Dinesh Trivedi
-
బీజేపీ గూటికి చేరిన దినేశ్ త్రివేది
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి చెందిన మరో కీలక నాయకుడు బీజేపీలో చేరారు. తృణమూల్ మాజీ ఎంపీ, పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన దినేశ్ త్రివేది శనివారం బీజేపీలో చేరారు. మమత ప్రభుత్వంలో అవినీతి, హింస రాజ్యమేలుతున్నాయని ఆరోపించిన దినేశ్ అందుకే తాను పార్టీ వీడినట్టుగా చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆయన బీజేపీ గూటికి చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా త్రివేదిపై నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఇన్నాళ్లూ రాంగ్ పార్టీలో రైట్ మ్యాన్ ఉన్నారని, ఇప్పుడు రైట్ పార్టీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అనంతరం దినేశ్ త్రివేది విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడే అసలైన మార్పు చూస్తారని అన్నారు. జీవితంలో ఇలాంటి బంగారు క్షణాల కోసమే తాను ఎదురు చూశానని వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీల్లో కుటుంబమే సుప్రీంగా ఉంటుందని, కానీ బీజేపీలో ప్రజలే సుప్రీం అని కితాబునిచ్చారు. ఆట మొదలైంది అన్న తృణమూల్ కాంగ్రెస్ నినాదాన్ని ఎద్దేవా చేసిన త్రివేది రాజకీయాలంటే సీరియస్‌గా పని చేయాలని, కానీ మమత రాజకీయాన్ని ఆటని చేశారని ధ్వజమెత్తారు. మరోవైపు దినేశ్ త్రివేది పార్టీ మారడాన్ని తృణమూల్ తప్పు పట్టింది. ఎన్నికల వేళ పార్టీని వెన్ను పోటు పొడిచారంది ఒకప్పుడు దీదీకి కుడి భుజం దినేశ్ త్రివేది తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత జనతాదళ్‌లో చేరారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌లో 20 ఏళ్ల పాటు ఉన్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత కాలంలో విభేదాలు తలెత్తడంతో మమత ఆయనని కేబినెట్ నుంచి తొలగించారు. మళ్లీ 2019లో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఆయనని రాజ్యసభకు పంపింది. ఇలా ఉండగా, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన సొనాలి గుహ కూడా బీజేపీలో చేరనున్నట్టుగా సూచనప్రాయంగా వెల్లడించారు. -
ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఏడాదిలోనే కేంద్ర మాజీ మంత్రి దినేశ్ త్రివేది తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్న ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. అయితే ఆయన ఎప్పటి నుంచో బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందించారు. ఆ తెల్లారి ఆయన రాజ్యసభకు రాజీనామా చేయడం బెంగాల్లో కీలక పరిణామంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన దినేశ్ త్రివేదిని గతేడాది తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభకు పంపించింది. అయితే పశ్చిమబెంగాల్లో రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయి. బీజేపీలోకి తృణమూల్ పార్టీ నాయకుల వలసలు పెరగడంతో ఈ క్రమంలోనే ఆయన కూడా రాజ్యసభకు రాజీనామా చేశారని తెలుస్తోంది. రాజీనామా చేసిన సందర్భంగా దినేశ్ త్రివేది బెంగాల్లో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింస జరుగుతున్నా నేను నిస్సహాయుడిగా మిగిలిపోయా. బెంగాల్లో జరుగుతున్న హింసతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లనుంది. ఇక్కడ కూర్చోవడం నాకు చాలా వింతగా అనిపిస్తోంది. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. ఇక్కడ కూర్చున్నా నేనేమీ మాట్లాడలేకపోతున్నా. మరి ఏం లాభం. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని త్రివేది ప్రకటించారు. ‘పార్టీ ఆదేశాలను పాటించాలని ఉన్నా తాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా. నన్ను ఇక్కడికి పంపినందుకు పార్టీకి కృతజ్ఞతలు. నేను రాష్ట్రానికి సేవ చేయాలని అనుకుంటున్నా’ అని దినేశ్ త్రివేది చెప్పారు. ఆయన రాజీనామా తృణమూల్‌ను షాక్‌కు గురి చేసింది. అయితే ముందు నుంచే ఆయన రాజీనామా సంకేతాలు ఇచ్చారు. గురువారమే దినేష్ త్రివేదీ.. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అభినందించారు. ఆయన ఇలా చేస్తారని అనుకోలేదని తృణమూల్ కాంగ్రెస ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. 1980లో కాంగ్రెస్ పార్టీతో ఆయన రాజకీయ జీవితం మొదలైంది. అనంతరం జనతా దళ్‌లో చేరారు. ఆ తర్వాత 1998లో దినేశ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా దినేశ్ త్రివేది బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇంకా తృణమూల్ పార్టీకి ఆయన రాజీనామా చేయలేదు. -
'కర్ణాటక మృతుల కుటుంబాలకు మమతా బెనర్జీ భరోసా'
మంగళూరు : పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. మాట ఇచ్చిన 48 గంటల లోపే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కర్ణాటకలోని మంగళూరు నగరంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెక్కులు అందజేసింది. మృతులు మొహమ్మద్ జలీల్, నౌషీన్‌ల కుటుంబాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది, నదీముల్లా హక్‌లు పరామర్శించారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. చదవండి: సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది! పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను వ్యతిరేకిస్తూ మంగళూరులో ఆందోళనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో జలీల్, నౌషీన్‌లు చనిపోయారు. ఆందోళనకారులు బందర్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది మాట్లాడుతూ.. ఇది మానవతా సాయం మాత్రమే. ఇందులో రాజకీయాలేమీ లేవు. ఇక్కడి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది కానీ ఇంతవరకూ ఇవ్వలేదు. అది పుండు మీద కారం చల్లటం వంటిదే. మమతా బెనర్జీ ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. చదవండి: సిద్ధార్థ్ రాజకీయ ఎంట్రీపై సస్పెన్స్ వీడినట్టే..! -
సీఎంను దెయ్యమన్న కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆమెను దెయ్యంగా వర్ణించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆధునిక ఝాన్సీరాణిలా మమతా బెనర్జీ పోరాడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది గురువారం వ్యాఖ్యానించారు. బీజేపీ కక్ష సాధింపు చర్యలను ఆమె దీటుగా ఎదుర్కొంటున్నారని కితాబిచ్చారు. దీనిపై గిరిరాజ్ సింగ్ స్పందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఝాన్సీరాణితో మమతా బెనర్జీని పోల్చడం కంటే అవమానం మరోటి లేదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌తో ఆమెను పోల్చారు. సీబీఐతో మమతా బెనర్జీ వివాదం నేపథ్యంలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. -
2వేల నోట్లను నిలిపేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరోసారి నగదు కష్టాలు తీవ్రతరమయ్యాయి. ఏటీఎంల్లో, బ్యాంకుల్లో నగదు లభించకపోవడంతో మరోసారి పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. మళ్లీ నోట్ల కష్టాలు ఎందుకు పునరావృతం అయ్యాయి? రూ. 2వేల నోట్లు బయటకు రాకుండా నిజంగానే నిలిపేశారా? ఇదే విషయమై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దినేశ్ త్రివేది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో నగదు కొరతకు అసలు కారణాలు ఏమిటో వెల్లడించాలని కోరారు. రూ. 2వేల నోట్ల చెలామణిని నిలిపేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు. ఆర్థిక రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా ఉన్న దినేశ్ త్రివేది బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘రూ. 2వేల నోట్లను నిలిపివేయడంతోనే దేశంలో మళ్లీ నగదు కొరత ఏర్పడినట్టు కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. నగదు కొరత విషయంలో నిజానిజాలపై కేంద్రం వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, ప్రజాస్వామ్యంలో ప్రజలను మభ్యపెట్టజారని, ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం సరికాదని అన్నారు. గత కొన్ని నెలలుగా తనకు కూడా బ్యాంకుల్లో రూ. 2వేల నోట్లు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేయడంతో వ్యవస్థలోని వాటి విలువను భర్తీ చేయడానికి కేంద్రం రూ. 2వేలనోట్లు అమల్లోకి తీసుకొచ్చిందని, ఈ నేపథ్యంలో రూ. 2వేల నోట్ల కొనసాగింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. -
రైల్వే మాజీ మంత్రికి రైలులో షాక్..
న్యూఢిల్లీ : రైలు ప్రయాణం చేసిన రైల్వేశాఖ మాజీ మంత్రి షాక్ తిన్నారు. హ్యాపీగా ఓ జ్యూస్ తాగుదామని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని ఓపెన్ చేసి అందులో బూజు ఉండటంతో అవాక్కయ్యారు. వెంటనే మీడియాను పిలిచి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వే శాఖ ఎంత దారుణంగా పనిచేస్తుందో ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. రైల్వేలో ప్రయాణీకులకు అందించే ఆహార పదార్థాలు ఏమాత్రం శుభ్రంగా లేవని, పరిశుభ్రత అనే రైళ్లల్లో కొరవడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్ త్రివేది శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరారు. వెళుతూ మధ్యలో కొన్ని మంచినీళ్లు, నిమ్మరసం, జ్యూస్‌లాంటివి ఆర్డర్ చేశారు. అవి వచ్చాక ఓపెన్ చేసి చూడగా అందులో బూజు, బ్యాక్టీరియా కనిపించడంతో ఓ మీడియా చానెల్‌కు లైవ్‌లో చూపించారు. 'ఈ రోజు దసరా.. నేను నిమ్మరసం తాగుతామని ఓపెన్ చూశాను.. చూడండి లోపల ఏం ఉందో మీరే చూడండి.. ఇది మనం తాగేందుకు ఉపయోగించేది' అని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే టిక్కెట్ చార్జీలు పెంచడం తెలిసిన కేంద్ర ప్రభుత్వానికి పరిశుభ్రతను, నాణ్యమైన ఆహారపదార్థాలను అందించాలని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'బుల్లెట్ ట్రైన్స్ కాదు.. బెటర్ ట్రాక్స్ కావాలి'
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో రెండు రైళ్లు నదిలోకి పడిన దుర్ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతుండగానే రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమాల్ కాంగ్రెస్ నేత దినేశ్ త్రివేది.. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశానికి బుల్లెట్ రైళ్ల కంటే నాణ్యమైన ట్రాక్‌లు అవసరమని త్రివేది వ్యాఖ్యానించారు. రైల్వే ప్రమాద సంఘటనలు జరగకుండా ప్రయాణికులను కాపాడాలంటే నాణ్యమైన ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ధనవంతులు ప్రయాణించే రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని, మిగిలిన రైళ్ల భద్రత చర్యలను గాలికి వదిలేస్తారమని త్రివేది విమర్శించారు. ఈ దుర్ఘటన గురించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. రైల్వే మంత్రి సురేష్ ప్రభు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఇది నాగరిక సమాజ లక్షణమా?
-
ఇది నాగరిక సమాజ లక్షణమా?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఛానల్ ప్రసారాలను నిలిపివేయడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్ త్రివేది మండిపడ్డారు. సభలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని ఆయన తెలిపారు. కాని కెమెరాలు ఆపేశారని, ఇది నాగరిక సమాజం లక్షణమా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు ఎమర్జెన్సీ కాలంలో జరిగాయన్నారు. ఇలా జరుగుతున్నప్పుడు పార్లమెంటులో తమకు పనేం ఉంటుందని ఆయన అన్నారు. అందుకే తాము వాకౌట్ చేసి వచ్చామని దినేష్ త్రివేది చెప్పారు. ఈ రోజు తాము చాలా బాధపడుతున్నామన్నారు. ప్రజాస్వామ్యం ఓడిపోయింది, బిల్లు పాసైంది అని దినేష్ త్రివేది అన్నారు.