కొత్త నోటు చిరిగితే.. జేబుకు చిల్లే! | Banks Refusing Soiled New Currency Notes | Sakshi
Sakshi News home page

కొత్త నోటు చిరిగితే.. జేబుకు చిల్లే!

Published Thu, Mar 22 2018 1:13 AM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM

Banks Refusing Soiled New Currency Notes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త నోటు.. కొత్త కొత్తగా బాగున్న నోటు.. కానీ కొంచెం చిరిగిందా.. అంతే సంగతులు. ఆ నోటును బ్యాంకులు తీసుకోవు.. రిజర్వు బ్యాంకుకు వెళ్లినా లాభం లేదు. పాత పెద్ద నోట్లను రద్దు చేసి, కొత్త నోట్లను చలామణిలోకి తెచ్చి 16 నెలలవుతున్నా.. చిరిగిన/దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడికి మార్గదర్శకాలు రాకపోవడమే దీనికి కారణం. చిరిగిన మేరకు కొత్త నోట్లకు జరిగిన నష్టాన్ని లెక్కించాల్సి ఉంటుందని.. ఆ మేరకు మార్గదర్శకాలు లేకపోవడంతో వాటిని తీసుకోవడం లేదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. అయితే బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేసుకున్నప్పుడు, ఏటీఎంలలో మాత్రం చిరిగిన కొత్త నోట్లు వస్తుండటం గమనార్హం. 

‘కొత్త’సమస్యలు.. 
దాదాపు 16 నెలల కింద కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసి.. రూ.2 వేలు, రూ.500, రూ.200 విలువ చేసే కొత్త నోట్లను చలామణీలోకి తెచ్చిన విషయం తెలిసిందే. పాత నోట్ల రద్దుతోనే నానా అవస్థలు పడిన జనం.. ఇప్పుడు కొత్త నోట్లతో కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. పొరపాటున చిరిగిపోయిన, దెబ్బతిన్న కొత్త నోట్లను మార్పిడి చేయడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. అలా కొత్త నోట్ల మార్పిడి కోసం వస్తున్నవారిని రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాయి. 
 
ఎక్కడికెళ్లినా అదే సమాధానం.. 
చిరిగిన కొత్త నోట్ల మార్పిడి కోసం హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినా నిరాశే ఎదురవుతోంది. రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి కొత్త నోట్ల మార్పిడికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని.. ఆ మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే చిరిగిన నోట్లను మార్పిడి చేస్తామని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకు చిరిగిన నోట్లను దాచిపెట్టుకోవాలని సూచిస్తూ తిప్పిపంపుతున్నారు. అయితే తాము ఆదేశాలు ఇచ్చేవరకు చిరిగిన/ దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడి చేయవద్దని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నట్లు బ్యాంకులు పేర్కొంటున్నాయి. 
 
నోటు నష్టాన్ని మినహాయించుకుని.. 
సాధారణంగా నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం.. కరెన్సీ నోటుకు జరిగిన నష్టాన్ని లెక్కించేందుకు నోటుపై చిరిగిన/దెబ్బతిన్న/పాడైపోయిన భాగాలను కొలతలు తీస్తారు. ఆ నోటు పరిమాణానికి సరిపడా ఉండే గ్రిడ్‌ (గ్రాఫ్‌ పేపర్‌ మాదిరిగా ఉండే కొలమానం)పై చిరిగిన నోటును పెట్టి.. దెబ్బతిన్న భాగం నష్టాన్ని లెక్కిస్తారు. నోటు విలువ నుంచి ఈ నష్టాన్ని మినహాయించుకుని మిగతా విలువను చెల్లిస్తారు. వేర్వేరు విలువ గల కరెన్సీ నోట్ల పరిమాణం వేర్వేరుగా ఉండడంతో ఆయా నోట్ల నష్టాన్ని లెక్కించేందుకు బ్యాంకులు వేర్వేరు గ్రిడ్‌లను వినియోగిస్తాయి. చివరిగా పెద్ద నోట్ల రద్దుకు నాలుగు నెలల ముందు చిరిగిన/దెబ్బతిన్న నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
‘కొత్త’మార్గదర్శకాలు లేకపోవడంతో.. 
పాత పెద్ద నోట్లు రద్దయి కొత్తగా రూ.2 వేలు, రూ.500, రూ.200 విలువైన నోట్లు చలామణీలోకి వచ్చాక నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలేవీ జారీ కాలేదు. పాత రూ. 500 నోట్లతో పోలిస్తే కొత్త నోట్ల పరిమాణంలో తేడా ఉంది. ఇక రూ.2 వేలు, రూ.200 నోట్లు పూర్తిగా కొత్త విలువతో కూడినవి. దీంతో పాత నోట్లకు సంబంధించిన గ్రిడ్‌లను కొత్త నోట్లకు వినియోగించుకోలేని పరిస్థితి ఉందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు కొత్త నోట్లకు సంబంధించిన గ్రిడ్‌లతోపాటు కొత్త మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉందని చెబుతున్నాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా స్పందించేందుకు బ్యాంకులు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారులు నిరాకరిస్తుండడం గమనార్హం. 
 
చిరిగిన నోట్లతో కమీషన్ల దందా 
చిరిగిన కొత్త నోట్ల మార్పిడికి బ్యాంకులు నిరాకరిస్తుండటం.. చిరిగిన నోట్ల మార్పిడి చేసే వ్యాపారస్తులకు వరంగా మారింది. భారీగా కమీషన్ల దందాకు తెరలేచింది. రూ.2 వేల చిరిగిన నోటు మార్పిడికి రూ.500 వరకు.. రూ.500 చిరిగిన నోటు మార్పిడికి రూ.200 వరకు కమీషన్‌గా తీసుకుంటుండటం గమనార్హం. దీంతో చాలా మంది అడ్డగోలు కమీషన్‌ కింద చిరిగిన నోట్లను మార్పించుకోవాల్సి వస్తోంది. కొందరు అంత కమీషన్‌ ఇవ్వలేక బ్యాంకుల్లో ఎప్పుడు మార్పిడి చేస్తారోనంటూ ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement