ఎర్రటి ఎండలో విలవిల్లాడుతున్న పండుటాకులు
మిగతా పథకాల్లానే పింఛన్ల డబ్బు ఖాతాల్లో వేయాలన్న చంద్రబాబు
ఆయన వదిన, దత్తపుత్రుడు, నిమ్మగడ్డ రమేశ్... అందరిదీ ఇదే మాట
చివరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి మరీ సాధించిన తీరు
పాపం... దూరంగా ఉన్న బ్యాంకులకు వెళ్లలేక వృద్ధుల అవస్థలు
చాలా గ్రామాలకు బ్యాంకులు దూరం... ఏటీఎంలూ దగ్గర్లో లేవు
డబ్బులు పడ్డా... చాలామంది ఖాతాలు నిర్వహణలో లేక ఇబ్బందులు
కేవైసీ చేయాలని బ్యాంకుల షరతు.. ఎలా చేయాలో తెలియక ఇక్కట్లు
సమయానికి డబ్బులు రాక తంటాలు
చంద్రబాబును నానా శాపనార్థాలూ పెడుతున్న సామాజిక పింఛనర్లు
ఎన్నికల రోజు తమ తడాఖా చూపిస్తామంటూ పలుచోట్ల తిట్లు
వణుకుతున్న బాబు; దీనికి జగనే కారణమంటూ ఎల్లో మీడియా స్టోరీలు
అసలు మొదటి నుంచీ వలంటీర్ల వ్యవస్థనే టార్గెట్ చేసిన బాబు ముఠా
వాళ్లు మగాళ్లు లేనపుడు వెళ్లి ఇళ్ల తలుపులు కొడుతున్నారన్న బాబు
ఉమెన్ ట్రాఫికింగ్‌లో వలంటీర్ల పాత్ర ఉందన్న దత్తపుత్రుడు పవన్
తీవ్రమైన ఆరోపణలు చేసి... ఇపుడు వలంటీర్లపై ప్రేమ నటిస్తూ కబుర్లు
బాబు ప్రచార యావ; గ్రాఫిక్స్ మాయలు తమకు తెలుసంటున్న అవ్వాతాతలు
సాక్షి, అమరావతి: పింఛన్ల కోసం ఎర్రటి ఎండలో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య బాధితులు బ్యాంకుల వెంట, ఏటీఎంల వెంట, సచివాలయాల వెంట తిరుగుతున్నారు. కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. కొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు. ఇప్పుడు నీ కళ్లు చల్లబడ్డాయా చంద్రబాబు నాయుడూ? ఇప్పుడు నీ మనసు శాంతించిందా? ఐదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీనే నేరుగా అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లు... ఈ ఒకటి రెండు నెలల్లోనే ఓటర్లను ప్రభావితం చేసేస్తారా?
ఒకవేళ ప్రభావితం చేయగలిగి ఉంటే ఇప్పటికే చేసి ఉండేవారు కదా!!. ఐదేళ్లలో లేనిది... కొత్తగా ఈ రెండు నెలల్లో మారింది.. ఏంటి చంద్రబాబు నాయుడూ నీ కుట్ర బుద్ధి తప్ప? మీరే గనక పనిగట్టుకుని కోర్టుల్లో పిటిషన్లు వేసి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి వలంటీర్లను ఈ కార్యక్రమానికి దూరం చేయకుండా ఉంటే అవ్వాతాతలకు ఈ కష్టాలుండేవా? వాళ్లు ఈ రెండు నెలలు కూడా ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చి ఉంటే పండుటాకులు ఇంత వేదన పడేవారా? ఇదెక్కడి రాజకీయం బాబూ?
బ్యాంకుల్లో వెయ్యమన్నదీ మీరేగా?
ప్రతి పథకాన్నీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం పింఛన్లను మాత్రం ఎందుకు వేయటం లేదు? వలంటీర్లు నేరుగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు నుంచి... ఆయన వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి, దత్త పుత్రుడు పవన్.. వీళ్లు చెప్పినట్టల్లా ఆడే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వీళ్లంతా అడిగిన ప్రశ్న ఇదే. అక్కడితో ఆగలేదు వీళ్లెవరూ. కోర్టులకెక్కారు. వలంటీర్లు పింఛన్లు ఇవ్వటానికి ఈ మూడు నెలలూ వీల్లేదన్నారు. నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే నగదు వెయ్యాలని ఎన్నికల కమిషన్‌కు నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చెప్పారు.
చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ బహిరంగ సభల్లో కూడా ఇదే చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో వేసేలా ఈసీపై ఒత్తిడి తెచ్చారు. నిజానికి బ్యాంకు ఖాతాల్లో వేస్తే ఏమవుతుందో ప్రభుత్వానికి తెలియదా? ప్రతి పథకాన్నీ పైసా అవినీతికి తావు లేకుండా నేరుగా లబి్ధదారులకే చేరుస్తున్న వైఎస్ జగన్‌కు ఇదంతా తెలియదా? కానీ పింఛన్లు తీసుకుంటున్న వాళ్లంతా వృద్ధులు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వాళ్లు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే తీసుకోవటం వాళ్లకంత సులువేమీ కాదు. బ్యాంకులు ఎక్కడో ఊళ్లకు దూరంగా ఉంటాయి.
అన్ని గ్రామాల్లోనూ ఏటీఎంలు అందుబాటులో లేవు. పైపెచ్చు ఖాతాల్లోని డబ్బులు ఎలా తియ్యాలో కూడా కొందరికి తెలియదు. కొందరికి ఖాతాలే లేవు. ఇంకొందరిదైతే ఇల్లు కదల్లేని పరిస్థితి. అందుకే బ్యాంకుల్లో వేయకుండా... ఆ నగదును బ్యాంకుల్లో డ్రా చేసి నేరుగా వలంటీర్లు ఇళ్లకు పట్టుకెళ్లి వాళ్లకు ఇస్తున్నారు. ఒకరకంగా ఖాతాల్లో వేయటానికన్నా అడ్వాన్స్డ్ ప్రక్రియ ఇది. అలాంటి ప్రక్రియను నిలిపేయించడానికి నీకు మనసెలా ఒప్పింది చంద్రబాబూ? ఖాతాల్లో వెయ్యమని చెప్పేటప్పుడు వీళ్లు ఇన్ని కష్టాలు పడతారన్న సంగతి నీకు తెలియనిది కాదు కదా? మండుటెండల్లో విలవిల్లాడుతున్న వృద్ధుల శాపాలిపుడు ఊరికే పోవు కదా?
బాబు రక్షణకు ఎల్లో మీడియా...
ఎండలకు విలవిల్లాడుతూ వృద్ధులు పెడుతున్న శాపనార్థాలకు తానెక్కడ కొట్టుకుపోతాడోనన్న భయం చంద్రబాబునిపుడు నిలువెల్లా వణికిస్తోంది. దీంతో పింఛన్లు ఇవ్వటానికి సచివాలయ సిబ్బందిని వినియోగించాలని, వాళ్ల ద్వారా ఇంటింటికీ పంచాలని కథలు చెబుతున్నారు. నిజానికి సచివాలయ సిబ్బందిని కూడా మొదట్లో అడ్డుకున్నది చంద్రబాబే. పైపెచ్చు ప్రతి ఇంటినీ అడ్రస్ పట్టుకుని వెతకటం, ఆ చిరునామాలో ఉన్నవారికి ఇవ్వటం ఎవరో కొత్తవారిని చెయ్యమంటే సాధ్యం కాదు.
అయితే ఈసీ ఆదేశాల మేరకు 80 ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానికి పరిమితమైన వారి విషయంలో సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లే పింఛన్లు ఇస్తున్నారు. దారుణమేంటంటే ఇలా పింఛన్లిచ్చేటపుడు కొందరు చిరునామాలు దొరక్క వలంటీర్ల సాయం తీసుకుంటున్నారు. కానీ వారు వలంటీర్ల సాయం తీసుకున్నారన్న ఒకే ఒక్క కారణంతో ‘ఈనాడు’ దాని తోక మీడియా దౌర్భాగ్యపు రాతలు రాసి ఆయా సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేదాకా వెంటాడుతున్నాయి.
చంద్రబాబు మాత్రం సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఇస్తే బాగుంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైపెచ్చు చేసిందంతా చేసి... ఇలా వృద్ధులు మండుటెండల్లో బయటకు రావటానికి ముఖ్యమంత్రి జగనే కారణమని ‘ఉల్టా చోర్...’ తరహాలో నిందిస్తున్నారు. ఈ మాటలు ఎవరూ నమ్మటం లేదని తెలిసి... ఎల్లో మీడియానూ రంగంలోకి దింపారు. ‘ఈ పాపం జగన్‌దే’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో వండి వార్చిన కథనం ఉద్దేశం చంద్రబాబును రక్షించటమే.
మొదటి నుంచీ వలంటీర్లంటే కక్షే...
కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఏపీ వలంటీర్ల సైన్యాన్ని ప్రశంసించని వారు లేరు. కానీ చంద్రబాబు ముఠాకు మొదటి నుంచీ ఈ వ్యవస్థంటే ఇష్టం లేదు. వలంటీర్ల సేవల కారణంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరొస్తుండటమే దీనికి కారణం. ఈ వ్యవస్థను ఎలాగైనా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వలంటీర్లంతా మగవాళ్లు లేనపుడు ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వీళ్లది మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు నాయుడు నానా మాటలూ అన్నారు.
ఇక ఈయన గారి దత్తపుత్రుడైతే మూడడుగులు ముందుకేసి.. వలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారని, ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ తమ వాళ్లచేత కేసులూ వేయించారు. కానీ వీళ్ల పథకాలేవీ పారకపోవటంతో... తాము వలంటీర్లకు వ్యతిరేకం కాదంటూ, తాము గెలిస్తే వారి పారితోషికాన్ని పెంచుతామంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. చేసిన పనికి కూలీ ఇవ్వనివాడు ఫ్రీగా బిరియానీ పెట్టిస్తానంటే నమ్మేదెవరు బాబూ?
బాబు యావ తెలియనిదెవరికి?
బాబుకు పని చేయటం చేతకాదు. కానీ చేయని పనిని కూడా అందంగా చెప్పుకోవటంలో మాత్రం పెద్ద బిడ్డే. అమరావతిలో ఒకటిరెండు భవనాలు కూడా కట్టకుండానే అదో పెద్ద సింగపూర్‌లా అయిపోయినట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసుకున్న ఘనత బాబుది. నిజానికి అమరావతిని గురించి తెలిసిన వారు... బయటి వారెవరైనా ఆ ప్రాంతమెలా ఉందని అడిగితే, పేరు తప్ప అక్కడేమీ లేదని చెప్పటానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి.
ఇక 2015లో గోదావరి నదిని ఈయనే కనిపెట్టినట్టు పుష్కరాల సందర్భంగా భారీ ప్రచార వీడియోను షూట్ చేయబోయి ఏకంగా 29 మంది అమాయక భక్తుల్ని బలితీసుకున్నాడు. ఏడాదిన్నర కిందట కూడా... ఎక్కువ మంది జనం వచ్చినట్లుగా చూపించుకోవాలన్న తాపత్రయంలో ఇరుకు సందులో సభ నిర్వహించి, జనాన్ని రప్పించడం కోసం తాయిలాలు కూడా ఇవ్వటంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెబుతూ పోతే బాబు ప్రచారపిచ్చికి ఎంతైనా చాలదు.
అప్పుడు ప్రభావితం చేస్తారా..!!
వలంటీర్లను రాజకీయాలకు సంబంధం లేకుండా, అందరి వద్ద నుంచి నిర్ణీత సమయంలో దరఖాస్తులు స్వీకరించి, అధికారులు ఇంటర్వ్యూలు చేసి వారిని ఎంపిక చేశారు. అలాంటి వలంటీర్లు ఇప్పుడు పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటింటికి వెళితే, వాళ్లు అధికార పార్టీకి అనుకూలంగా లబ్దిదారులను ప్రభావితం చేస్తారనేది చంద్రబాబు అండ్ కో విపరీత బుద్ధి.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే అంశంపై ఫిర్యాదు చేసి వలంటీర్లను అడ్డుకున్నారు. ‘అయినా నిత్యం ఆ 50 ఇళ్ల మధ్య ఉండే వలంటీర్లు... పింఛన్ల పంపిణీకి లబ్దిదారుల ఇంటికి వెళ్లిన పది నిమిషాలు లేదా పావుగంట సమయంలోనే రాజకీయంగా ప్రభావితం చేస్తారా? వాళ్లు గనక చెయ్యాలనుకుంటే మిగిలిన రోజులన్నీ వాళ్ల పక్కనే ఉంటూ ప్రభావితం చేసే అవకాశం ఉండదా?’ అనేది పింఛనుదార్ల మాట.
బాబూ... అచ్చెన్నాయుడు చేత ఫిర్యాదు చేయించలేదా?
వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని చంద్రబాబు తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఈ ఏడాది మార్చి 1న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదులో.. ‘ప్రభుత్వం పింఛన్ల పంపిణీ, రేషన్ల పంపిణీలో వలంటీర్లను ఉపయోగిస్తోంది. వలంటీర్లు తమ గ్రామాల్లో, వార్డులో రాజకీయ కార్యకలాపాల్లో నిమ్నగమయ్యే అవకాశం ఉంది. వలంటీర్లకు ప్రభుత్వ ఖజానా నుంచే గౌరవ వేతనాలు చెల్లిసున్నందున సెక్షన్ 32 ఆర్పీ చట్ట ప్రకారం ప్రభుత్వ సేవకులకు వర్తించేలా శాఖపరమైన క్రమశిక్షణ, నిబంధనలను వీళ్లకూ వర్తింపజేయాలి.
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు వలంటీర్లపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. తర్వాత చంద్రబాబు మనిషి నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ ఈసీని కలిసి ‘‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు పింఛను డబ్బులు వాళ్ల ఖాతాల్లోనే జమ చేయాలి’’ అని సూచించారు. ఈ విషయాన్ని ఈటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. దీంతో ఈసీ ‘బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ విధానంలో పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది.
97.91% మందికి పంపిణీ
రాష్ట్రంలో 97.91 శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. 65,49,864 మందికి ఈ నెల పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం రూ.1,945.39 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి 64,13,200 మందికి పెన్షన్ డబ్బులు నేరుగాను, బ్యాంకు ఖాతాల్లో జమచేయడం ద్వారాను ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇవీ... వలంటీర్లపై బాబు, పవన్ మాటలు
‘వలంటీర్లతో ఏంటి లాభం? 5వేల రూపాయలతో ఏం ఉద్యోగం అది. గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్లకు వెళ్లడం, డిస్ట్రబ్ చేయడం. పగలు మగవాళ్లు ఉండరు.. వలంటీర్లు పోయి తలుపులు కొడుతున్నారు. ఎంత నీచం ఇది’ – 2019, సెపె్టంబర్ 27వ తేదీన చంద్రబాబు
‘ఊళ్లలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు. బ్రిటిష్ ఏజెంట్లలా వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు. ప్రజలను బెదిరిస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు’ – 2021, అక్టోబర్ 30న కుప్పంలో చంద్రబాబు
‘వలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు. ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్లు ఎవరండీ ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ ఆయనకు ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా? ఏమైనా అనుమానం ఉందా? అని ప్రశి్నస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ల దగ్గరకు వెళ్లి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ వివరాలతో వలంటీర్లకేంటి సంబంధం’ – 2023, జూలై 14న టీడీపీ మహిళా సదస్సులో చంద్రబాబు.
‘వలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. మహిళల అదశ్యం వెనుక వలంటీర్ల హస్తం ఉంది’ – 2023, అక్టోబర్ 7న ఏలూరులో పవన్‌కళ్యాణ్
పింఛన్ కోసం వెళ్లి 12 మంది మృతి
రెండు రోజుల్లో 16 మంది మృత్యువాత
సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు వికృత రాజకీయానికి రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు బలవుతున్నారు. వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛను కార్యక్రమంపై చంద్రబాబు తన మనుషులతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి పంపిణీని అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసి, బ్యాంకుల ద్వారా ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు అవ్వాతాతలు మండుటెండలు, వడగాడ్పుల్లో బ్యాంకులకు వెళ్లి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడం వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలా గురువారం పింఛను కోసం వెళ్లి వడదెబ్బకు నలుగురు మరణించగా, శుక్రవారం 12 మంది మృతి చెందారు.
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం జంబుకేశవపురానికి చెందిన జి.నాగయ్య (68), పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరుకు చెందిన ఇంజేటి మంగతాయారు (69), గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన వితంతు మహిళ చొప్పర లక్ష్మి (49), బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లల చెరువుకు చెందిన చాగంటి సుబ్బాయమ్మ (68), ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన తానికొండ రమణమ్మ (65), ఏలూరు జిల్లా పోలవరం బాపూజీ కాలనీకి చెందిన కస్తూరి కడెమ్మ, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరాంకు చెందిన కె.పోలినాయుడు (70), కర్నూలు జిల్లా మాచాపురం గ్రామానికి చెందిన ఆనంద్ (61), వైఎస్సార్ జిల్లా బద్వేలులో నాగిపోగు యల్లమ్మ (64), రామయ్య (68), పల్నాడు జిల్లా చిలకలూరిపేటకి చెందిన మాట నాగేశ్వరరావు (65), అనంతపురం జిల్లా ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన ఎరుకుల సుంకన్న (72) వడదెబ్బకు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment