మల్ఖన్ సింగ్... ఈ పేరు చెబితేనే గ్వాలియర్ పరిసర ప్రాంత వాసులు వణికిపోయేవారు. అంత పేరుమోసిన గజదొంగ అతడు. అలాంటి గజదొంగ.. బ్యాంకుకు వచ్చాడు. వచ్చేటప్పుడు కూడా అతడి తుపాకి భుజాన వేలాడుతూనే ఉంది. మెడలో సెల్‌ఫోన్ కూడా దండలా వేసుకున్నాడు. బట్టతల, బుర్రమీసాలతో ఉన్న మల్ఖన్ సింగ్‌ను చూసేసరికి బ్యాంకు సిబ్బందితో పాటు అక్కడున్న వినియోగదారులు కూడా ఒక్కసారి భయపడ్డారు. తీరా.. అతడు ఎందుకు వచ్చాడా అని చూస్తే, తన దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్లను మార్చుకోడానికి వచ్చినట్లు తెలిసింది. 1970-80 ప్రాంతాలలో అతడు పేరుమోసిన గజదొంగ. అతడి మీద, అతడి ముఠా సభ్యుల మీద కలిపి దాదాపు 94 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 18 దోపిడీ, 28 కిడ్నాపులు, 19 హత్యాయత్నాలు, 17 హత్యకేసులు కూడా ఉన్నాయి. చంబల్ పరిసర ప్రాంతాల్లో అతడి పేరు చెబితే మంచినీళ్లు తాగడానికి కూడా భయపడేవారు.