నా బిడ్డను చంపేశారు...మమ్మల్నీ చంపేస్తారు | murdered my son : mother | Sakshi
Sakshi News home page

నా బిడ్డను చంపేశారు...మమ్మల్నీ చంపేస్తారు

Published Wed, May 9 2018 9:23 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

murdered my son : mother  - Sakshi

నా బిడ్డను చంపేశారు. మమ్మ ల్నీ చంపేస్తారు. భయపడి వేరే ఇంట్లో తలదాచుకుంటున్నాం. ప్రాణభయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వారూ పట్టించుకోలేదు. నా కొడుకును చంపేసినోళ్లే మా చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడేం చేస్తారోనని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని గడుపుతున్నాం. నోట్ల మార్పిడిలో నా కొడుకును ఓ పావుగా వాడుకున్నారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు, బయటకు తీసుకువెళ్లి  చంపేశారు. చావును ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు అనుమానాస్పద మృతిగా చెబుతున్నప్పటికీ నమ్మకం కలగడం లేదు.  నా బిడ్డ చావుకు నలుగురు వ్యక్తులు కారణం, వారి పేర్లతో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. దీంట్లో అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేల ప్రమేయం ఉంది. ఇప్పుడా వ్యక్తులే మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నారు. పోలీసులకు మొర పెట్టుకున్నాం. ఓ న్యాయవాదిని ఆశ్రయించాం. కానీ న్యాయం జరగలేదు. ఎవరికి చెప్పాలన్నా భయమేస్తోంది. అందుకే మీడియా ముందుకు వచ్చాం...కాపాడండి. 
– 27 ఏళ్ల వయసున్న కుమారుడిని పోగొట్టుకున్న కర్రి కృష్ణవేణి కన్నీరుమున్నీరు...

సాక్షి ప్రతినిధి, కాకినాడ :  పెదపూడి మండలం అచ్యుతాపురత్రయానికి చెందిన కర్రి నాగేశ్వరరావు, కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యం కోసమని తిమ్మాపురంలో ఓ ఇంటిలో అద్దెకుంటున్నారు. నాగేశ్వరరావు, కృష్ణవేణి దంపతుల రెండో కుమారుడు కర్రి దుర్గా ప్రసాద్‌ తొలుత కేబుల్‌ టీవీలో పనిచేసేవారు. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసేవారు. కొంతకాలం క్రితం ఈయన భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా నోట్ల రద్దు తర్వాత కొంతమంది వ్యక్తులతో కలిసి నోట్లు మార్పిడి చేసేవారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కూడా వీరిని వినియోగించుకుని నోట్లు మార్పిడి చేయించుకున్నారన్న వినికిడి ఉంది. ఈ క్రమంలో వ్యవహారాలు ఏరకంగా బెడిసికొట్టాయో తెలియదు గానీ ఈ ఏడాది జనవరి 24వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లిన దుర్గాప్రసాద్‌ తిరిగి రాలేదు. ఆ రోజు సాయంత్రం దుర్గా ప్రసాద్‌ స్నేహితుడికి దుర్గా కుటుంబీకులు ఫోన్‌ చేసి అడిగారు. దుర్గా ప్రసాద్‌ ఊరు వెళ్తున్నాడని, బట్టలు, ఛార్జర్‌ తనను తీసుకు రమ్మన్నాడని, సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నానని సదరు స్నేహితుడు చెప్పాడు. 

ఆ తర్వాత రెండు రోజులు దుర్గా ప్రసాద్‌ స్నేహితులు ఇంటికొచ్చి అక్కడ బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. తన కుమారుడు ఎంతకీ రాలేదని అదే నెల 27వ తేదీన దుర్గా ప్రసాద్‌ కుటుంబీకులు ఫోన్‌ చేశారు. ఫోన్‌ ఎత్తిన దుర్గా ప్రసాద్‌ ‘తాను ఆపదలో ఉన్నానని, డబ్బు తినేశాననే అనుమానంతో నన్ను బంధించారని, మన ఇల్లును ఫలానా వ్యక్తుల పేరున రాసి ఇచ్చేయాల’ని అదే ఫోన్‌లో ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. ఎవరి పేర్లైతే దుర్గా ప్రసాద్‌ చెప్పాడో ఆ నలుగురు అదే నెల 28, 29వ తేదీల్లో ఇంటికొచ్చి ఇల్లును తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేసేయాలని సతాయించడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే దుర్గా ప్రసాద్‌ను చంపేస్తామని బెదిరించారు. ఫిబ్రవరి 3వ తేదీన దుర్గా ప్రసాద్‌ నేరుగా ఫోన్‌ చేసి, ‘మన ఇల్లును వారి పేరున రిజిస్ట్రేషన్‌ చేసేయ’మని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. అదే రోజున బెదిరింపులకు దిగినవారి పేరున రిజిస్ట్రేషన్‌ చేయించేశారు. ఎటువంటి బాకీ లేదని లిఖిత పూర్వకంగా> ఆ నలుగురు వ్యక్తులు రాసిచ్చారు. ఆ వెంటనే తన కుమారుడ్ని ఇంటికి పంపించేయండని ఆ వ్యక్తులను కోరారు.

వణికిపోతున్న కుటుంబీకులు 
అటు తాడేపల్లి గూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి న్యాయం జరగలేదని దుర్గా ప్రసాద్‌ కుటుంబీకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. మధ్యలో ఒక న్యాయవాది వద్దకు వెళ్లి చెప్పుకున్నా...ఫలితం లేదు సరికదా కొంత డబ్బు గుంజేసి పలాయనం చిత్తగించాడని దుర్గా ప్రసాద్‌ తల్లి కృష్ణవేణి రోదిస్తూ చెబుతున్నారు. పెద్ద వ్యక్తులు (మంత్రి, ఎమ్మెల్యేలు) ఉండటంతో తమనేం చేస్తారేమోనన్న భయంతో దుర్గా ప్రసాద్‌ కుటుంబీకులు వణికిపోతున్నారు. ఎవరూ న్యాయం చేయడం లేదని, కనీసం మీరైనా లోకం దృష్టికి తీసుకురావాలని, మేలు జరిగేలా చూడాలని కృష్ణవేణి ‘సాక్షి ప్రతినిధి’ని కలిసి మొరపెట్టుకున్నారు.

వాస్తవమేంటో నిగ్గు తేల్చాలి 
అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఎవరిపైనైనా అనుమానాలు వ్యక్తం చేస్తే తప్పనిసరిగా ఆ దిశగా విచారణ జరపాలి. అనుమానాల్నే క్లూస్‌గా తీసుకుని విచారణ చేస్తే వాస్తవమేంటో బయటికొస్తుంది. మృతుడు దుర్గాప్రసాద్‌ కుటుంబీకుల ఆరోపణల్లో పస ఎంత ఉందో స్పష్టమవుతుంది. ముఖ్యంగా నోట్ల మార్పిడి వ్యవహారంతో సంబంధాలుండటంతో ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలున్నారని వెనక్కి తగ్గితే ఇలాంటి బాధితులు బలి అయిపోవల్సి వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో  దుర్గాప్రసాద్‌ కుటుంబీకులకు రక్షణ కల్పించడమే కాకుండా వారి అనుమానాలను నివృత్తి చేయవల్సిన అవసరం ఉంది.  

చనిపోయినట్టు ఫోన్‌ కాల్‌... 
రెండు రోజుల్లో వచ్చేస్తాడని చెప్పిన మూడో రోజే (ఫిబ్రవరి 6వ తేదీ) తాడేపల్లిగూడెం పోలీసుల నుంచి ‘దుర్గా ప్రసాద్‌ చనిపోయాడని, నవాబుపాలెం అనే గ్రామంలో మృతదేహం ఉందని’ ఫోన్‌ వచ్చింది. ఎవరైతే ఇల్లును రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారో వారిలో ఓ వ్యక్తితో కలిసి దుర్గా ప్రసాద్‌ కుటుంబీకులంతా తాడేపల్లిగూడెం వెళ్లారు. ‘తన చావుకు ఎవరూ కారణం కాదని’... అని చెప్పి సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టాడని దుర్గా ప్రసాద్‌ కుటుంబీకుల దృష్టికి అక్కడి పోలీసులు తీసుకొచ్చారు. సదరు వ్యక్తే పోలీసులతో మాట్లాడి, సంతకాలు చేయించి, మృత దేహాన్ని తీసుకొచ్చేసేలా చేశాడు. రెండు రోజుల అనంతరం ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తులు వచ్చి, మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కనిపించడం మానేశారు. జరిగిన పరిణామాలన్నీ గమనించాక దుర్గా ప్రసాద్‌ కుటుంబీకులు తాడేపల్లిగూడెం వెళ్లి, నలుగురిపై అనుమానం ఉందని, వారే చంపేసి ఉంటారని, సూసైడ్‌ నోట్‌లో ఉన్న అక్షరాలకు ... దుర్గాప్రసాద్‌ రాసే అక్షరాలకు తేడా ఉందని  ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి సదరు వ్యక్తులు వెంబడిస్తూ, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండటంతో ప్రాణభయం ఉందని తిమ్మాపురంలో ఉన్న ఇంటిని ఖాళీ చేసి, వారి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నారు. ఇదే విషయమై జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని సదరు ఫిర్యాదులో అభ్యర్థించారు.

ఫిర్యాదు వచ్చింది 
మృతుడు దుర్గాప్రసాద్‌ కుటుంబీకుల నుంచి ఫిర్యాదు వచ్చింది. దాన్ని కాకినాడ రూరల్‌ సీఐకి రిఫర్‌ చేశాను. 
–విశాల్‌ గున్నీ, జిల్లా ఎస్పీ

అనుమానాస్పద మృతిగా విచారణ చేస్తున్నాం
తాడేపల్లిగూడేం మండలం నవాబుపాలెంలో మృతి చెందిన దుర్గా ప్రసాద్‌ కేసుపై విచారణ జరుపుతున్నాం.   తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ వద్ద నుంచి మాకు సమాచారం వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదులో ఆరోపించిన వ్యక్తులను కూడా పిలిచి విచారించాం. వారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. మృతుడికి చెందిన ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఫోరెన్సిక్‌ నుంచి రావల్సి ఉంది. సూసైడ్‌ నోట్‌లో అక్షరాలు దుర్గాప్రసాద్‌వి కావని మృతుడి తల్లిదండ్రులు చెప్పారు. కాకపోతే, అందుకు తగ్గ ఆధారాలు అడిగాం. మృతుడు తల్లిదండ్రులు సహకరించాల్సిన అవసరం ఉంది. ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఆధారంగా ముందుకెళ్తాం. 
– చంద్రరావు, ఎస్‌ఐ, తాడేపల్లి గూడెం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement