
ముంబై : మెజార్టీ విశ్లేషకుల అంచనాల మేరకే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తన నిర్ణయాన్ని ప్రకటించింది. కీలక వడ్డీరేటు రెపోను యథాతథంగా 6 శాతంగానే కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజులు సమావేశమైన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో. ప్రస్తుతం రెపోరేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి వద్ద ఉంది. ఎంఎస్‌ఎఫ్, బ్యాంకు రేటును కూడా యథాతథంగా 6.25 శాతంగా ఉంచుతున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. రివర్స్ రెపో రేటు, నగదు నిల్వల నిష్పత్తిని కూడా యథాతథంగానే ఉంచింది.
ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు వృద్ది రేటుకు సహకరిస్తాయని ఎంపీసీ అభిప్రాయపడింది. ఆగస్టు నెలలో తగ్గింపు నిర్ణయం అనంతరం ద్రవ్యోల్బణం భయాల పేరుతో రెపోరేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తోంది. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్ట స్థాయి 3.59 శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ట స్థాయి 3.58 శాతానికి ఎగిసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment