సాక్షి,చెన్నై: నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన క్రమంలో ఈ నిర్ణయంపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. నవంబర్ 8 భారత్‌కు బ్లాక్‌డే అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో 1947లో మనం సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కోల్పోయామన్నారు. ముందస్తు సన్నాహాలు చేపట్టకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ నోట్ల రద్దుతో చోటుచేసుకున్న మరణాలకు బాధ్యత వహించాలన్నారు.
నల్లధనాన్ని నిర్మూలించలేని నోట్ల రద్దు ప్రజలందరి జీవితాల్లో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి, యశ్వంత్ సిన్హా వంటి బీజేపీ సీనియర్ నేతలే నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టారన్నారు. నోట్ల రద్దుతో నల్లధనానికి చెక్ పెట్టవచ్చని, నకిలీ నోట్లను అరికట్టవచ్చని, ఉగ్రనిధులకు అడ్డుకట్ట వేయవచ్చని పాలకులు చెప్పినా ఇవేమీ నెరవేరలేదని ఆరోపించారు.
ఇక డీఎంకే చీఫ్ కరుణానిధితో ప్రధాని సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందని, దీని వెనుక రాజకీయ అంశాలేమీ లేవని స్టాలిన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment