రూ.2,000 నోట్ల మార్పిడి ఇలా... బ్యాంక్‌ అకౌంట్‌ ఉండాలా? | RBI withdraws Rs 2,000 notes from circulation | Sakshi
Sakshi News home page

Rs 2,000 Notes: రూ.2,000 నోట్ల మార్పిడి ఇలా... బ్యాంక్‌ అకౌంట్‌ ఉండాలా?

Published Sun, May 21 2023 6:15 AM | Last Updated on Sun, May 21 2023 7:39 AM

RBI withdraws Rs 2,000 notes from circulation - Sakshi

ముంబై: రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి రూ.2,000 నోట్ల మార్పిడికి అవసరమైన ప్రొఫార్మా కూడా సిద్ధమయినట్లు తెలుస్తోంది. దీనిని అన్ని బ్యాంకులకు పంపించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌ అవుతోంది. నోట్లను మార్పిడి చేయాలనుకునే వారు ఈ ప్రొఫార్మాను పూర్తి చేయడం తప్పనిసరని చెబుతున్నారు. ఈ ప్రొఫార్మా మొదటి కాలమ్‌లో నోట్లను మార్పిడి చేయాలనుకునే వారి పూర్తి పేరు రాయాలి.

రెండో కాలమ్‌లో గుర్తింపు ధ్రువీకరణకు చూపే కార్డు, మూడో కాలమ్‌లో ఆ కార్డులోని నంబర్‌ నాలుగో కాలమ్‌లో రూ.2,000 నోట్లు, వాటి సంఖ్య, వాటి మొత్తంను తెలపాలి. చివరిగా డిపాజిట్‌ చేసే వ్యక్తి సంతకం చేయాలి. ఇందులో ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, వోటర్‌ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, ఎంఎన్‌ఆర్‌జీఏ కార్డు లేదా పాపులేషన్‌ రిజిస్టర్‌లను గుర్తింపు పత్రంగా పరిగణిస్తారు. వీటిల్లో ఏదో ఒకటి గుర్తింపు పత్రం ఒరిజినల్‌ కాపీని బ్యాంకుకు చూపాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్‌ లేకున్నా నోట్ల మార్పిడికి ఓకే.

గత తప్పును కప్పిపుచ్చుకునేందుకే: విపక్షాలు
రూ.2,000 నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని కప్పిపుచ్చుకునేందుకేనా రెండో విడత నోట్ల రద్దు అంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొత్తం నోట్ల రద్దు వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ‘మొదటిసారి నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా అసంఘటిత రంగం ఆసాంతం కుప్పకూలింది.

చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతబడి, కోట్లాది మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు’అంటూ ఖర్గే శనివారం పలు ట్వీట్లు చేశారు. టీఎంసీ చీఫ్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రభుత్వ ప్రకటనను ఎద్దేవా చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మరోసారి చపలచిత్తంతో తీసుకున్న నిర్ణయం. తుగ్లక్‌ తరహా నోట్ల రద్దు డ్రామా’అంటూ ఆమె అభివర్ణించారు. ఆర్‌బీఐ తాజా నిర్ణయం ప్రభావం సామాన్య ప్రజానీకంపై తీవ్రంగా ఉంటుందంటూ ఆమె పలు ట్వీట్లలో పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్న నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement