న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నాటితో పోలిస్తే చిన్న లైన్లు, కొన్ని బ్యాంకుల్లో నిబంధనలపరమైన గందరగోళం మధ్య రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ల ప్రక్రియ మంగళవారం నాడు ప్రారంభమైంది. పాన్ లేదా ఆధార్ వంటి అధికారిక ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా ఫారంలు తప్పనిసరని ఆర్‌బీఐ సూచించకపోయినా కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది అవి కావాల్సిందే అనడంతో ఖాతాదారులు అయోమయ పరిస్థితి ఎదుర్కొన్నారు. కొన్ని బ్యాంకులు ఎల్రక్టానిక్ ఎంట్రీలు చేసుకుని నోట్లను మార్చగా, మరికొన్ని మాత్రం ఎటువంటి ధ్రువీకరణ పత్రాలేమీ అడగకుండా రిజిస్టరులో పేరు, మొబైల్ నంబరు రాయాలంటూ కస్టమర్లకు సూచించాయి.
అయితే, కొన్ని బ్యాంకులు మాత్రం పాన్ లేదా ఆధార్ కార్డులను చూపించాలని అడిగినట్లు కొందరు కస్టమర్లు తెలిపారు. అలాగే, మరికొన్ని బ్యాంకులు నోట్లను మార్చలేదని, దానికి బదులుగా తమ తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాల్సిందిగా సూచించాయని వివరించారు. అయితే, 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు (డీమానిటైజేషన్) కనిపించినంతగా చాంతాడంత లైన్లు ఈసారి కనిపించలేదు. పెద్ద ఎత్తున ప్రజలు రావొచ్చనే అంచనాలతో కూర్చునేందుకు, తాగు నీటికి ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ మంది రాలేదు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?)
నోట్లను మార్చుకునేందుకు దాదా పు 130 రోజుల పైగా వ్యవధి ఉండటం ఇందుకు కారణమని పరిశీలకులు తెలిపారు. నోట్ల మార్పిడి, డిపాజిట్లకు నాలుగు నెలల సమయం ఉండటంతో డీమానిటైజేషన్‌తో పోలిస్తే అంత హడావుడి ఏమీ లేదని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా డిపాజిట్లు స్వీకరిస్తున్నట్లు వివరించారు. రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం ఎటువంటి ఫారం లేదా పత్రం అవసరం లేదంటూ ఎస్‌బీఐ తమ శాఖలకు అధికారికంగా మెమో పంపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటువంటి ఫారం నిర్దేశించకపోయినా, తమ ఖాతాదారులు కాకపోతే మాత్రం ఐడీ ప్రూఫ్ మాత్రం అడుగుతోంది. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్)
ఇక కోటక్, హెచ్‌ఎస్‌బీసీ వంటి ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులు కాని వారి దగ్గర్నంచి ఫారం/ఐడీ ప్రూఫ్ అడుగుతున్నట్లు తెలిపాయి. కానీ యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి మాత్రం తాము ఎటువంటి ఫారం లేదా ఐడీ ప్రూఫ్‌ను తప్పనిసరి చేయడం లేదని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి చెల్లుబాటవడం కొనసాగుతుంది. సెపె్టంబర్ 30 వరకు వీటిని మార్చుకోవచ్చు లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. (అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!)
సమర్థించుకున్న ఆర్‌బీఐ..
రూ. 2,000 నోట్ల ఉపసంహరణను ఢిల్లీ హైకోర్టులో ఆర్‌బీఐ సమర్థించుకుంది. ఇది డీమానిటైజేషన్ కాదని చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని తెలిపింది., నిర్వహణ సౌలభ్యం కోసమే నోట్ల మార్పిడిని అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
ఎటువంటి ఆధారాలు చూపకుండా నోట్లను మార్చుకోవచ్చన్న ఆర్‌బీఐ, ఎస్‌బీఐ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే లాయరు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆర్‌బీఐ ఈ మేరకు వాదనలు వినిపించింది. ధ్రువీకరణ పత్రాల ప్రసక్తి లేకపోతే మాఫియా, నక్సల్స్ మొదలైన వారి వల్ల ఇది దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పిటిషనరు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న మీదట హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment