నోట్ల రద్దుకు రెండేళ్లు కావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న రద్దయిన పెద్ద నోట్లు
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో సామాన్య ప్రజలకు పెద్ద కష్టాలే వచ్చాయి. సరిగా రెండేళ్ల క్రితం (2016 నవంబర్ 8న )నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రూ.100 నోటు కోసం అన్ని వర్గాల ప్రజలూ నానాపాట్లు పడ్డారు. ప్రకటన మరుసటి రోజు నుంచే చేతిలో రూ.కోట్ల కరెన్సీ ఉన్నా విలువలేని నోట్లుగా చూడాల్సి వచ్చింది. నోట్ల మార్పిడి, కొత్త కరెన్సీ నోట్ల కోసం జనం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
కరెన్సీ కష్టాలతో కటకట
పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు అందుకనుగుణంగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కరెన్సీ కష్టాలతో అల్లాడిపోయారు. 34 ప్రధాన బ్యాంకులు, వాటి పరిధిలో 457 బ్యాంకు శాఖలు, 556 ఏటీఎంలు ఉన్నా నగు కొరత తీవ్రస్థాయిలో ఏర్పడింది. లక్షలకు లక్షలు దగ్గరున్నా అవి చెల్లుబాటు కాకపోవడంతో భగవంతుడా ఏమిటీ శిక్ష, పగవాడికి కూడా ఇలాటి కష్టాలు రాకూడదని కోరుకున్నారు.
పూటకోనిబంధన
పెద్ద నోట్ల మార్పిడి, డిపాజిట్లపై పూటకో నిబంధన, రోజుకో షరతు విధించడం, బ్యాంకుల్లో సరైన సదుపాయాలు, తగినంత నగదు నిల్వలు లేకపోవడంతో అటు బ్యాంకర్లు ఇటు అన్ని వర్గాల ప్రజలు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. మొదట్లో కేవలం రూ.2 వేల కొత్త నోట్లు మాత్రమే విడుదల చేయడంతో దాన్ని చిల్లర ‘మార్పిడి’ చేసుకునేందుకు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రూ.100 నోటు ఒకటి దొరికిందంటే పండుగ చేసుకున్నారు.
పెళ్లిళ్లు, చదువులు, శుభకార్యాలకు అవస్థలు
పెళ్లిళ్లు, చదువులు, ఆస్పత్రుల్లో రోగులకు డబ్బులు కట్టలేక సతమతమయ్యారు. ఫించన్లకు వృద్ధులు, వికలాంగులు, పెన్షన్‌కు పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు, వేతనం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ వర్గాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు, పొట్టకూటి కోసం పేదలు, తోపుడుబండ్లు, చిరువ్యాపారులు, ఇతరత్రా కార్మికులు, కూలీలు...తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండేళ్లు పూర్తవుతున్నా 2016 నవంబర్ 8 తర్వాత పడిన కష్టాలు, కన్నీళ్లు సామాజిక మాధ్యమాల్లో గుర్తుకు చేసుకుంటున్నారు.
ప్రజలకు నిద్రలేని రోజులెన్నో
పెద్దనోట్ల రద్దు ప్రకటనను ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే ప్రజల వెన్నులో వణుకుపుట్టినంత పని అవుతుందని చెప్తారు. కేవలం రూ.100 నోటు కోసం నిద్రాహారాలు మాని బ్యాంకుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాసిన సందర్భాలూ ఉన్నాయి. అన్ని పనులూ వదిలేసి బ్యాంకులకు పరుగులు తీశారు. అక్కడ పోలీసు పహారా నడుమ రోజంతా నిలబడితేగానీ చేతికి నోట్లు అందని పరిస్థితి.ఏ బ్యాంకుకు వెళ్లినా ‘నోక్యాష్–క్యాష్ నిల్’ బోర్డులు కనిపించాయి. ఏటీఎంలు నిరవధికంగా మూతబడ్డాయి. నోట్ల రద్దు సందర్భంగా ఏమి జరుగుతోందో ఏమి జరగబోతోందో అంతుచిక్కక ప్రజలు దిక్కుతోచని పరిస్థితి అనుభవించారు. పేదలు, సామాన్యులు, రైతులు, చిరు వ్యాపారుల మరీ ఇబ్బందికర జీవితం గడిపారు.
Comments
Please login to add a commentAdd a comment