ఒకటో తేదీ పింఛన్‌ను అందుకునేందుకు ఆతృతగా ఎదురుచూసే నిరుపేదలకు ఈనెలా నిరీక్షణ తప్పేలా లేదు. బ్యాంకులు సకాలంలో నగదు సమకూర్చక పోవడంతో పింఛన్‌దారులు అధికారులు, సిబ్బంది చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన మూడు నెలలుగా జిల్లాలో పింఛన్‌దారులపరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మార్చి ఒకటో తేది వచ్చేసింది. ఇప్పటిదాకా జిల్లాకు నగదు రాలేదు. పింఛన్లు ఎలా పంపిణీచేయాలో తెలియకఅధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప : వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ అందజేస్తుంది. వారు నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా.. వైద్యానికి ఖర్చు చేయాలన్నా ఈ సొమ్మే ఆధారం. జిల్లాలో 2,55,200 మందికి ఆసరాగా ఉంటుంది. వీరందరి పింఛన్లకు రూ. 32కోట్ల డబ్బు అవసరం అవుతుంది. వాస్తవానికి ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ ప్రారంభించి అయిదో తేదీ నాటికి పూర్తిచేయాలన్నది ప్రణాళిక. ఇది గత కొన్ని నెలలుగా అమలు కావడం లేదు. దీంతో గడువు పదో తేదీకి పెంచుతున్నారు. అప్పటికీ కొలిక్కి రాకపోవడంతో మరో మూడు నాలుగు దఫాలు పెంచుతున్నారు. ప్రతినెలా ఇది సాధారణమైపోయింది. అవసరమైన నగదు పూర్తిస్థాయిలో రాకపోవడమే దీనికి కారణం.
వేధిస్తున్న నగదుకొరత: జిల్లాలో బ్యాంకులను నగదు కొరత వేధిస్తుండటంతో అధికారులు ముందస్తు ప్రణాళికలో భాగంగా రూ. 400 కోట్లను ఇవ్వాలని ఆర్‌బీఐకు ప్రతిపాదనలు పంపారు. వారు కోరిన మేర వస్తే ఆ డబ్బు మార్చి నెల వరకు సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. ఇక ఒకటో తేదీ వస్తోందంటే చాలు.. పింఛన్‌దారులు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల కోసం బ్యాంకులు డబ్బును సిద్ధంగా ఉంచుకుంటాయి.గత మూడు నెలలుగా నిల్వలు లేకపోవడంతో ఈ నెల లబ్ధిదారులకు చెల్లించే సొమ్ము సర్దుబాటు చేయడానికి సమయం పడుతుందంటూ బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితితో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ఫిబ్రవరిలోనూ నగదు కొరత వెంటాడింది. ఆ నెలలో 15 రోజులు గడిచినా పింఛన్లు పంపిణీ చేయాలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది.
పింఛన్లకు రూ. 32 కోట్లు కావాలి..
మార్చి నెల వచ్చేసింది. రూ. 32 కోట్లు కావాలి. ఈ సొమ్ము సిద్ధంగా ఉంటేనే అందరికీ డబ్బు అందిస్తారు. కానీ ఇంత వరకు బ్యాంకులకు చిల్లిగవ్వ రాలేదు. గత కొన్ని రోజులుగా రోజూ లావాదేవీలకు ప్రైవేటు బ్యాంకుల నుంచి నగదు బదులుగా తీసుకుంటున్న వైనం. దీంతో రూ. 32 కోట్ల నగదు ఎలా సమకూర్చుకోవాలలో తెలియక బ్యాంకర్లు సైతం తలలు పట్టుకుంటున్నారు. నగదు లేక స్టేట్‌బ్యాంక్, గ్రామీణ బ్యాంకు, సిండికేట్ బ్యాంకులు చేతులెత్తేశాయి. స్టేట్‌బ్యాంక్ ఏకంగా రూ. 23 కోట్ల మేర సమకూర్చాల్సి ఉంటుంది. అనంత గ్రామీణ బ్యాంకు రూ. 8 కోట్లు, సిండికేట్ బ్యాంక్ రూ. 2 కోట్ల మేర ఇవ్వాల్సి ఉంది. ఆర్‌బీఐ నుంచి రెండు రోజుల్లోగా నగదు రానుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
బ్యాంకులు సమకూర్చగలవా?
వాస్తవానికి బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు భారీగా తగ్గిపోయాయి. ఉప సంహరణలు పెరిగిపోయాయి. బ్యాంకుల నుంచి బయటకు వెళ్తున్న నగదులో 25 శాతం కూడా తిరిగి జమ కావడం లేదు. ఈ నేపథ్యంలో వీరు మాత్రం ఎక్కడి నుంచి సమకూర్చగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్‌బీఐ నగదు సమకూర్చితే తప్ప పరిస్థితి చక్కబడే అవకాశం లేదు. జిల్లా పాలనాధికారి సైతం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ద్వారా ఆర్‌బీఐపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో బ్యాంకులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఇంత తీవ్రమైన కొరత మరే జిల్లాలోనూ లేదని చెబుతున్నారు.
ఆర్‌బీఐ నుంచి నగదు వస్తోంది..
నగదు సమస్య ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి మార్చిలో డబ్బుకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఆర్‌బీఐ నుంచి నగదు వస్తోంది. ఇందులో పింఛన్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. జిల్లాకు రూ. 400 కోట్లు ఇవ్వాలని ఇప్పటికే ఆర్‌బీఐని కోరాం. ఆ డబ్బులు రెండు రోజుల్లో పంపుతున్నట్లు తమకు సమాచారం ఉంది. డబ్బు రావడం ఆలస్యమైన కారణంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కాకుండా ఏడో తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేస్తాం. – అంజనేయ ఆచారి, లీడ్‌బ్యాంకు మేనేజర్, కడప
బ్యాంకర్లు హామీ ఇచ్చారు
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబందించి నగదు సమకూర్చుతామని బ్యాంకర్లు హామీ ఇచ్చారు. ఇంత వరకు 49 మండలాల్లో నగదు సమకూరింది. రాజంపేట మండలానికి బుధవారం సాయంత్రంలోగా వచ్చేస్తుంది. ఎంపీడీవోల అకౌంట్ల ద్వారా పంచాయతీ కార్యదర్శులకు పంపిణీ చేస్తాం. అలా పింఛన్ డబ్బును పంచాయతీ కార్యదర్శులు పంపిణీ చేస్తారు. – రామచంద్రారెడ్డి,పీడీ, డీఆర్‌డీఏ, కడప
Comments
Please login to add a commentAdd a comment