేస్తూ ఇచ్చేదే క్రెడిట్ రేటింగ్. దేశంలో కేర్, క్రిసిల్, ఇక్రా, ఇండియా రేటింగ్స్, బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఏజెన్సీలు ఈ సేవలు అందిస్తున్నాయి. రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం అంటే... డిపాజిట్లు, ఎన్‌సీడీల రూపంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం సంబంధిత కంపెనీకి తగ్గినట్టు లెక్క. దీనివల్ల రుణదాతలు కొత్త రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. అలాగే, ప్రస్తుత రుణాల రీఫైనాన్స్‌కు కూడా ఒప్పుకోకపోవచ్చు. అలాగని, ఏ రేటింగ్ కూడా స్థిరంగా ఉంటుందని చెప్పలేం. నెగెటివ్ నుంచి పాజిటివ్‌కు, పాజిటివ్ నుంచి నెగెటివ్‌కు కూడా మారిపోవచ్చు. సాధారణంగా ఏఏఏ లేదా ఏఏ రేటింగ్ అనేవి అధిక రేటింగ్ సూచికలు. ఈ రేటింగ్ ఉన్న వాటికే పరిమితం కావడం కాస్తంత భద్రతనిస్తుంది. ఇంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కచ్చితంగా ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టే. మీరు పెట్టుబడి పెట్టిన డిపాజిట్ రేటింగ్ తగ్గించడం జరిగితే, పెనాల్టీ చెల్లించయినా ముందే వైదొలగడం సురక్షితమన్నది నిపుణుల సూచన.
క్రెడిట్ రేటింగ్ తగ్గితే...?
క్రెడిట్ రేటింగ్ అన్నది ఓ ఆర్థిక సాధనానికి ఉన్న క్రెడిట్ రిస్క్‌ను తెలియజేస్తుంది. కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ రేటింగ్ అత్యంత ప్రధానమైన కొలబద్దగా భావించాలి. ఈ వారంలోనే ఇక్రా, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూపు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సీడీ), దీర్ఘకాలిక రుణాల రేటింగ్‌లను తగ్గించాయి. చాలా వరకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎన్‌సీడీలు, డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్ల రాబడులను ఈ పరిణామం దెబ్బతీస్తుంది కూడా. అయితే, ఓ కంపెనీ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించడం ఇదే తొలిసారి కాదు. 2015లో ఆమ్టెక్ ఆటో రేటింగ్‌ను కూడా ఇదే విధంగా రేటింగ్ ఏజెన్సీలు తగ్గించాయి. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన జేపీ మోర్గాన్ మ్యూచువల్ ఫండ్ చేదు ఫలితాలను చవిచూసింది. 2017లో ఐడీబీఐ బ్యాంకు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రేటింగ్‌లను కూడా ఏజెన్సీలు తగ్గించాయి. దీంతో ఈ కంపెనీ షేర్ల ధరలు పతనమయ్యాయి.
రేటింగ్ ఏం చెబుతోంది..? దీర్ఘకాలిక డెట్ సాధనాలకు....
ఏఏఏ: చెల్లింపు బాధ్యతలను సకాలంలో నిర్వహిం చడంలో అత్యధిక భద్రతను ఈ రేటింగ్ తెలియ జేస్తుంది. అతి తక్కువ క్రెడిట్ రిస్క్ గ్రేడ్ ఇది.
ఏఏ: ఈ రేటింగ్ కలిగిన సాధనాలు కూడా అధిక భధ్రతకు చిహ్నమే. ఇది కూడా తక్కువ రిస్క్‌ను సూచిస్తుంది.
ఏ: సకాలంలో చెల్లింపులు చేసే విషయంలో తగినంత భద్రత ఉందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది. మిగిలిన రెండు సాధనాల కంటే ఇందులో భద్రత కొంచెం తక్కువ.
బీబీబీ: తీసుకున్న డిపాజిట్లు, రుణాలు తిరిగి చెల్లింపుల విషయంలో మోస్తరు భద్రతే ఉన్నట్టు ఈ రేటింగ్ అర్థం. మోస్తరు రిస్క్ ఉంటుంది.
బీబీ: తీసుకున్న వాటిని తిరిగి చెల్లించే విషయంలో మోస్తరు డిఫాల్ట్ రిస్క్ ఉంటుందని ఈ రేటింగ్ తెలియజేస్తుంది.
బీ: ఇది అధిక రిస్క్‌కు సూచిక. డిఫాల్ట్ రిస్క్ అధికంగా ఉంటుంది.
సీ: ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే డిఫాల్ట్‌కు అత్యధిక రిస్క్ ఉంటుంది.
డీ: డిఫాల్ట్ అయ్యేందుకు, త్వరలోనే డిఫాల్ట్ అవనున్నట్టు ఈ రేటింగ్ తెలియజేస్తుంది.
షార్ట్ టర్మ్ డెట్ సాధనాలకు రేటింగ్
ఏ1: క్రెడిట్ రిస్క్ చాలా తక్కువగా ఉందని తెలియజేస్తుంది. అంటే పెట్టుబడులకు, అధిక భద్రతకు చిహ్నం. సకాలంలో చెల్లింపులు చేసేందుకు అధిక సామర్థ్యం ఉందని తెలియజేసేది.
ఏ2: తక్కువ క్రెడిట్ రిస్క్‌కు సూచిక. ఇందులో పెట్టుబడులకూ అధిక భద్రత ఉంటుందని భావించొచ్చు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఏ3: మోస్తరు స్థాయి భద్రతే ఉంటుంది. మిగిలిన రెండింటితో పోలిస్తే ఈ రేటింగ్ ఉన్న సాధనాల్లో పెట్టుబడులకు రిస్క్ కాస్త ఎక్కువ ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది.
ఏ4: భద్రత నామమాత్రంగా ఉంటుందన్న దానికి ఈ రేటింగ్ నిదర్శనం. సకాలంలో చేసే చెల్లింపులకు గ్యారంటీ ఉండదు. అధిక రిస్క్ ఉన్న గ్రేడ్‌గానే దీన్ని చూడాల్సి ఉంటుంది.
డీ: ఈ రేటింగ్ కలిగిన సాధనంలో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే డిఫాల్ట్ లేదా డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment