‘నోట్ల రద్దు’పై తాజా ఆదేశం
ముంబై: నోట్ల రద్దు నిర్ణయం తర్వాతి పరిస్థితులు, కేంద్రం నిర్ణయం తర్వాత జమ అయిన పాతనోట్ల వివరాలను ఇవ్వాలంటూ పార్లమెంటరీ కమిటీ.. ఆర్బీఐని ఆదేశించింది. నవంబర్ 8 ప్రకటన తర్వాత వ్యవస్థలోకి వచ్చిన నల్లధనం వివరాలూ పొందుపరచాలని సూచించింది. కాంగ్రెస్ ఎంపీ టీ సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలోని 15 మంది సభ్యుల కమిటీ బుధవారం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎన్నెస్ విశ్వనాథన్, బీపీ కనుంగోలతో సమావేశమైంది. సీనియర్ బ్యాంకర్లు, ఐఆర్‌డీఏఐ చైర్మన్ టీఎస్ విజయన్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులూ పొల్గొన్నారు.
‘నోట్లరద్దు తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధించిన అంశాలపై కమిటీ ఆర్బీఐ గవర్నర్లను ప్రశ్నించింది. వ్యవస్థలోకి వచ్చిన రద్దయిన నోట్లు, దొంగనోట్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. నోట్లరద్దు ద్వారా వ్యవస్థలోకి వచ్చిన నల్లధనం ఎంతని కూడా కమిటీ ప్రశ్నించింది’ అని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. మోసాలు జరగకుండా వినియోగదారులను కాపాడేందుకు తీసుకుంటున్న భద్రత చర్యలేంటని కూడా ఆర్బీఐని ప్రశ్నించింది.
అయితే డిపాజిట్ అయిన నోట్ల లెక్కింపు జరుగుతున్నందున ఇప్పుడే సమాచారం ఇచ్చే పరిస్థితి లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు చెప్పినట్లు తెలిసింది. కరెన్సీ కొరత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏమేం చర్యలు తీసుకుంటున్నారని బ్యాంకర్లను కమిటీ ప్రశ్నించింది. ఈ–బీమా పాలసీలను ఇవ్వటంలో ఐఆర్‌డీఏఐ నిబంధనలను కమిటీ పరిశీలించింది.