పెద్దనోట్ల రద్దుపై మళ్లీ ప్రధాని భావోద్వేగం
- నల్లధనం, అవినీతిపై పోరులో ఇది ఆరంభం మాత్రమే
- పార్టీ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అంశంపై బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. అవినీతి, నల్లధనంపై పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని, వీటిపై మున్ముందు మరింత ముమ్మరంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై దుష్ప్రచారం చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. పన్ను ఎగవేతను ఎదుర్కొనేందుకు చేపట్టిన పెద్దనోట్ల రద్దు సంస్కరణతో ప్రజలకు ఓనగూడ ప్రయోజనాలకు గురించి వివరించాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు.
పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు సమావేశాలు అట్టుడుకుతున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. పెద్దనోట్ల రద్దుకు మద్దతు పలుకుతూ.. ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. పెద్దనోట్ల రద్దుకు అనుకూలంగా ఈ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించామని, దీనిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రవేశపెట్టారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విలేకరులకు తెలిపారు.