రూ.15లక్షల హామీపై మోదీకి లాలూ సూటిప్రశ్న!
పట్నా: ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. రూ.500, రూ.1000 నోట్లరద్దులో మోదీ తీరును వ్యతిరేకిస్తూ లాలూ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. మోదీ హామీ ఇచ్చినట్లుగా 50 రోజులు సమయంలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తారా అని ప్రశ్నించారు. 50 రోజుల వరకు కష్టాలు పడేందుకు సిద్ధమే.. కానీ ఆ తర్వాత కచ్చితంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తారా లేదోనని అనుమానం వ్యక్తంచేశారు.
నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపాలని కేంద్ర భావించినట్లయితే.. కొత్తగా రూ.2000 నోటు ఎందుకు ప్రవేశపెట్టారని లలూ ప్రశ్నించారు. ప్రజల్లో కూడా ఈ విషయంపై ఎన్నో నోట్లరద్దు వల్ల పనులన్నీ వదిలేసి కేవలం ఏటీఎం కేంద్రాల వద్ద క్యూలో నిల్చుండటంతో సేవలు, ఉత్పత్తి తగ్గిపోయాయని, వారి విలువైన సమయం వృథా అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
ఒకవేళ ప్రతి ఒక్కరి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో నగదు జమచేయపోతే ప్రస్తుతం మోదీ చేసింది సర్జికల్ స్ట్రైక్ కాదని.. ఫార్జికల్ స్ట్రైక్ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నల్లధనాన్ని తీసుకొచ్చి రూ.15లక్షల నగదును అందరి ఖాతాలకు ఇస్తామని 2014 ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆర్జేడీ చీఫ్ లాలూ గుర్తుచేశారు. మోదీ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలన్నారు. బ్యాంకుల నుంచి నల్లకుభేరులు ఎంతెంత రుణాలు తీసుకున్నారో తెలుసుకుని వాటిని రాబట్టాలని సూచించారు.