21 వేల కోట్లు వృథా చేశారు: శివసేన
21 వేల కోట్లు వృథాగా పారబోశారు...
Published Fri, Sep 1 2017 1:17 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM
సాక్షి, ముంబై: నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదిక వెలువరించింది. మొత్తం పాత నోట్లలో 99 శాతం తిరిగి వచ్చేశాయని ఘనంగా చెప్పుకుంటుండగా, విపక్షాలు మాత్రం ఘోర వైఫల్యంగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇక ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం శివసేన వంతు రానే వచ్చింది.
శివసేన అధికార పత్రిక సామ్న సంపాదకీయంలో డీమానిటైజేషన్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కథనం ప్రచురించింది. డిపాజిట్ కానీ 1 శాతం నల్లధనం కాదని, బహుశా బ్యాంకు క్యూలో నిలుచునే ఓపిక లేకనే సామాన్యులు ఆ డబ్బును వదిలేసి ఉంటారని తెలిపింది. నిజంగా నల్లధనం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ల మీద నోట్ బందీ(నోట్ల రద్దు) ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందని పేర్కొంది. సుమారు 26,000 కోట్ల ధనం బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదని, పైగా కొత్త నోట్ల ముద్రణ పేరిట మరో 21,000 కోట్లను అదనంగా వృథా చేశారని కేంద్రంపై విమర్శలు గుప్పించింది.
కేవలం పేరు ప్రచారం కోసమే ఆ సొమ్మంతా పారబోసిందంటూ ఎద్దేవా చేసింది. సున్నితంగా పయనిస్తున్న భారత ఆర్థిక పురోగతిని నోట్ల రద్దు నిర్ణయం కుదేలు చేసిందని, ధరలు విపరీతంగా పెరిగాయని, వ్యాపారాలు దెబ్బతిన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త నోట్ల ద్వారా ఫేక్ కరెన్సీని అడ్డుకోవచ్చని మోదీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆ సంగతి ఏమోగానీ, సైనికుల మరణాలు మాత్రం పెరిగిపోయానని తెలిపింది. కొత్త నోటు విడుదలయిన నెలరోజులకే నకిలీ నోట్లు మార్కెట్ లోకి చెలామణి వచ్చాయని, తద్వారా మోదీ ప్రయత్నం విఫలమైందని వివరించింది.
మధ్యతరగతి ప్రజలను మోదీ తీవ్రంగా కష్టపెట్టారని, బీజేపీ కూడా కొత్త నోట్ల ద్వారానే(ఓటర్లను ప్రలోభపెట్టి) వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోందంటూ పరోక్ష కామెంట్లతో కథనం ప్రచురించింది.
Advertisement
Advertisement