భారీగా ఎగిసిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు!
భారీగా ఎగిసిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు!
Published Mon, Dec 12 2016 10:02 AM | Last Updated on Mon, Jul 29 2019 6:10 PM
న్యూఢిల్లీ : పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న నిర్ణయం ప్రకటించిన అనంతరం ప్రజలు ఒక్కసారిగి బెంబేలెత్తిపోయిన సంగతి తెలిసిందే. అయితే పాత నోట్ల చెల్లుబాటు కోసం పెట్రోల్, డీజిల్ బంకుల్లో,ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఈ నోట్లను తీసుకుంటారని, బ్యాంకుల్లో వీటిని మార్చుకోవచ్చని ఉపశమన వార్తలను ప్రకటించారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోల్, డీజిల్ బంకులు దగ్గర ఎక్కడ చూసినా చాతాడంత క్యూలైన్లే దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్క నవంబర్ నెలలోనే ఇంధన అమ్మకాలు ఏకంగా 10 శాతానికి పైగా ఎగిసినట్టు తెలిసింది. ముందస్తు అంచనాలను తిరగరాసేస్తూ ఈ అమ్మకాలు నమోదుకావడం గమనార్హం. చాలామంది ప్రజలు రద్దైన పాత నోట్లతో తమ ట్యాంకులను నింపేసుకున్నట్టు వెల్లడైంది.
మూడు ప్రభుత్వ రంగ సంస్థలు-ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం సంస్థలే నోట్ బ్యాన్ తర్వాత నవంబర్ 8 నుంచి డిసెంబర్ 7 మధ్యకాలంలో రోజుకు సగటున 89,000 కిలో లీటర్ల పెట్రోల్ను విక్రయించినట్టు వెల్లడైంది. గతేడాది నవంబర్తో పోలిస్తే ఆ అమ్మకాలు సగటున 11 శాతం కంటే ఎక్కువగా పెరిగాయని ఈ సంస్థల డేటాలో తెలిసింది. ఈ నెల అక్టోబర్లో పెట్రోల్ అమ్మకాలు గతేడాది కంటే 1 శాతం తక్కువగానే నమోదయ్యాయి. అదేవిధంగా పెట్రోల్ అమ్మకాలకు ఏమాత్రం తీసిపోకుండా డీజిల్ అమ్మకాలు కూడా నమోదైనట్టు వెల్లడైంది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 7 వరకున్న కాలంలో రోజుకు సగటున 2,25,000 కిలో లీటర్లు అమ్ముడుపోయి, 11.4 శాతానికి పైగా పెరుగుదలను రికార్డు చేసినట్టు తెలిసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే మొత్తం ఇంధన అమ్మకాల్లో 90 శాతం ఆక్రమిస్తాయి.
Advertisement