exchange of notes
-
ఆర్బీఐ కార్యాలయాల ముందు క్యూ
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాలయాల ముందు జనం బారులు దీరారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ కార్యాలయాలు కొనసాగిస్తున్నాయి. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్పిడి, డిపాజిట్‌కు సెపె్టంబర్ 30 వరకు అనుమతించారు. ఆ తర్వాత ఆఖరు తేదీని అక్టోబర్ 7 వరకు పొడిగించారు. ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. వ్యవస్థ నుంచి రూ.3.43 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత శుక్రవారం వెల్లడించారు. రూ.12,000 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ చలామణిలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. -
గాల్లోకి కరెన్సీ నోట్లు
భువనేశ్వర్: సిబ్బందితో వాగ్వాదం వలన వినియోగదారులు కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరిన విచిత్ర ఘటన స్థానిక భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కార్యాలయం ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు చిరిగిన మరియు తడిసిన ఇతరేతర కారణాలతో పాడైన నగదు నోట్లను మార్చి, కొత్త నోట్లు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకును సందర్శించారు. అయితే చెడిపోయిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర నిరుత్సాహానికి గురైన వినియోగదారులు తమ దగ్గర అక్కరకు రాకుండా ఉన్న నగదు నోట్లను గాలిలోకి రువ్వి వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించారు. ఫలితంగా రూ.100, రూ.200, రూ.500ల విలువైన చెడిపోయిన కరెన్సీ నోట్లు ఆర్బీఐ కార్యాలయం ఆవరణ మరియు ఎదురుగా ఉన్న వీధిలో పడి ఉండడంతో అసాధారణ పరిస్థితి నెలకొంది. చెడిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వచ్చాం. బ్యాంకు ఉద్యోగులు ఆ నోట్లను స్వీకరించలేదు. అందుకే ఇలా నిరసనగా నోట్లను గాలిలోకి విసిరినట్లు కొంతమంది బాధిత వర్గాలు తెలిపారు. నోట్ల మార్పిడి కౌంటర్ మూసివేత ఈనెల 3వ తేదీ నుంచి చెడిపోయిన నోట్ల మార్పిడి కౌంటర్‌ను మూసివేసినట్లు బ్యాంకు అధికారులు తెలియజేసి వినియోగదారులను నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఖాతాదారులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. బ్యాంకు అధికారులు, ఖాతాదారుల మధ్య మాటల తూటాలు పేలడంతో పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించి ఆందోళనకారులను శాంతింపజేశారు. తడిసిన, చిరిగిన, మరియు పాడైన నోట్లను మార్చుకోవాలని మరియు నాణేలు, నోట్లను ప్రజల నుంచి లావాదేవీలు లేదా మార్పిడి కోసం స్వీకరించాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు సూచించినట్లు భారత రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. దీనికోసం ప్రజలు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఖాతాదారులు, వినియోగదారులకు అసౌకర్యం లేకుండా బ్యాంకు వర్గాలు స్పందించాల్సి ఉంది. -
2,000 నోటు.. సవాలక్ష ప్రశ్నలు!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నాటితో పోలిస్తే చిన్న లైన్లు, కొన్ని బ్యాంకుల్లో నిబంధనలపరమైన గందరగోళం మధ్య రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ల ప్రక్రియ మంగళవారం నాడు ప్రారంభమైంది. పాన్ లేదా ఆధార్ వంటి అధికారిక ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా ఫారంలు తప్పనిసరని ఆర్బీఐ సూచించకపోయినా కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది అవి కావాల్సిందే అనడంతో ఖాతాదారులు అయోమయ పరిస్థితి ఎదుర్కొన్నారు. కొన్ని బ్యాంకులు ఎల్రక్టానిక్ ఎంట్రీలు చేసుకుని నోట్లను మార్చగా, మరికొన్ని మాత్రం ఎటువంటి ధ్రువీకరణ పత్రాలేమీ అడగకుండా రిజిస్టరులో పేరు, మొబైల్ నంబరు రాయాలంటూ కస్టమర్లకు సూచించాయి. అయితే, కొన్ని బ్యాంకులు మాత్రం పాన్ లేదా ఆధార్ కార్డులను చూపించాలని అడిగినట్లు కొందరు కస్టమర్లు తెలిపారు. అలాగే, మరికొన్ని బ్యాంకులు నోట్లను మార్చలేదని, దానికి బదులుగా తమ తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాల్సిందిగా సూచించాయని వివరించారు. అయితే, 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు (డీమానిటైజేషన్) కనిపించినంతగా చాంతాడంత లైన్లు ఈసారి కనిపించలేదు. పెద్ద ఎత్తున ప్రజలు రావొచ్చనే అంచనాలతో కూర్చునేందుకు, తాగు నీటికి ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ మంది రాలేదు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) నోట్లను మార్చుకునేందుకు దాదా పు 130 రోజుల పైగా వ్యవధి ఉండటం ఇందుకు కారణమని పరిశీలకులు తెలిపారు. నోట్ల మార్పిడి, డిపాజిట్లకు నాలుగు నెలల సమయం ఉండటంతో డీమానిటైజేషన్‌తో పోలిస్తే అంత హడావుడి ఏమీ లేదని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ అధికారి తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా డిపాజిట్లు స్వీకరిస్తున్నట్లు వివరించారు. రూ. 2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం ఎటువంటి ఫారం లేదా పత్రం అవసరం లేదంటూ ఎస్బీఐ తమ శాఖలకు అధికారికంగా మెమో పంపించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటువంటి ఫారం నిర్దేశించకపోయినా, తమ ఖాతాదారులు కాకపోతే మాత్రం ఐడీ ప్రూఫ్ మాత్రం అడుగుతోంది. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) ఇక కోటక్, హెచ్ఎస్బీసీ వంటి ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులు కాని వారి దగ్గర్నంచి ఫారం/ఐడీ ప్రూఫ్ అడుగుతున్నట్లు తెలిపాయి. కానీ యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి మాత్రం తాము ఎటువంటి ఫారం లేదా ఐడీ ప్రూఫ్‌ను తప్పనిసరి చేయడం లేదని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి చెల్లుబాటవడం కొనసాగుతుంది. సెపె్టంబర్ 30 వరకు వీటిని మార్చుకోవచ్చు లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. (అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!) సమర్థించుకున్న ఆర్బీఐ.. రూ. 2,000 నోట్ల ఉపసంహరణను ఢిల్లీ హైకోర్టులో ఆర్బీఐ సమర్థించుకుంది. ఇది డీమానిటైజేషన్ కాదని చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమేనని తెలిపింది., నిర్వహణ సౌలభ్యం కోసమే నోట్ల మార్పిడిని అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఎటువంటి ఆధారాలు చూపకుండా నోట్లను మార్చుకోవచ్చన్న ఆర్బీఐ, ఎస్బీఐ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ అనే లాయరు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆర్బీఐ ఈ మేరకు వాదనలు వినిపించింది. ధ్రువీకరణ పత్రాల ప్రసక్తి లేకపోతే మాఫియా, నక్సల్స్ మొదలైన వారి వల్ల ఇది దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పిటిషనరు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న మీదట హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. -
రూ.2,000 నోట్ల మార్పిడి ఇలా... బ్యాంక్ అకౌంట్ ఉండాలా?
ముంబై: రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి రూ.2,000 నోట్ల మార్పిడికి అవసరమైన ప్రొఫార్మా కూడా సిద్ధమయినట్లు తెలుస్తోంది. దీనిని అన్ని బ్యాంకులకు పంపించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. నోట్లను మార్పిడి చేయాలనుకునే వారు ఈ ప్రొఫార్మాను పూర్తి చేయడం తప్పనిసరని చెబుతున్నారు. ఈ ప్రొఫార్మా మొదటి కాలమ్‌లో నోట్లను మార్పిడి చేయాలనుకునే వారి పూర్తి పేరు రాయాలి. రెండో కాలమ్‌లో గుర్తింపు ధ్రువీకరణకు చూపే కార్డు, మూడో కాలమ్‌లో ఆ కార్డులోని నంబర్ నాలుగో కాలమ్‌లో రూ.2,000 నోట్లు, వాటి సంఖ్య, వాటి మొత్తంను తెలపాలి. చివరిగా డిపాజిట్ చేసే వ్యక్తి సంతకం చేయాలి. ఇందులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, ఎంఎన్ఆర్జీఏ కార్డు లేదా పాపులేషన్ రిజిస్టర్లను గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు. వీటిల్లో ఏదో ఒకటి గుర్తింపు పత్రం ఒరిజినల్ కాపీని బ్యాంకుకు చూపాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్ లేకున్నా నోట్ల మార్పిడికి ఓకే. గత తప్పును కప్పిపుచ్చుకునేందుకే: విపక్షాలు రూ.2,000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని కప్పిపుచ్చుకునేందుకేనా రెండో విడత నోట్ల రద్దు అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొత్తం నోట్ల రద్దు వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘మొదటిసారి నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా అసంఘటిత రంగం ఆసాంతం కుప్పకూలింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతబడి, కోట్లాది మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు’అంటూ ఖర్గే శనివారం పలు ట్వీట్లు చేశారు. టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రభుత్వ ప్రకటనను ఎద్దేవా చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మరోసారి చపలచిత్తంతో తీసుకున్న నిర్ణయం. తుగ్లక్ తరహా నోట్ల రద్దు డ్రామా’అంటూ ఆమె అభివర్ణించారు. ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రభావం సామాన్య ప్రజానీకంపై తీవ్రంగా ఉంటుందంటూ ఆమె పలు ట్వీట్లలో పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు. -
చిరిగిన నోట్ల మార్పిడి విధానాల్లో మార్పు!
ముంబై: చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించి విధి విధానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం సవరించింది. చిరిగిన లేక పాడైపోయిన 50 రూపాయలు ఆపైన డినామినేషన్స్ కరెన్సీ నోట్లకు పూర్తి విలువ పునఃచెల్లింపునకు సంబంధించి ‘‘పాడైపోయిన నోటు కనీసం ఎంత పరిమాణంలో ఉండాలి’’ అనే నిర్దేశాలను మార్చినట్లు ఆర్బీఐ వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. పెద్ద నోట్ల అనంతరం రూ.2,000 సహా అంతకన్నా తక్కువ డినామినేషన్లో కొత్త నోట్లను వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన నేపథ్యంలో ‘పాడైపోయిన లేక చిరిగిపోయిన ఆయా నోట్ల మార్పిడికి అనుగుణంగా’ ఈ సవరణలు జరిగాయి. 2016 నవంబర్‌లో రూ.500, 1,000 నోట్లను రద్దు చేశారు. వెంటనే రూ.2,000 రూ.500 వ్యవస్థలో వచ్చాయి. ఆపై క్రమంగా రూ. 100, రూ. 50, రూ. 20, రూ.10 రూ.5 కొత్త నోట్లూ వ్యవస్థలోకి విడుదలయ్యాయి. ప్రజలు చిరిగిన, పాడైపోయిన నోట్లను ఆర్బీఐ కార్యాలయాలు, నిర్దేశిత బ్యాంక్ బ్రాంచీల్లో కొత్తవాటితో మార్చుకోవచ్చు. అయితే ఈ మార్పిడి పూర్తి విలువలో జరగాలా? లేక అందులో సగం విలువే లభిస్తుందా? అన్నది చిరిగిన లేదా పాడైపోయిన కరెన్సీని స్థితి ఆధాకంగా ఉంటుంది. అంటే ఒక చిరిగిన లేక పాడైపోయిన కరెన్సీ నోట్‌ను మీరు మార్చుకోదలచుకుంటే, అందుకు సంబంధించి దాని స్థితిని బట్టి మీకు ‘రిటర్న్ కరెన్సీ నోట్’ విలువ ఉంటుంది. తాజా నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయి. -
నా బిడ్డను చంపేశారు...మమ్మల్నీ చంపేస్తారు
నా బిడ్డను చంపేశారు. మమ్మ ల్నీ చంపేస్తారు. భయపడి వేరే ఇంట్లో తలదాచుకుంటున్నాం. ప్రాణభయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వారూ పట్టించుకోలేదు. నా కొడుకును చంపేసినోళ్లే మా చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడేం చేస్తారోనని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని గడుపుతున్నాం. నోట్ల మార్పిడిలో నా కొడుకును ఓ పావుగా వాడుకున్నారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు, బయటకు తీసుకువెళ్లి చంపేశారు. చావును ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు అనుమానాస్పద మృతిగా చెబుతున్నప్పటికీ నమ్మకం కలగడం లేదు. నా బిడ్డ చావుకు నలుగురు వ్యక్తులు కారణం, వారి పేర్లతో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. దీంట్లో అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేల ప్రమేయం ఉంది. ఇప్పుడా వ్యక్తులే మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నారు. పోలీసులకు మొర పెట్టుకున్నాం. ఓ న్యాయవాదిని ఆశ్రయించాం. కానీ న్యాయం జరగలేదు. ఎవరికి చెప్పాలన్నా భయమేస్తోంది. అందుకే మీడియా ముందుకు వచ్చాం...కాపాడండి. – 27 ఏళ్ల వయసున్న కుమారుడిని పోగొట్టుకున్న కర్రి కృష్ణవేణి కన్నీరుమున్నీరు... సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెదపూడి మండలం అచ్యుతాపురత్రయానికి చెందిన కర్రి నాగేశ్వరరావు, కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యం కోసమని తిమ్మాపురంలో ఓ ఇంటిలో అద్దెకుంటున్నారు. నాగేశ్వరరావు, కృష్ణవేణి దంపతుల రెండో కుమారుడు కర్రి దుర్గా ప్రసాద్ తొలుత కేబుల్ టీవీలో పనిచేసేవారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు. కొంతకాలం క్రితం ఈయన భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా నోట్ల రద్దు తర్వాత కొంతమంది వ్యక్తులతో కలిసి నోట్లు మార్పిడి చేసేవారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కూడా వీరిని వినియోగించుకుని నోట్లు మార్పిడి చేయించుకున్నారన్న వినికిడి ఉంది. ఈ క్రమంలో వ్యవహారాలు ఏరకంగా బెడిసికొట్టాయో తెలియదు గానీ ఈ ఏడాది జనవరి 24వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లిన దుర్గాప్రసాద్ తిరిగి రాలేదు. ఆ రోజు సాయంత్రం దుర్గా ప్రసాద్ స్నేహితుడికి దుర్గా కుటుంబీకులు ఫోన్ చేసి అడిగారు. దుర్గా ప్రసాద్ ఊరు వెళ్తున్నాడని, బట్టలు, ఛార్జర్ తనను తీసుకు రమ్మన్నాడని, సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నానని సదరు స్నేహితుడు చెప్పాడు. ఆ తర్వాత రెండు రోజులు దుర్గా ప్రసాద్ స్నేహితులు ఇంటికొచ్చి అక్కడ బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. తన కుమారుడు ఎంతకీ రాలేదని అదే నెల 27వ తేదీన దుర్గా ప్రసాద్ కుటుంబీకులు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన దుర్గా ప్రసాద్ ‘తాను ఆపదలో ఉన్నానని, డబ్బు తినేశాననే అనుమానంతో నన్ను బంధించారని, మన ఇల్లును ఫలానా వ్యక్తుల పేరున రాసి ఇచ్చేయాల’ని అదే ఫోన్లో ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. ఎవరి పేర్లైతే దుర్గా ప్రసాద్ చెప్పాడో ఆ నలుగురు అదే నెల 28, 29వ తేదీల్లో ఇంటికొచ్చి ఇల్లును తమ పేరున రిజిస్ట్రేషన్ చేసేయాలని సతాయించడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే దుర్గా ప్రసాద్‌ను చంపేస్తామని బెదిరించారు. ఫిబ్రవరి 3వ తేదీన దుర్గా ప్రసాద్ నేరుగా ఫోన్ చేసి, ‘మన ఇల్లును వారి పేరున రిజిస్ట్రేషన్ చేసేయ’మని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అదే రోజున బెదిరింపులకు దిగినవారి పేరున రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఎటువంటి బాకీ లేదని లిఖిత పూర్వకంగా> ఆ నలుగురు వ్యక్తులు రాసిచ్చారు. ఆ వెంటనే తన కుమారుడ్ని ఇంటికి పంపించేయండని ఆ వ్యక్తులను కోరారు. వణికిపోతున్న కుటుంబీకులు అటు తాడేపల్లి గూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి న్యాయం జరగలేదని దుర్గా ప్రసాద్ కుటుంబీకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. మధ్యలో ఒక న్యాయవాది వద్దకు వెళ్లి చెప్పుకున్నా...ఫలితం లేదు సరికదా కొంత డబ్బు గుంజేసి పలాయనం చిత్తగించాడని దుర్గా ప్రసాద్ తల్లి కృష్ణవేణి రోదిస్తూ చెబుతున్నారు. పెద్ద వ్యక్తులు (మంత్రి, ఎమ్మెల్యేలు) ఉండటంతో తమనేం చేస్తారేమోనన్న భయంతో దుర్గా ప్రసాద్ కుటుంబీకులు వణికిపోతున్నారు. ఎవరూ న్యాయం చేయడం లేదని, కనీసం మీరైనా లోకం దృష్టికి తీసుకురావాలని, మేలు జరిగేలా చూడాలని కృష్ణవేణి ‘సాక్షి ప్రతినిధి’ని కలిసి మొరపెట్టుకున్నారు. వాస్తవమేంటో నిగ్గు తేల్చాలి అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఎవరిపైనైనా అనుమానాలు వ్యక్తం చేస్తే తప్పనిసరిగా ఆ దిశగా విచారణ జరపాలి. అనుమానాల్నే క్లూస్‌గా తీసుకుని విచారణ చేస్తే వాస్తవమేంటో బయటికొస్తుంది. మృతుడు దుర్గాప్రసాద్ కుటుంబీకుల ఆరోపణల్లో పస ఎంత ఉందో స్పష్టమవుతుంది. ముఖ్యంగా నోట్ల మార్పిడి వ్యవహారంతో సంబంధాలుండటంతో ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలున్నారని వెనక్కి తగ్గితే ఇలాంటి బాధితులు బలి అయిపోవల్సి వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దుర్గాప్రసాద్ కుటుంబీకులకు రక్షణ కల్పించడమే కాకుండా వారి అనుమానాలను నివృత్తి చేయవల్సిన అవసరం ఉంది. చనిపోయినట్టు ఫోన్ కాల్... రెండు రోజుల్లో వచ్చేస్తాడని చెప్పిన మూడో రోజే (ఫిబ్రవరి 6వ తేదీ) తాడేపల్లిగూడెం పోలీసుల నుంచి ‘దుర్గా ప్రసాద్ చనిపోయాడని, నవాబుపాలెం అనే గ్రామంలో మృతదేహం ఉందని’ ఫోన్ వచ్చింది. ఎవరైతే ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారిలో ఓ వ్యక్తితో కలిసి దుర్గా ప్రసాద్ కుటుంబీకులంతా తాడేపల్లిగూడెం వెళ్లారు. ‘తన చావుకు ఎవరూ కారణం కాదని’... అని చెప్పి సూసైడ్ నోట్ రాసి పెట్టాడని దుర్గా ప్రసాద్ కుటుంబీకుల దృష్టికి అక్కడి పోలీసులు తీసుకొచ్చారు. సదరు వ్యక్తే పోలీసులతో మాట్లాడి, సంతకాలు చేయించి, మృత దేహాన్ని తీసుకొచ్చేసేలా చేశాడు. రెండు రోజుల అనంతరం ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు వచ్చి, మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కనిపించడం మానేశారు. జరిగిన పరిణామాలన్నీ గమనించాక దుర్గా ప్రసాద్ కుటుంబీకులు తాడేపల్లిగూడెం వెళ్లి, నలుగురిపై అనుమానం ఉందని, వారే చంపేసి ఉంటారని, సూసైడ్ నోట్లో ఉన్న అక్షరాలకు ... దుర్గాప్రసాద్ రాసే అక్షరాలకు తేడా ఉందని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి సదరు వ్యక్తులు వెంబడిస్తూ, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండటంతో ప్రాణభయం ఉందని తిమ్మాపురంలో ఉన్న ఇంటిని ఖాళీ చేసి, వారి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నారు. ఇదే విషయమై జిల్లా ఎస్పీ విశాల్ గున్నీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని సదరు ఫిర్యాదులో అభ్యర్థించారు. ఫిర్యాదు వచ్చింది మృతుడు దుర్గాప్రసాద్ కుటుంబీకుల నుంచి ఫిర్యాదు వచ్చింది. దాన్ని కాకినాడ రూరల్ సీఐకి రిఫర్ చేశాను. –విశాల్ గున్నీ, జిల్లా ఎస్పీ అనుమానాస్పద మృతిగా విచారణ చేస్తున్నాం తాడేపల్లిగూడేం మండలం నవాబుపాలెంలో మృతి చెందిన దుర్గా ప్రసాద్ కేసుపై విచారణ జరుపుతున్నాం. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ వద్ద నుంచి మాకు సమాచారం వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదులో ఆరోపించిన వ్యక్తులను కూడా పిలిచి విచారించాం. వారి స్టేట్మెంట్ రికార్డు చేశాం. మృతుడికి చెందిన ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఫోరెన్సిక్ నుంచి రావల్సి ఉంది. సూసైడ్ నోట్లో అక్షరాలు దుర్గాప్రసాద్వి కావని మృతుడి తల్లిదండ్రులు చెప్పారు. కాకపోతే, అందుకు తగ్గ ఆధారాలు అడిగాం. మృతుడు తల్లిదండ్రులు సహకరించాల్సిన అవసరం ఉంది. ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ముందుకెళ్తాం. – చంద్రరావు, ఎస్ఐ, తాడేపల్లి గూడెం -
బందిపోటు దొంగ బ్యాంకుకు వచ్చి...
-
బందిపోటు దొంగ బ్యాంకుకు వచ్చి...
మల్ఖన్ సింగ్... ఈ పేరు చెబితేనే గ్వాలియర్ పరిసర ప్రాంత వాసులు వణికిపోయేవారు. అంత పేరుమోసిన గజదొంగ అతడు. అలాంటి గజదొంగ.. బ్యాంకుకు వచ్చాడు. వచ్చేటప్పుడు కూడా అతడి తుపాకి భుజాన వేలాడుతూనే ఉంది. మెడలో సెల్‌ఫోన్ కూడా దండలా వేసుకున్నాడు. బట్టతల, బుర్రమీసాలతో ఉన్న మల్ఖన్ సింగ్‌ను చూసేసరికి బ్యాంకు సిబ్బందితో పాటు అక్కడున్న వినియోగదారులు కూడా ఒక్కసారి భయపడ్డారు. తీరా.. అతడు ఎందుకు వచ్చాడా అని చూస్తే, తన దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్లను మార్చుకోడానికి వచ్చినట్లు తెలిసింది. 1970-80 ప్రాంతాలలో అతడు పేరుమోసిన గజదొంగ. అతడి మీద, అతడి ముఠా సభ్యుల మీద కలిపి దాదాపు 94 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 18 దోపిడీ, 28 కిడ్నాపులు, 19 హత్యాయత్నాలు, 17 హత్యకేసులు కూడా ఉన్నాయి. చంబల్ పరిసర ప్రాంతాల్లో అతడి పేరు చెబితే మంచినీళ్లు తాగడానికి కూడా భయపడేవారు. ఆ తర్వాత.. 1983 సంవత్సరంలో అతడు తన వాళ్లతో కలిసి నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. 1976 ప్రాంతంలో మల్ఖన్ సింగ్‌కు, నాటి బిలావో గ్రామ సర్పంచి కైలాష్ నారాయణ్‌కు పెద్ద గొడవ జరగడంతో అతడి గురించి అందరికీ తెలిసింది. నారాయణ్‌ను మిషన్గన్తో కాల్చి చంపడానికి ప్రయత్నించి, చివరకు అతడి అనుచరులిద్దరిని గాయపరిచి, ఒకరిని చంపేశాడు. నారాయణ్‌కు కూడా ఆరు బుల్లెట్లు తగిలినా, ప్రాణాలు మాత్రం నిలబడ్డాయి. ఆ ఘటన తర్వాత కొన్నాళ్లపాటు మల్ఖన్ సింగ్ యూపీలోని జలౌన్ ప్రాంతానికి పారిపోయాడు. అప్పటినుంచి యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు బుందేల్‌ఖండ్ ప్రాంతంలో అతడిపేరు మార్మోగిపోయింది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు ముఖేష్ ఆర్ చౌక్సే మల్ఖన్ సింగ్ మీద ఒక సినిమా కూడా తీశాడు. లొంగిపోయిన తర్వాత తన సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, తరచు ఆధ్యాత్మిక సభలలో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పటికీ తన ఆత్మరక్షణ కోసం మాత్రం తుపాకి వెంట తీసుకునే వెళ్తుంటాడు. -
నోట్ల మార్పిడి ఆపేస్తున్నారా?
కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్ల రూపాయలను రద్దుచేసిన తర్వాత బ్యాంకులలో వాటిని మార్చుకోడానికి విపరీతమైన క్యూలు ఉంటున్నాయి. చాలాచోట్ల వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. బ్యాంకులలో అసలు జరగాల్సిన పని మొత్తం ఆగిపోతోందని, అందుకోసం నోట్ల మార్పిడిని తాత్కాలికంగా ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందంటూ ఒక్కసారిగా జాతీయ మీడియా ప్రకటించడంతో శుక్రవారం సాయంత్రం కాసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. నిజంగా ఇప్పటికిప్పుడే నోట్ల మార్పిడిని ఆపేస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. అయితే.. కాసేపటి తర్వాత ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు నోట్ల మార్పిడి ప్రక్రియను ఆపే ఆలోచన ఏమీ లేదన్నారు. ఇప్పటికే నోట్ల మార్పిడి విషయంలో ఇన్నాళ్లుగా ఉన్న 4,500 రూపాయల పరిమితిని 2000 రూపాయలకు తగ్గించడంతో ఎక్కువ మందికి డబ్బులు అందుబాటులోకి వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే.