ఆర్‌బీఐ గేటుముందు అవాక్కయ్యే ఘటన
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు విషయం ఓ మహిళకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తన పాత నోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లు ఇవ్వనందుకు చుట్టుపక్కలవారు, ఆర్బీఐ అధికారులు అవాక్కయ్యేలా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అధికారుల తీరును నిరసిస్తూ ఆర్బీఐ గేటుముందే అందరూ చూస్తుండగా ఆ మహిళ తన బట్టలు విప్పేసి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని ఆర్‌బీఐ భవనం ముందు బుధవారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇళ్లల్లో పనిచేసి కాలం దీసుకుంటున్న ఆ మహిళ నాలుగేళ్ల పాపను తీసుకొని గత రెండు రోజులుగా ఆర్‌బీఐ వద్దకు వస్తోంది.
ఆమె దగ్గరున్న రూ.నాలుగువేల పాత నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇవ్వాలంటూ కోరుతుంది. అయితే, బ్యాంకు అధికారులు మాత్రం నగదు మార్పిడి గడువు నవంబర్ 24తోనే ఆఖరు అని, మార్పిడి ఇప్పుడు సాధ్యం కాదంటూ ఆమెకు చెప్పారు. అయినప్పటికీ ఆమె అలాగే క్యూలో నిల్చొని తనకు డబ్బు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతోంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు.
అయితే, వారి నుంచి విడిపించుకున్న ఆమె అనంతరం ఆర్‌బీఐ గేటు ముందు నిల్చుని అక్కడ క్యూలో ఉన్న జనం, ఎదురుగా పోలీసులు, లోపల సెక్యూరిటీ గార్డులు చూస్తుండగానే తీవ్ర అసహనంతో తన బట్టలు మొత్తం విప్పేసింది. చివరికి ఆమెకు తిరిగి బట్టలు అందించి బ్యాంకు అధికారుల వద్దకు తీసుకెళ్లగా ఆమె వద్ద కనీసం గుర్తింపు కార్డు లేదు. పైగా ఆమె తీసుకొచ్చిన నోట్లు చిరిగిపోయి ఎలుకలు కొరికి ఉన్నాయి. దీంతో ఆమెకు డబ్బు ఇవ్వకుండా, కేసు పెట్టకుండా పోలీసులు విడిచిపెట్టారు.